ఓ విధానమూ లేదు...నినాదమూ లేదు..'ఆరోపణలే అజెండా'! | Chandrababu and Yellow Gang bad propaganda on CM Jagan In Election Campaign | Sakshi
Sakshi News home page

ఓ విధానమూ లేదు...నినాదమూ లేదు..'ఆరోపణలే అజెండా'!

Published Fri, Apr 12 2024 4:23 AM | Last Updated on Fri, Apr 12 2024 4:23 AM

Chandrababu and Yellow Gang bad propaganda on CM Jagan In Election Campaign - Sakshi

2014–19 మధ్య తాను చేసిందేమీ లేక... చంద్రబాబు దుష్ప్రచారం 

విధ్వంస పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారు... అంటూ రోజూ అరుపులు 

అంటే ఏంటో... రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో చెప్పే పరిస్థితే లేదు 

బడులను బాగు చేసి, విద్యా వ్యవస్థను సంస్కరించటం విధ్వంసమా? 

నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవటం నాశనం చేయటమా? 

సాగును బాగు చేసి, రైతన్నకు భరోసా ఇవ్వటం రాష్ట్రాన్ని దెబ్బతీయటమా? 

సంక్షేమంతో పేదలందరినీ ఆదుకోవటం, గ్రామాలకు కొత్త కళ తేవటం తప్పా? 

పోర్టులు, హార్బర్లు, భారీ పరిశ్రమలతో పురోగమనం కనిపించటం లేదా? 

ఐదేళ్లలో దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన చరిత్ర ఎవరికైనా ఉందా? 

ఇవన్నీ తెలిసే తన హామీలను నమ్మటం లేదని గ్రహించి... బాబు తిట్ల దండకం 

ప్రభుత్వాన్ని దూషించటమే పనిగా పనికిమాలిన ఎత్తుగడలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి ఒక్కటీ లేకపోవడంతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతలకు ప్రజల్లోకి వెళ్లేందుకు మొహం చెల్లడంలేదు. నాడు కూడా కూటమికి నేతృత్వం వహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 650కిపైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక కనీసం పది శాతం హామీలను కూడా అమలు చేయకుండా దారుణంగా వంచించడంతో ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ అంటూ ఎన్ని వాగ్దానాలు గుప్పించినా ప్రజలు నమ్మని పరిస్థితి నెలకొంది. దీంతో అజెండా లేని కూటమి నేతలు పచ్చి అబద్ధాలు వల్లిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌పై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా వ్యవహ­రిస్తున్నారు.

ఎన్నికలహామీల్లో 99 శాతం అమలు చేయడంతోపాటు కూటమి దోపిడీతో 2019 మే 29 నాటికి వెంటిలేటర్‌పైకి చేరిన రాష్ట్రాన్ని సుపరిపాలనతో శరవేగంగా పునర్నిర్మి­స్తున్న సీఎం జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీ­యత రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న వరుసగా సిద్ధం సభలు, నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని పసిగట్టిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, పురందేశ్వరి ఉనికి చాటుకోవడం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న టీడీపీ మనుగడ కోసమే బురద జల్లుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించిన సీఎం జగన్‌ ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే అందించే నూతన ఒరవడికి దేశంలో తొలిసారిగా నాంది పలికారు. ప్రజాభిమానం పొందిన వలంటీర్లపై మొన్నటి వరకు తూలనాడిన చంద్రబాబు ఇప్పుడు తనకు మాత్రమే సాధ్యమైన ‘యూ’ టర్న్‌ తీసుకుని ఆ వ్యవస్థను  కొనసాగిస్తామని ప్రకటించడం ద్వారా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి కితాబిచ్చారు. అదే సమయంలో జన్మభూమి కమిటీల పేరెత్తేందుకు కూడా చంద్రబాబు సాహసించలేకపోతున్నారు. ఆ మాటెత్తితే ప్రజలు ఈడ్చి కొడతారేమోననే భయమే అందుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నాడు మోసమే ఒరవడిగా..
విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టు కట్టిన చంద్రబాబు  650కిపైగా హామీలిచ్చి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో నాడు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో 2014 జూన్‌ 8న కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మోసమే ఒరవడిగా పాలన సాగించింది. చంద్రబాబు, మోదీ, పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలతో, చంద్రబాబు సంతకం చేసి మరీ ఇంటింటికీ లేఖలు పంపి ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా వంచించారు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా అక్క చెల్లెమ్మలకు బాబు దగా చేశారు.

ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికి యువతను మోసగించారు. బీసీ సబ్‌ ప్లాన్‌ కింద ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వ్యయం చేస్తామంటూ బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వకుండా వంచించారు. పవర్‌ లూమ్స్, చేనేత రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. అరకొరగా ఇచ్చే సంక్షేమ పథకాల ఫలాలు దక్కాలంటే తమకు లంచాలు ఇవ్వాల్సిందేనంటూ నాడు జన్మభూమి కమిటీలు అరాచకం సృష్టించాయి.

అడుగడుగునా అక్రమాలే..
సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని దేవతల రాజధానిని తలదన్నే రీతిలో అమరావతిని నిర్మిస్తానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఓత్‌ ఆఫ్‌ సీక్రసీకి తిలోదకాలు ఇచ్చి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. కారు చౌకగా రైతుల భూములు కాజేసి రూ.లక్షల కోట్లు కొట్టేశారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంలో అవినీతికి పాల్పడటంతోపాటు స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీల కన్షార్షియంకు కట్టబెట్టి మరో రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్‌ వేశారు. అక్రమార్జనతో అమరావతిలో విధ్వంసం సృష్టించారు.

ఉచిత ఇసుక పేరుతో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి లాంటి నదులు, వాగులు, వంకలను అడ్డగోలుగా తవ్వేసి భారీ ధరలకు విక్రయించి రూ.వేల కోట్లు కొల్లగొట్టారు. కేవలం రూ.17,368 కోట్లతో పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తానని బీరాలు పలికి రూ.68 వేల కోట్లు తగలేసినా ఒక్కటీ పూర్తి చేయలేకపోయారు.

కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్ల దాహంతో దక్కించుకున్న చంద్రబాబు నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయకుండా ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారు. కాఫర్‌ డ్యామ్‌ ఖాళీల గుండా గోదావరి అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్‌ వాల్‌ ధ్వంసమైంది. కమీషన్ల కక్కుర్తితో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలే టీడీపీ కూటమి అరాచక పాలనకు నిదర్శనం.

ఖజానాను ఊడ్చేసి..
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దోపిడీ, ఎడాపెడా అప్పులతో 2019 మే 29 నాటికి రాష్ట్రాన్ని దివాలా తీయించింది. అప్పటికి ప్రభుత్వ ఖజానాలో కేవలం రూ.వంద కోట్లే మిగిలాయని నాటి ఆర్థిక మంత్రి యనమల స్వయంగా ప్రకటించడమే అందుకు నిదర్శనం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలనే ఎత్తుగడలో భాగంగా బీజేపీ, జనసేనతో విడిపోయిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసేలా పథకం వేశారు. అయితే కూటమి అరాచకాలకు తగిన శాస్తి చేస్తూ 2019 ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టారు. 

రాష్ట్రానికి జవసత్వాలు..
కూటమి ప్రభుత్వం వెంటిలేటర్‌పైకి చేర్చిన రాష్ట్రానికి గత 58 నెలలుగా సుపరిపాలనతో సీఎం వైఎస్‌ జగన్‌ జవజీవాలు కల్పించి శరవేగంగా పునర్నిర్మిస్తున్నారు. కూటమి సర్కార్‌ హయాంలో 2014–19 మధ్య అప్పులు 169 శాతం పెరిగితే 2019–24 మధ్య అప్పులు 58 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. ఎన్నికల్లో హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్‌ దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశారు. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలు లాంటి నాన్‌ డీబీటీల రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు.

డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపితే ఏకంగా రూ.4.49 లక్షల కోట్ల దాకా పేదలకు లబ్ధి కలిగింది. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవడంతో పేదరికం క్రమేణా తగ్గుతోంది. రాష్ట్రంలో పేదరికం 2015–16 నాటికి 11.77 శాతం ఉండగా 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. టీడీపీ హయాంలో ఐదేళ్లలో కేవలం 32 వేల ఉద్యోగాలను మాత్రమే ఇవ్వగా సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక కొత్తగా 2.31 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించి యువతకు బాసటగా నిలవడం గమనార్హం. 

అభివృద్ధిలో అగ్రగామిగా..
కమీషన్ల దాహంతో చంద్రబాబు విధ్వంసం సృష్టించిన పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్‌ జగన్‌ గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నారు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్‌ 11 నాటికే గోదావరి వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించారు. కుడి, ఎడమ కాలువ అనుసంధానాలను పూర్తి చేశారు. డయాఫ్రమ్‌ వాల్‌పై కేంద్రం నిర్ణయాన్ని వెల్లడించడమే తరువాయి శరవేగంగా ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా అడుగులు వేస్తున్నారు.

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను కొనసాగించి సంగం, నెల్లూరు బ్యారేజ్‌లు, లక్కవరం ఎత్తిపోతల, అవుకు టన్నెల్, వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. పారదర్శకమైన పారిశ్రామిక విధానంతో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీని దేశంలో ఏటా అగ్రస్థానంలో నిలిపారు. నాలుగు పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పది ఇండస్ట్రియల్‌ నోడ్స్‌తో పారిశ్రామికాభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారు.

పారిశ్రామిక వృద్ధి రేటులో దేశంలో రాష్ట్రం 2018–19 నాటికి 3.2 శాతంతో 22వ స్థానంలో ఉండగా 2021–22 నాటికి 12.8 శాతం వృద్ధి రేటుతో మూడో స్థానానికి ఎగబాకడమే అందుకు నిదర్శనం. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి తలసరి ఆదాయం భారీగా పెరిగింది. రాష్ట్రంలో 2018–19లో తలసరి ఆదాయం రూ.1,54,031  ఉంటే 2022–23 నాటికి రూ.2,19,518కు చేరుకోవడం గమనార్హం. 

ఒంటరిగా ఎదుర్కోలేకనే మళ్లీ..
సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా నాటుకుపోయింది. 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఇదే విషయం వెల్లడైంది. వరుస ఓటములతో వెంటిలేటర్‌పైకి చేరి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న టీడీపీ మనుగడ కోసం చంద్రబాబు మరోసారి జనసేన, బీజేపీతో జట్టు కట్టారు. 2014లో అధికారంలోకి వచ్చి మోసం చేసిన కూటమే మళ్లీ ఇప్పుడు తెరపైకి రావడంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ–జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వ
హించిన సభతోపాటు మూడు పార్టీలు ఉమ్మడిగా ఏకంగా ప్రధాని మోదీని తీసుకొచ్చి చిలకలూరిపేటలో నిర్వహించిన సభకు సైతం ప్రజలు మొహం చాటేశారు.

అవకాశవాద పొత్తులను తిప్పికొట్టారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల స్పందన కరువైంది. మరోవైపు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు ప్రతిచోటా బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఘోర పరాజయం తప్పదని నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ సీఎం జగన్‌పై బురద చల్లుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement