ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినా బాగుపడలేదన్న చంద్రబాబు
రిజర్వేషన్లతో సాధించేదేమీ లేదని వ్యాఖ్యలు
అందరికీ ఇవ్వలేం.. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జనసేనాని
సోషల్ మీడియాలో ఇద్దరి వీడియోలు వైరల్
సాక్షి, అమరావతి: మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేద వర్గాలకు రిజర్వేషన్లు అవసరం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు! జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్లపై తన వ్యతిరేకతను బహిర్గతం చేసిన చంద్రబాబు వాటిని రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు! ‘ఎస్సీ, ఎస్టీలు, ఇతర కొన్ని వర్గాలకు ఏడు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మరి వాళ్లు ఏమైనా బాగుపడ్డారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. వారికి రిజర్వేషన్లు అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు.
ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చెబుతుండగా ఎన్డీఏతో పొత్తులో ఉన్న చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు మభ్యపెట్టేలా మాట్లాడారు. పోలింగ్‌కు ముందు చంద్రబాబు తన ముసుగు తొలగించి ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదని స్పష్టం చేయడంతో ఆ వర్గాలు ఆవేదనతో రగిలిపోతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అధికారం ఇస్తే ఏపీలో ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు రద్దు కావడం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ పేదల పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు.
ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వారి పుట్టుకనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు. బీసీల తోకలు కత్తిరిస్తానని బెదిరించిన చరిత్ర కూడా ఆయనదే. చంద్రబాబు నరనరానా కులోన్మాదం జీర్ణించుకుపోయిందనేందుకు దళితులు, ముస్లింలు, బీసీలకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తాజాగా ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ వారి పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో అది ఫేక్ అంటూ ఎప్పటి మాదిరిగానే గొంతు సవరించుకున్నారు.
నైపుణ్య శిక్షణ చాలన్న పవన్
చంద్రబాబు పార్ట్‌నర్ పవన్ కళ్యాణ్ కూడా రిజర్వేషన్లపై తన వ్యతిరేకతను చాటుకున్నారు. దేశంలో చాలా కులాలు, ఉప కులాలు ఉన్నాయని, అందరూ రిజర్వేషన్లు అడుగుతారని, కానీ అందరికీ ఇవ్వలేమని ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పేర్కొన్నారు. అర్హతను బట్టి అవకాశాలు రావాలని, అందుకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తే సరిపోతుందన్నారు. రిజర్వేషన్ల ద్వారా అందరికీ అవకాశాలు ఇవ్వలేమని, తన కులం వాళ్లు కూడా రిజర్వేషన్లు అడుగుతున్నారని, కానీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ వ్యాఖ్యల ద్వారా పేద వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment