నెల్లిమర్ల కూటమి అభ్యర్థి లోకం మాధవిపై టీడీపీ నాయకుల గరంగరం
చేరికల పేరుతో టీడీపీ అస్తిత్వాన్నే దెబ్బకొట్టే ప్రయత్నాలు!
టీడీపీ కార్యకర్తలకూ వైఎస్సార్‌సీపీ ముసుగేసి జనసేన తీర్థం
ఇదే పరిస్థితి కొనసాగితే నెల్లిమర్లలో టీడీపీకి నూకలు చెల్లినట్లే!
పలాసకు పరుగెత్తి చంద్రబాబు ముందు టీడీపీ నాయకుల ఆవేదన
మాధవిని ఏమీ అనలేక నీళ్లునమిలిన చంద్రబాబు!
ఆక్రమణలు.. అక్రమాలు చేయడం ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. ఇప్పుడు అదే విద్యను రాజకీయ రంగంలో ప్రదర్శిస్తున్నారు. టీడీపీ కంచుకోటను డబ్బుమూటలతో కుదేలు చేస్తూ.. జనసేన బలం పెంచుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవకపోయినా.. భవిష్యత్తులో టికెట్ కోసం ఎవరికాళ్లూ పట్టుకోకూడదన్న ఉద్దేశంతో పార్టీని పటిష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లూ మా‘లోకం’ అంటూ తిరుగుతున్న పసుపుచొక్కా నాయకులు.. ఆమె చర్యలతో కలవరపడుతున్నారు. టీడీపీ పుట్టిమునిగిపోతోందంటూ మదనపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కూటమి అభ్యర్థిగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన నాయకురాలు లోకం మాధవి ఒంటెత్తు పోకడలు టీడీపీ నాయకులకు కంటిమీద నిద్రలేకుండా చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం చక్రం తిప్పిన టీడీపీ నాయకులు ఆమె తీరుతో బెంబేలెత్తిపోతున్నారు. మంచి ప్యాకేజీలతో చేరికలకు తెరతీయడంతో టీడీపీ కార్యకర్తలు సైతం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. టీడీపీ కండువాలను పక్కనపెట్టి జనసేన కండువాలు వేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కూటమి మాటెలా ఉన్నా తమ పార్టీకి నెల్లిమర్ల నియోజకవర్గంలో నూకలు చెల్లినట్లేనని టీడీపీ స్థానిక నాయకులకు బెంగపట్టుకుంది. వారంతా పలాస వచ్చిన చంద్రబాబు వద్దకు స్వయంగా వెళ్లి ‘మహాప్రభో... మాధవి మన పుట్టి ముంచేలా ఉంద’ని మొరపెట్టుకున్నా అధినేత నీళ్లు నమలడం తప్ప ఏమీ భరోసా ఇవ్వలేకపోయారట!
తొలి నుంచి ఆక్రమణలే లక్ష్యం...
జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం నాయకురాలైన లోకం మాధవి, ఆమె భర్త లోకం ప్రసాద్ భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామ పరిధిలో రెండు దశాబ్దాల కిందటే భూములు కొనుగోలు చేశారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, మిరాకిల్ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ ముసుగులో సమీపంలోనున్న ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేశారు. గెడ్డలు, కాలువలతో పాటు కాలిబాటలన్నీ కలిపేసి రోడ్డు వేసేశారు. కల్వర్టులను వారే కట్టేశారు. ఆ భూముల చుట్టూ ప్రహరీ కట్టేసి పెద్ద గేట్లను పెట్టేశారు. అవతల ఉన్న భూముల్లోకి రైతులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో తమ భూముల్లోకి వెళ్లడానికి తోవలేక, మిరాకిల్ వేధింపులు పడలేక విధిలేని పరిస్థితుల్లో వారు తమ భూములను కూడా మిరాకిల్‌కే వచ్చినకాడికి అమ్మేయాల్సిన పరిస్థితి. ఆక్రమణల్లో దాదాపు 14 ఎకరాల మేర ప్రభుత్వ భూములు, మరో పది ఎకరాల వరకూ డి.పట్టా భూములు ఉన్నట్టు ఇటీవల రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీటి స్వాధీనాన్ని అడ్డుకొంటూ న్యాయస్థానం నుంచి యథాతథస్థితి ఉత్తర్వులు తెచ్చుకోవడం మిరాకిల్‌కే చెల్లింది.
టీడీపీ అస్తిత్వానికే ఎసరు...
పార్టీ మనుగడ కోసం పవన్ కల్యాణ్ మద్దతు తప్పదని టీడీపీ నాయకులకు చంద్రబాబు బుజ్జగించి పంపించినా పార్టీ భవిష్యత్తుకు మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నారు. కూటమి అభ్యర్థిగా లోకం మాధవి ఉన్నప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మాటే నెగ్గుతుందని చెప్పినా ప్రస్తుతం అలాంటి పరిస్థితులేవీ కనిపించట్లేదు. ఆమె జనసేన పార్టీలో చేరికలకు తెరలేపారు. భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ వైఎస్సార్‌సీపీలో అసంతృప్త నాయకులకు వల వేశారు. ఈ వలలో టీడీపీ కార్యకర్తలు చిక్కుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లినవారు ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వస్తారనుకుంటే జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. వారి ప్రభావంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని టీడీపీ కార్యకర్తలు కూడా జనసేనలోకి పోతున్నారు. ఇది సవ్యంగా సాగాలనే ఉద్దేశంతో ఈ చేరికల కార్యక్రమాలకు టీడీపీ నాయకులను సైతం దరిచేరనీయట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీకి నూకలు చెల్లినట్లేనని ఆ పార్టీ నాయకులు దిగాలు చెందుతున్నారు.
డిపాజిట్ దక్కకపోయినా సీటు కేటాయింపు..
పది మందికి ఉపాధి కల్పిస్తున్నామనే ముసుగులో భోగాపురం మండలంలో సంపాదించిన భూములు, ఆక్రమించిన ప్రభుత్వ భూములను కాపాడుకోవడమే లక్ష్యంగా లోకం దంపతులు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచే జనసేన అభ్యర్థిగా లోకం మాధవి తొలుత పోటీచేశారు. ఆమెకు 7,550 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా దక్కలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని రెండేళ్ల నుంచి ‘మిరాకిల్’ కేంద్రంగా రాజకీయాలకు తెరలేపారు. మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జిగా చంద్రబాబు ప్రకటించిన కర్రోతు బంగార్రాజు సహా ఆ పార్టీ నాయకులంతా ఆమెను తక్కువగా అంచనా వేశారు. ఆమె ధనబలం ముందు వారంతా దూదిపింజల్లా తేలిపోయారు. పవన్ కల్యాణ్ తొలుత ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో లోకం మాధవి కూడా ఉండటంతో టీడీపీ నాయకులకు మతిపోయింది. తిరుగుబాటు చేస్తామని ప్రకటించిన బంగార్రాజు తదితర నాయకులంతా తర్వాత సన్మానం చేయాల్సి వచ్చిందంటే ఆమె పవర్ ఊహించవచ్చు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు...
పూసపాటిరేగ మండలం రెల్లివలసలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడి నివాసంలో నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు శనివారం రాత్రి రహస్యంగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారానికి జిల్లాకు వచ్చిన చంద్రబాబు పలాసలో బస చేయడంతో మంగళవారం వారంతా అక్కడకు వెళ్లి కలిశారు. నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, మహంతి చిన్నంనాయుడు బృందం చంద్రబాబుకు తమ కష్టాలను మొరపెట్టుకున్నా సానుకూల స్పందనకనిపించలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment