Nellimarla Assembly Constituency
-
మా‘లోకం’ అనుకుంటే... మా పుట్టి ముంచేస్తోంది!
ఆక్రమణలు.. అక్రమాలు చేయడం ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. ఇప్పుడు అదే విద్యను రాజకీయ రంగంలో ప్రదర్శిస్తున్నారు. టీడీపీ కంచుకోటను డబ్బుమూటలతో కుదేలు చేస్తూ.. జనసేన బలం పెంచుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవకపోయినా.. భవిష్యత్తులో టికెట్ కోసం ఎవరికాళ్లూ పట్టుకోకూడదన్న ఉద్దేశంతో పార్టీని పటిష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లూ మా‘లోకం’ అంటూ తిరుగుతున్న పసుపుచొక్కా నాయకులు.. ఆమె చర్యలతో కలవరపడుతున్నారు. టీడీపీ పుట్టిమునిగిపోతోందంటూ మదనపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కూటమి అభ్యర్థిగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన నాయకురాలు లోకం మాధవి ఒంటెత్తు పోకడలు టీడీపీ నాయకులకు కంటిమీద నిద్రలేకుండా చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం చక్రం తిప్పిన టీడీపీ నాయకులు ఆమె తీరుతో బెంబేలెత్తిపోతున్నారు. మంచి ప్యాకేజీలతో చేరికలకు తెరతీయడంతో టీడీపీ కార్యకర్తలు సైతం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. టీడీపీ కండువాలను పక్కనపెట్టి జనసేన కండువాలు వేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కూటమి మాటెలా ఉన్నా తమ పార్టీకి నెల్లిమర్ల నియోజకవర్గంలో నూకలు చెల్లినట్లేనని టీడీపీ స్థానిక నాయకులకు బెంగపట్టుకుంది. వారంతా పలాస వచ్చిన చంద్రబాబు వద్దకు స్వయంగా వెళ్లి ‘మహాప్రభో... మాధవి మన పుట్టి ముంచేలా ఉంద’ని మొరపెట్టుకున్నా అధినేత నీళ్లు నమలడం తప్ప ఏమీ భరోసా ఇవ్వలేకపోయారట! తొలి నుంచి ఆక్రమణలే లక్ష్యం... జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం నాయకురాలైన లోకం మాధవి, ఆమె భర్త లోకం ప్రసాద్ భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామ పరిధిలో రెండు దశాబ్దాల కిందటే భూములు కొనుగోలు చేశారు. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, మిరాకిల్ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ ముసుగులో సమీపంలోనున్న ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేశారు. గెడ్డలు, కాలువలతో పాటు కాలిబాటలన్నీ కలిపేసి రోడ్డు వేసేశారు. కల్వర్టులను వారే కట్టేశారు. ఆ భూముల చుట్టూ ప్రహరీ కట్టేసి పెద్ద గేట్లను పెట్టేశారు. అవతల ఉన్న భూముల్లోకి రైతులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో తమ భూముల్లోకి వెళ్లడానికి తోవలేక, మిరాకిల్ వేధింపులు పడలేక విధిలేని పరిస్థితుల్లో వారు తమ భూములను కూడా మిరాకిల్కే వచ్చినకాడికి అమ్మేయాల్సిన పరిస్థితి. ఆక్రమణల్లో దాదాపు 14 ఎకరాల మేర ప్రభుత్వ భూములు, మరో పది ఎకరాల వరకూ డి.పట్టా భూములు ఉన్నట్టు ఇటీవల రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీటి స్వాధీనాన్ని అడ్డుకొంటూ న్యాయస్థానం నుంచి యథాతథస్థితి ఉత్తర్వులు తెచ్చుకోవడం మిరాకిల్కే చెల్లింది. టీడీపీ అస్తిత్వానికే ఎసరు... పార్టీ మనుగడ కోసం పవన్ కల్యాణ్ మద్దతు తప్పదని టీడీపీ నాయకులకు చంద్రబాబు బుజ్జగించి పంపించినా పార్టీ భవిష్యత్తుకు మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నారు. కూటమి అభ్యర్థిగా లోకం మాధవి ఉన్నప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మాటే నెగ్గుతుందని చెప్పినా ప్రస్తుతం అలాంటి పరిస్థితులేవీ కనిపించట్లేదు. ఆమె జనసేన పార్టీలో చేరికలకు తెరలేపారు. భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ వైఎస్సార్సీపీలో అసంతృప్త నాయకులకు వల వేశారు. ఈ వలలో టీడీపీ కార్యకర్తలు చిక్కుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్లినవారు ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వస్తారనుకుంటే జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. వారి ప్రభావంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని టీడీపీ కార్యకర్తలు కూడా జనసేనలోకి పోతున్నారు. ఇది సవ్యంగా సాగాలనే ఉద్దేశంతో ఈ చేరికల కార్యక్రమాలకు టీడీపీ నాయకులను సైతం దరిచేరనీయట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీకి నూకలు చెల్లినట్లేనని ఆ పార్టీ నాయకులు దిగాలు చెందుతున్నారు. డిపాజిట్ దక్కకపోయినా సీటు కేటాయింపు.. పది మందికి ఉపాధి కల్పిస్తున్నామనే ముసుగులో భోగాపురం మండలంలో సంపాదించిన భూములు, ఆక్రమించిన ప్రభుత్వ భూములను కాపాడుకోవడమే లక్ష్యంగా లోకం దంపతులు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచే జనసేన అభ్యర్థిగా లోకం మాధవి తొలుత పోటీచేశారు. ఆమెకు 7,550 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా దక్కలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని రెండేళ్ల నుంచి ‘మిరాకిల్’ కేంద్రంగా రాజకీయాలకు తెరలేపారు. మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జిగా చంద్రబాబు ప్రకటించిన కర్రోతు బంగార్రాజు సహా ఆ పార్టీ నాయకులంతా ఆమెను తక్కువగా అంచనా వేశారు. ఆమె ధనబలం ముందు వారంతా దూదిపింజల్లా తేలిపోయారు. పవన్ కల్యాణ్ తొలుత ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో లోకం మాధవి కూడా ఉండటంతో టీడీపీ నాయకులకు మతిపోయింది. తిరుగుబాటు చేస్తామని ప్రకటించిన బంగార్రాజు తదితర నాయకులంతా తర్వాత సన్మానం చేయాల్సి వచ్చిందంటే ఆమె పవర్ ఊహించవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు... పూసపాటిరేగ మండలం రెల్లివలసలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడి నివాసంలో నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు శనివారం రాత్రి రహస్యంగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారానికి జిల్లాకు వచ్చిన చంద్రబాబు పలాసలో బస చేయడంతో మంగళవారం వారంతా అక్కడకు వెళ్లి కలిశారు. నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు, మహంతి చిన్నంనాయుడు బృందం చంద్రబాబుకు తమ కష్టాలను మొరపెట్టుకున్నా సానుకూల స్పందనకనిపించలేదని తెలిసింది. -
డబ్బు సంచులు తెచ్చినోళ్ళు ముందుకు రండి!
సీనియర్లు పక్కకు వెళ్ళిపోండి.. డబ్బు సంచులు తెచ్చినోళ్ళు ముందుకు రండి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న రాజకీయం ఇదే. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో చంద్రబాబు వక్రబుద్ధి మరోసారి బయటపెట్టుకుంటున్నారు. జిల్లా ఏదైనా, నియోజకవర్గం ఏదైనా డబ్బుతో వచ్చేవారికే టిక్కెట్ అని తేల్చి చెప్పేస్తున్నారు. పార్టీ పుట్టినప్పటినుంచీ ఉన్నవారిని, వారి వారసుల్ని కాదని కొత్తవారి కోసం వెతుకుతున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా సీనియర్లంతా చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఆ జిల్లా ఏదో.. ఆ నేతలెవరో చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో పచ్చ జెండా ఎగురుతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత ఫ్యాన్ స్పీడ్‌కు సైకిల్ అడ్రస్ గల్లంతయింది. జిల్లాలోని కొన్ని రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు టీడీపీ పుట్టినప్పటినుంచి ఆ పార్టీ జెండాను మోసాయి. మూడు కుటుంబాలు టీడీపీలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వెలిగారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా వెనకబడ్డాయి. దీంతో సీనియర్ నేతల కుటుంబాలకు ఈసారి టిక్కెట్లు ఇచ్చేది లేదని పచ్చ పార్టీ బాస్ చంద్రబాబు తెగేసి చెబుతున్నారు. డబ్బు గుమ్మరించే వారిని తీసుకురండి అని చెబుతున్నారు. అటువంటి వారు కనిపిస్తే వారికే టిక్కెట్ అని హామీలిచ్చేస్తున్నారు. ఆక్..పాక్..కరివేపాక్..అంటూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో సీనియర్ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్.కోట నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత కోళ్ల అప్పలనాయుడు కోడలు లలితకుమారికి ఈసారి టిక్కెట్ లేదని చెప్పేశారు. టీడీపీ ఏర్పడకముందు ఇండిపెండెంట్‌గా గెలిచిన కోళ్ల అప్పలనాయుడు టీడీపీ వచ్చాక ఆ పార్టీ తరపున 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తర్వాత అప్పలనాయుడు కోడలు లలిత కుమారి రెండు సార్లు టిడిపి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎస్.కోట టీడీపీలో ఈ కుటుంబానిది తిరుగులేని నాయకత్వం. కానీ ఈ ఎన్నికల్లో లలిత కుమారికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవలే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన NRI పారిశ్రామిక వేత్త గొంప కృష్ణకు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ నేపధ్యం లేకపోయినా బాగా డబ్బున్న వ్యక్తి కావడం అనే కారణంతో కోళ్ల కుటుంబాన్ని పక్కన పెట్టి గొంప కృష్ణకు ఎస్.కోట టికెట్ ఇవ్వబోతున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో పతివాడ నారాయణస్వామి 7 సార్లు టిడిపి తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈయన అనుభవం అపారం. అయితే వృద్దాప్యం కారణంగా వారసులుకి అవకాశం కల్పించాలని ఆయన చంద్రబాబును కోరారు. కానీ ధనికులకే టికెట్ అనే కాన్సెప్ట్ తీసుకువచ్చిన చంద్రబాబు.. పతివాడ నారాయణస్వామి కుటుంబం విన్నపాన్ని విస్మరించారు. ఎయిర్పోర్ట్ వస్తున్న భోగాపురం పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా సంపాదించిన కర్రోతు బంగార్రాజుకు నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా ఇంజనీరింగ్ కాలేజీలు, సాఫ్ట్వేర్ కంపెనీల యజమాని అయిన లోకం మాధవి జనసేన తరపున టికెట్ రేసులోకి వచ్చారు. బంగార్రాజు కంటే ఈమె దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయని తెలియడంతో నెల్లిమర్ల సీటును టీడీపీ తరపున లోకం మాధవికి ఇస్తామని హింట్ ఇచ్చారు. దీంతో రియల్టర్ బంగార్రాజు ఖంగు తిన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో బొబ్బిలి చిరంజీవి మాస్టర్ టిడిపి తరపున మూడు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనను పక్కన పెడతారనే ప్రచారం సాగుతోంది. బోనెల విజయచంద్ర అనే వ్యాపారవేత్తను పార్వతీపురం రాజకీయ తెరమీదకు తీసుకుచ్చారు. ఇది ఎస్సీ నియోజకవర్గం అయినా చంద్రబాబు విడిచి పెట్టలేదు. డబ్బు బాగా ఖర్చు పెట్టగలవారికే టికెట్ అని తేల్చి చెప్పేశారు. విజయచంద్రకు రాజకీయ నేపధ్యం లేకపోయినా పార్వతీపురం టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని నియోజకవర్గం టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. బలమైన కేడర్, పార్టీతో లాంగ్ జర్నీ, ఆపద కాలంలో పార్టీని నిలబెట్టారు అనే సెంటిమెంట్, ఎమోషన్ ఏ మాత్రం లేకుండా డబ్బున్నోడు కనబడగానే సీనియర్లను పూచిక పుల్లల్లా తీసి పక్కన పడేస్తున్నారు పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు నైజం తెలుసుకుంటున్న జిల్లా సీనియర్లు ఆయనపై మండిపడుతున్నారు. -
భీమిలి సభను విజయవంతం చేద్దాం
ఎన్నికల శంఖారావం పూరించడంలో భాగంగా విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఈ నెల 25న వైఎస్సార్సీపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో పార్టీ నాయకులతో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లిమర్ల నియోజకవర్గానికి సమీపంలో భీమిలి ఉందని, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సభకు నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని సూచించారు. ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, వైస్ ఎంపీపీ పిన్నింటి తమ్మునాయుడు, డెంకాడ పీఏసీఎస్ అధ్యక్షుడు రొంగలి కనకసింహాలచం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
సీనియర్లకు టీడీపీ అధినేత ఝలక్
అవసరానికి వాడుకోవడం.. అవసరం తీరాక మోహంచాటేయడం.. మాట విననివారికి వెన్నుపోటు పొడవడం వంటివి చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య!. ఓటర్లు, నాయకులు, సొంత బంధువులపైనా ఆయనది అదే ధోరణి!. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార దాహంతో రగిలిపోతున్నారు. దీనికోసం పార్టీకి దశాబ్దాల తరబడి సేవలందించిన సీనియర్ నాయకులను కాదని డబ్బున్నోళ్లకే సీట్లు కేటాయించేందుకు రెడీ అవుతుండడంతో ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేగుతోంది. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును కొన్ని వర్గాలవారు బహిరంగంగానే విమర్శిస్తుండగా, మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: వారంతా ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు... సుదీర్ఘ కాలంగా తెలుగుదేశంపార్టీలో విశేషమైన సేవలు అందించినవారు... అందులోనూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా! టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఆ పార్టీను, అధినేత చంద్రబాబును నమ్ముకునే ఇన్నాళ్లూ ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యం చెందినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబును ప్రజలు ఛీదరించుకున్నప్పటికీ ఆయన వెన్నంటే ఉంటూ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు. తీరా 2014 ఎన్ని కలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నో దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారి కష్టాన్ని గుర్తించకుండా వారి దగ్గర డబ్బు సంచులు లేవనే నెపంతో ఇప్పుడు వారిని పక్కనపెట్టేసి కోట్లకు పడగలెత్తిన ప్రవాస భారతీయులను, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు నాయకులు ఎవరైనా సరే అవసరానికి వాడుకొని కరివేపాకులా పక్కనపడేస్తారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. బీసీ జపం చేసే చంద్రబాబు ఆచరణలోకి వచ్చేసరికి గెలుపుగుర్రాల పేరుతో ధనబలం ఉన్న వారివైపే మొగ్గు చూపిస్తున్నారని జిల్లాలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి నాయకత్వానికి తిలోదకాలు! ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఎస్.కోట, నెల్లిమర్ల, పార్వతీపురం నియోజకవర్గాల్లో టీడీపీ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే నాయకులు కోళ్ల అప్పలనాయుడి కోడలు కోళ్ల లలితకుమారి, పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు. ఈ ముగ్గురు నాయకులు టీడీపీలో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నావారే. కానీ ప్రస్తుతం వారి ముగ్గురి పరిస్థితి త్రిశంకుస్వర్గంలా మారింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్ దక్కే అవకాశాలు దాదాపుగా లేవనే చర్చలు సాగుతున్నాయి. ఆ ముగ్గురు సీనియర్ నాయకులు జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గాలైన కొప్పలవెలమ, తూర్పుకాపు, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. 45 ఏళ్ల సీనియార్టీకి చిక్కులు ఎస్.కోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుటుంబానికి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఆమె మామ కోళ్ల అప్పలనాయులు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అందులో ఆరు సార్లు టీడీపీ నుంచే కావడం గమనార్హం. ఒకసారి మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన కోడలు లలిత కుమారి రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఐదేళ్లూ ప్రతిపక్షంలో సైతం టీడీపీ అండగా ఉన్నారు. అయితే, ఆమె దగ్గర ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి రూ.కోట్లలో డబ్బులు లేవని, ఉన్నా ఖర్చు చేయరనే ఒకేఒక్క సందేహంతో చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఆమెను పక్కనపెట్టేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే రాజకీయ తెరంగేట్రం చేసిన ప్రవాస భారతీయుడు గొంప కృష్ణకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం అందుకు ఊతమిస్తోంది. వేపాడ మండలానికి చెందిన ఆయనకు రాజకీయ నేపథ్యం లేకున్నా డబ్బులు బాగానే ఉన్నాయని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. పార్టీలో తనకు జరిగిన అవమానంపై లలితకుమారి కొన్నాళ్లుగా అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా రగిలిపోయినా చంద్రబాబు ఏమి మంత్రం వేశారో కానీ తర్వాత చల్లబడిపోయారు. లోకేశ్‌తో డీల్... చిరంజీవులుకు ఎసరు! పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ బోనెల విజయచంద్రకేనని చంద్రబాబు విస్పష్టంగా చెప్పేశారు. ప్రవాస భారతీయుడైన ఆయనకు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా కేవలం ధనబలం ఉందన్న కారణంతోనే టిక్కెట్ ఇస్తున్నారనే విమర్శలు ఆ పార్టీలోనే వస్తున్నాయి. నేరుగా నారా లోకేశ్‌తో డీల్ కుదుర్చుకొని వచ్చి ఇంతవరకు ఆ పార్టీ బాధ్యతలు చూసుకున్న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టిక్కెట్‌కు ఎసరు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పతివాడకు తీవ్ర పరాభవం... నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ వింత ఆచారానికి తెరతీసింది. నలభై సంవత్సరాలుగా టీడీపీలో ఎనలేని సేవలు అందిస్తూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందిన పతివాడ నారాయణస్వామినాయుడిది ఒక రికార్డు. ప్రోటెం స్పీకర్‌గా, చక్కెర, వాణిజ్యశాఖా మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం ఆయనను, ఆయన వారసులను కనీసం పట్టించుకోవడం లేదు. వారిని పక్కనబెట్టి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కర్రోతు బంగార్రాజును ఏడాది కిందట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రబాబు నియమించారు. కానీ ఇప్పుడు టీడీపీ–జనసేన పొత్తులో భాగంగా నెల్లిమర్ల టీడీపీ టిక్కెట్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి కేటాయించడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో బంగార్రాజు వర్గం కంగుతింది. విజయనగరానికి చెందిన ఆమె, ఆమె భర్త మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజీ, మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలకు అధిపతులు. కోట్లాది రూపాయల సంపద ఉన్న వారి ముందు పతివాడ 40 ఏళ్ల అనుభవం, కర్రోతు బంగార్రాజు సామాజిక బలం చంద్రబాబుకు కనిపించకుండాపోయాయనే చర్చ సాగుతోంది. ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉన్న మాధవి జనసేన పార్టీ తరఫున నెల్లిమర్ల టిక్కెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోవైపు గంటా శ్రీనివాసరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఐదేళ్లకోసారి నియోజకవర్గం మార్చేసే ఆయన ఈసారి నెల్లిమర్ల నుంచి టీడీపీ టిక్కెట్‌తో బరిలోకి దిగుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ధన బలం ఉన్న లోకం మాధవి, గంటా శ్రీనివాసరావుల పేరు తప్ప పతివాడ కుటుంబం పేరు ఎక్కడా టీడీపీ–జనసేనలో వినిపించలేదు. కనిపించట్లేదు! -
నెల్లిమర్ల టీడీపీలో అంతర్గత కుమ్ములాట
పూసపాటిరేగ: నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. సంక్రాంతి వేళ డెంకాడ మండలంలోని సేరిపొలంటీడీపీ నేత వెంపడాపు సూర్యనారాయణ కుమారుడు రమేష్‌నాయుడు పేరిట ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటయ్యాయి. ఫ్లెక్సీలో పూసపాటిరేగ మండలానికి చెందిన టీడీపీ నేతల ఫొటోలు అనుమతి లేకుండా వేయడంతో మండల టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూసపాటిరేగ మండలం, చల్లవానితోటలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి ఇంటి వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎం.చిన్నంనాయుడు, ఎం.శంకరరావు, పి.సన్యాసినాయుడు, విక్రం జగన్నాథం తదితర టీడీపీ నేతలు ఫ్లెక్సీల ఏర్పాటుపై అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సన్యాసినాయుడు అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో వెంపడాపు రమేష్‌నాయుడును ఎప్పుడూ చూడలేదని, దొడ్డిదారిన రాజకీయాలు చేయడమేంటని అన్నారు. ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక టీడీపీలో కీలకనేతలు ఎవరైనా ఉన్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఏది ఏమైనా నియోజకవర్గ టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఎంతోకాలంగా ఉన్న విబేధాలు ఫ్లెక్సీ ఏర్పాటుతో చెలరేగిన గొడవలో బహిర్గతమయ్యాయని అంతా అనుకుంటున్నారు. -
చైతన్యం వెల్లివిరిసిన నెల్లిమర్ల
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని వివరిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజలు నియోజకవర్గంలో భారీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సీఎం వైఎస్ జగన్ తమకు చేసిన మేలును వివరించారు. యువత బైక్‌లతో ర్యాలీ చేశారు. నెల్లిమర్ల డైట్ కాలేజీ మీదుగా కొండవెలగాడ, జర్జాపుపేట వరకూ యాత్ర సాగింది. కొండవెలగాడలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించారు. సాయంత్రం 4 గంటలకు నెల్లిమర్ల మొయిదా జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ – జైజై జగన్, జగనే కావాలి – జగనే రావాలి నినాదాలు సభలో హోరెత్తాయి. పేదల పెన్నిధి సీఎం జగన్ : ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సీఎం వైఎస్ జగన్ పేదల పెన్నిధి అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉండగా గిరిజనులు, ముస్లింలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మంత్రి పదవుల నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింటా పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. గిరిజనుడైన తాను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానంటే జగన్ వల్లే నని అన్నారు. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇలా 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందర్నీ మోసం చేశారన్నారు. వ్యవస్థల్లో సమూల మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవస్థల్లో సమూల మార్పులు తెచ్చారని తెలిపారు. పేదల కోసం విద్య, వైద్య రంగాలను సమూలంగా ప్రక్షాళన చేసి, అధునాతనంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పుడు ప్రతి పేద కుటుంబం మంచి విద్యను, మంచి వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందుకుంటున్నాయని తెలిపారు. విభజన తర్వాత పదేళ్ల వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ వదిలేసి వచ్చిన చంద్రబాబు కొత్త రాజధానిని రాజ్యాంగం, చట్టం ప్రకారం గాకుండా వ్యాపారంగా మార్చేశారన్నారు. రాష్ట్రంలో పెద్ద పట్టణం, అన్ని హంగులూ ఉన్న విశాఖని కాదని, తన అనుయాయులతో భూములు కొనిపించిన ప్రాంతంలో అర్ధరాత్రి రాజధానిని ప్రకటించిన పాపం చంద్రబాబుదేనన్నారు. సీఎం జగన్‌ది సుపరిపాలన: మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అందిస్తూ సుపరిపాలన చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలను అక్కున చేర్చుకొని, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అవమానించిన చంద్రబాబును అందరూ సమష్టిగా మరోసారి ఓడించాలని పిలుపునిచ్చారు. భోగాపురంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి: మంత్రి అమర్నాథ్ నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ ఇటీవల భూమిపూజ చేసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. రూ.4,750 కోట్లతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయంతో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సారిపల్లి ఇండ ్రస్టియల్ పార్కు అప్‌గ్రేడ్ పనులకు సీఎం త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారని తెలిపారు. నెల్లిమర్లలో రూ.1172 కోట్ల సంక్షేమం: ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలో రూ.1,172 కోట్లు సంక్షేమ కార్యక్రమాల కోసం సీఎం వైఎస్ జగన్ వెచ్చించారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. రామతీర్థంలో విధ్వంసాన్ని టీడీపీ రాజకీయం చేస్తే, సీఎం జగన్ మాత్రం రూ.4.5 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించారని తెలిపారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు శంబంగి అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ శోభా స్వాతిరాణి, నవరత్నాల వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు.