టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితాలతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు
సాక్షి, అమరావతి: అందరూ అనుకుంటున్నట్లుగానే జరిగింది. జనసేనను కేవలం 24 స్థానాలకే పరిమితం చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్‌కు ఏం చెప్పారో.. ఏం ఆశ చూపారో కానీ.. పాతిక శాతానికి పైగా సీట్లు ఆశిస్తున్న జనసేన నేతల ఆశలపై నీళ్లు చల్లారు. ఈ మాత్రం సీట్ల కోసం ఇన్నాళ్ల నుంచి ఇంత హంగామా ఎందుకని, ఇలాగైతే రాజ్యాధికారం ఎలా సాధ్యమవుతుందని ఆ పార్టీ నేతలు పవన్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ–జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉండవల్లిలోని తన నివాసంలో విడుదల చేశారు.
సీట్ల విషయంలో తాము చాలాసార్లు చర్చలు జరిపామని తెలిపారు. తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని, ఇందులో టీడీపీ నుంచి 94 మంది ఉన్నారని తెలిపారు. జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తుందన్నారు. ఇలా వారిద్దరూ కలిసి ఉమ్మడి బాబితా విడుదల చేయగానే జనసేన నేతలు ఎక్కడికక్కడ భగ్గుమన్నారు. సీట్ల సంఖ్యలో బాబు చెప్పినట్టే తలూపుతూ తమ అధినేత పవన్ చారిత్రక తప్పిదం చేస్తున్నారని మండిపడ్డారు. పొత్తు పేరుతో జనసేన పార్టీని చంద్రబాబుకు హోల్ సేల్‌గా తాకట్టు పెట్టేశారని దుమ్మెత్తిపోశారు. రెండేళ్లుగా పనులన్నీ మానుకుని పార్టీ కోసం పని చేస్తుంటే, మరీ దారుణంగా 24 సీట్లతో ఎలా పొత్తు పెట్టుకుంటారని దుయ్యబట్టారు.
బాబు బలహీనత బహిర్గతం
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారులోనే చంద్రబాబు బలహీనత బహిర్గతమైంది. ఎటువంటి ప్రయోగాలు లేకుండా చాలా సాదాసీదాగా టీడీపీ–జనసేన ఉమ్మడి జాబితాను ప్రకటించారు. ఇందులో దాదాపు అన్నీ పాత ముఖాలే ఉన్నాయి. ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో రకరకాల భయాలు, అనుమానాలతో ఉన్న చంద్రబాబు వాటన్నింటినీ జాబితాలో తేటతెల్లం చేశారు. కొత్తదనం అనే మాటే లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటూ కూడా ఆ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రకటించిన 94 సీట్లలో బీసీలకు కేవలం 18 సీట్లు మాత్రమే ఇచ్చారు.
గతంలో కంటే తక్కువ సీట్లు కేటాయించడం గమనార్హం. తన సొంత సామాజికవర్గానికి (కమ్మ) మాత్రం ఏకంగా 21 సీట్లు కేటాయించి తన ప్రాధాన్యత ఏమిటో చంద్రబాబు మరోసారి చాటిచెప్పారు. 94 సీట్లలో 52 మంది ఓసీ అభ్యర్థులే ఉన్నారంటే టీడీపీ ప్రాధాన్యత ఇట్టే అర్థమవుతోంది. మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించామని ప్రకటించినా, 94లో పది మంది మాత్రమే ఉన్నారు. దీన్నిబట్టి వారికి ఏ స్థాయిలో అవకాశం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి కేవలం ఏడు సీట్లు మాత్రమే ఇచ్చారు. ఈ జాబితాలో మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు కేటాయించి వారికి టీడీపీలో ఉన్న గౌరవం ఏపాటిదో స్పష్టం చేశారు.
ఒత్తిడి తట్టుకోలేక ఎట్టకేలకు తొలి జాబితా
టీడీపీలో తీవ్ర నైరాశ్యం నెలకొనడంతో ఎట్టకేలకు తొలి జాబితాలో చంద్రబాబు కొందరు అభ్యర్థులను ఖరారు చేశారు. సీట్లు ఖరారు చేయకుండా పవన్ కళ్యాణ్‌తో చర్చలకే పరిమితమవడం, బీజేపీతో పొత్తు కోసం తాపత్రయ పడుతుండడంతో టీడీపీలో ఆందోళన నెలకొంది. ఒకవైపు వైఎస్సార్‌సీపీ ఒక ప్రణాళిక ప్రకారం అభ్యర్థులను ఖరారు చేస్తూ ముందుకెళుతున్న తరుణంలో చంద్రబాబు స్తబ్దుగా ఉండడంపై క్యాడర్‌లో తీవ్ర నిరుత్సాహం ఏర్పడింది. తాము ఎన్ని సీట్లలో పోటీ చేసే విషయాన్ని తేల్చక పోవడంపై జనసేన నేతల్లోనూ అసహనం పెరిగిపోయింది.
బీజేపీతో పొత్తు విషయం తేలాకే సీట్లు ప్రకటించాలనే ఆలోచనతో ఇన్నాళ్లూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఎదురు చూశారు. కానీ ఆ పార్టీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ప్రస్తుతానికి కొన్ని సీట్లలోనైనా అభ్యర్థులను ఖరారు చేసి క్యాడర్‌లో అసహనాన్ని తగ్గించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే శనివారం 99 మందితో జనసేన–టీడీపీ తొలి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. పొత్తులో మొత్తంగా జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు దక్కాయి. తన పార్టీకి కేటాయించిన 24 సీట్లకుగాను పవన్ ప్రస్తుతం కేవలం ఐదు సీట్లలోనే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.
పారాచూట్ నేతలకు ప్రాధాన్యత
తొలి జాబితాలో పారాచూట్ నేతలకు ప్రాధాన్యత లభించింది. ఉన్నట్టుండి ఊడిపడిన వెనిగండ్ల రాము, సరిపల్లె రాజేష్, ఎస్ రోషన్, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, వీఎం థామస్ వంటి వారికి సీట్లు ప్రకటించేశారు. అక్కడ పార్టీ కోసం సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న నేతలను పక్కనపెట్టేశారు. తొలి జాబితాలోనే తనతోపాటు తన కుమారుడు, తన బావమరిదికి చంద్రబాబు టికెట్లు ప్రకటించారు. తనకు కుప్పం, తన కుమారుడు లోకేష్‌కు మంగళగిరి, బావమరిది బాలకృష్ణకు హిందూపురం సీట్లు ఖరారు చేశారు. జనసేనకు కేటాయించిన సీట్లు పోగా, మిగిలిన సీట్లలో తమ పార్టీ పోటీ చేస్తుందని బాబు తెలిపారు.
బీజేపీ కూడా కలిసి వస్తే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ ప్రజాబలం ఉందని, విలువలతో కూడిన రాజకీయాలు చేశామని చెప్పుకొచ్చారు. మాఘపౌర్ణమి లాంటి శుభ దినాన టీడీపీ–జనసేన అభ్యర్థులను ప్రకటించామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పోటీ చేస్తున్నామన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశానన్నారు. దాదాపు 1.30 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని, విద్యావంతులకు, యువత, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.
40 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు లెక్కట!
ఎక్కువ స్థానాలు తీసుకుని ప్రయోగం చేసేకంటే, తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్తున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ, వ్యక్తి ప్రయోజనాలు దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నామని తెలిపారు. కొందరు 45 కావాలి.. 75 కావాలన్నారని, 2019లో పది స్థానాలన్నా గెలిచి ఉంటే ఇప్పుడు ఎక్కువ స్థానాలు అడగడానికి అవకాశం ఉండేదని చెప్పారు.
జనసేనకు కేటాయించిన 24 స్థానాలే కనబడుతున్నాయి కానీ.. 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు జనసేనలో భాగమవుతాయని తనకు తాను సర్దిచెప్పుకున్నారు. ఈ లెక్కన పార్లమెంటు స్థానాల పరిధిని కలుపుకుంటే 40 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు లెక్క అని సరికొత్త లెక్క చెప్పారు. పొత్తు బలంగా ఉండాలని బీజేపీని దృష్టిలో పెట్టుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment