తెలుగువాళ్లు నా వల్లే బాగుపడ్డారు | Chandrababu boasted in Bobbili and Tuni metings | Sakshi
Sakshi News home page

తెలుగువాళ్లు నా వల్లే బాగుపడ్డారు

Published Thu, Jan 11 2024 5:21 AM | Last Updated on Sat, Feb 3 2024 5:34 PM

Chandrababu boasted in Bobbili and Tuni metings - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి ప్రతినిధి, కాకినాడ/తుని: తెలుగువాళ్లు తన వల్లే బాగుపడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పుకొన్నారు. టెక్నాలజీకి ప్రాముఖ్యత కల్పించి ముందుగా తాను తీసుకున్న నిర్ణయం వల్లే ప్రపంచమంతా తెలుగువారు రాణిస్తున్నారని అన్నారు. తాను ఆరోజు కష్టపడితేనే ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. ఈరోజు హైదరాబాద్‌పై తన ప్రగాఢ ముద్ర కనపడుతోందని అన్నారు. రా కదలి రా పేరుతో బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలి, కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.

అబద్ధాలు, ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. ఇటీవల తనకు కష్టం వస్తే ఎనభై తొంభై దేశాల్లో సంఘీభావం ప్రకటించారని, అదీ తన సత్తా అని చెప్పారు.  ఐదేళ్లుగా మన రాష్ట్రం వెనుకబడిపోయిందని, తామొస్తే ప్రజల భవిష్యత్తు బంగారం చేస్తానని అన్నారు. యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, కరెంటు చార్జీలు తగ్గిస్తాం అంటూ పలు హామీలు గుప్పించారు. తాను చంద్రన్న బీమా, పెళ్లి కానుక, విదేశీ విద్య ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్నది రద్దుల ప్రభుత్వమని, పేదవాడి వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు.

నోటికొచ్చినట్లు...
‘పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్‌ ఫొటో పెడతారా? ఆయనో ఏసుప్రభువు. ఎక్కడకు పోతున్నారు? ఆయన పంపించారా ఏసు ప్రభువని? సర్వే రాళ్లపై ఆయన ఫొటో ఏంటి? భూ రక్షణ కాదు. భూ భక్షణ చట్టం. ఇది అమలయితే మీ ఇల్లు మీది కాదు. మీ భూమి మీది కాదు. కబ్జా అయితే నేరుగా హైకోర్టుకు పోవాలి. మీ రికార్డులు తారుమారు చేస్తున్నాడు జగన్‌. దీనికి మద్దతు ఇవ్వం’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. 

బొత్సపై నోరు పారేసుకున్న బాబు 
‘ఉత్తరాంధ్రలో బొత్స ఉన్నాడు. మనిషి లావు. ఆయనేం చెబుతాడో మనకు అర్థం కాదు. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి వచ్చారు. బొత్స మాట్లాడడు. పెత్తందార్లకు పెత్తనం’ అంటూ దుర్భాషలాడారు. దేశంలో ధనిక ముఖ్యమంత్రుల్లో నంబర్‌ వన్‌ పెత్తందారు జగన్‌ అన్నారు. తునిలో మంత్రి రాజా చెక్‌ పోస్టులలో వసూళ్లు. మామూళ్ల దెబ్బకు జనం పారిపోతున్నారన్నారు. బియ్యం మాఫియాకు కర్త, కర్మ, క్రియ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడినే అని ఆరోపించారు.

కార్యకర్తలపైనే చులకన మాటలు
ఈ సభల్లో కార్యకర్తలపైనే చంద్రబాబు చులకనగా మాట్లాడారు. ‘మా తమ్ముళ్లు మందు బాబులు. సాయంత్రం క్వార్టర్‌ వేసుకుని నిద్రపోదామనుకుంటారు. మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అందుకే బాదుడే బాదుడు. 50 రూపాయల బాటిల్‌ ఇప్పుడు రూ.200కు అమ్ముతున్నారు. మద్యం ధరలు పెంచి కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు’ అంటూ ఆరోపించారు. ‘టీడీపీ, జనసేన జెండాలు పట్టుకుని ఇంటింటికీ వెళ్లండి. గ్లాసు కూడా తీసుకెళ్లండి. నీళ్లు తాగడానికి పనికొస్తుంది’ అని వ్యాఖ్యానించారు. 

పోతాం.. మేమెళ్లిపోతాం..
‘రా కదిలి రా’ అంటూ టీడీపీ నిర్వహించిన ఈ సభలకు టీడీపీ నేతలు రూ.300ల నుంచి రూ.500 నగదు, క్వార్టర్‌ మందు, పలావు ప్యాకెట్‌ ఇచ్చి జనాన్ని అయితే తీసుకు వచ్చారు కానీ, చంద్రబాబు ప్రసంగం అయ్యే వరకు వారిని ఆపలేకపోయారు. పార్టీ కేడర్‌ ఎంత ప్రయత్నించినా జనం వెళ్లిపోయారు.

చంద్రబాబు ప్రసంగం మొదలైన కొద్ది సేపటికే సగం కుర్చీలు ఖాళీ అయిపోయాయి. ముఖ్యంగా మహిళలు మూకుమ్మడిగా లేచి వెళ్లిపోవడంతో పార్టీ కేడర్‌ చేతులెత్తేసింది. కుర్చీలు ఖాళీ అయిపోయినా, చంద్రబాబు మాత్రం ఎక్కడా ఆపకుండా రెండు సభల్లోనూ గంటకు పైగా ఏకబిగిన ప్రసంగించారు. బొబ్బిలి సభకు పార్టీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గైర్హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement