Salur: ఇంట గెలవని రాణి..! | TDP Leader Fire on Gummidi Sandhya Rani | Sakshi
Sakshi News home page

Salur: ఇంట గెలవని రాణి..!

Published Sun, May 5 2024 9:56 AM | Last Updated on Sun, May 5 2024 12:01 PM

TDP Leader Fire on Gummidi Sandhya Rani

     ఒంటెత్తు పోకడలతో సొంత పార్టీలోనే వైరివర్గం

    ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవీకాలం..

    కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితం

    నియోజకవర్గం అభివృద్ధికి చేసింది శూన్యం

    సొంత మండలాన్నీ పట్టించుకోని పరిస్థితి

    సహకరించని పార్టీ క్యాడర్‌  

ఆమెది ఒంటెత్తు పోకడ వ్యవహారమన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీగా పదవి అనుభవించినా సంతృప్తి లేదు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలన్నదే ఆమె లక్ష్యం. అయితే సొంత పార్టీలోని మాజీ ఎమ్మెల్యేతో ఇప్పటికీ విభేదాలే. కూటమి కట్టి పోటీ చేస్తున్నప్పటికీ..కూటమి పార్టీ ఎంపీ అభ్యర్థితోనూ సఖ్యత అంతంతమాత్రమే. నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ ఆమెను వ్యతిరేకించేవారే ఉన్నారని సొంతపార్టీ నాయకులే చెప్పుకుంటారు. ఆమె ధోరణి, వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు పలుమార్లు పార్టీ అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టిన ఉదంతాలూ ఉన్నాయి. మక్కువ మండలంలోని ఆమె వ్యతిరేక వర్గం..కేవలం కూటమి ఎంపీ అభ్యర్థికి మాత్రమే అనుకూలంగా   ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. 

పాచిపెంట మండలంలోనూ పార్టీ కేడర్‌కు గతంలో ఆమెతో విభేదాలున్నాయి. పార్టీలోని సొంత వర్గీయులే కాదు..వ్యతిరేక వర్గం వారైనా తలెగరేస్తే పాతాళానికి తొక్కేసే వరకూ ఆమె నిద్రపోరనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆమె వైఖరిని ఖండిస్తూ గతంలో సొంత పార్టీ నేతలే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం గమనార్హం. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇవన్నీ చాలదన్నట్లు కులవివాదాన్నీ ఎదుర్కొంటున్నారు. ఇలా ఇంటా బయటా వ్యతిరేకతను కూడగట్టుకున్న తెలుగుదేశం పార్టీ సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి..ఎని్నకల్లో ఎలా ముందుకు వెళ్తారో అన్న చర్చ సాగుతోంది.

పార్వతీపురం మన్యం: సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా అని భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. తనకు ఎమ్మెల్యేగా అవకాశవిుస్తే అది చేస్తా..ఇది చేయిస్తా అంటూ  టీడీపీ తరఫున ఎన్నికల బరిలో దిగుతున్న గుమ్మిడి సంధ్యారాణి కొద్దిరోజులుగా ఊదరగొడుతున్నారు. కనీసం తాను ఎమ్మెల్సీగా పదవిని అనుభవించిన ఆరేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో ఆరేళ్లు ఎమ్మెల్సీగా చేసినా నియోజకవర్గానికి ఆమె చేసింది శూన్యం. తాగునీరు, ఇతర అవసరాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని ఆమె చెబుతుంటే అధికార పార్టీ నేతలు అడిగిన ప్రశ్నలకు తిరిగి  సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కనీసం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నా స్పందించడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఆమె ఎమ్మెల్సీగా పదవిని అనుభవించారు.

పదవిలో ఆమె ఉన్నది ప్రజల శ్రేయస్సు కాద ని, ఆమె స్వలాభం కోసమేనని  సొంత పార్టీ నేతలే విమర్శిస్తుంటారు. సాలూరులో ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తామని, లారీ పరిశ్రమను ఆదుకుంటామని స్వయంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాంలో హామీ ఇచ్చారు. బైపాస్‌ రోడ్డును పూర్తి చేస్తామని చెప్పినా చేయలేదు. ఈ ప్రాంత ఎమ్మెల్సీగా వాటి సాధన కోసం ఆమె ఏనాడూ పట్టుబట్టలేదు. టీడీపీ హయాంలో ఏజెన్సీలో గిరిజ నుల మరణాలు అధికంగా సంభవించాయి. ఒక్క కరాసవలసలోనే డెంగీ జ్వరాలతో 10 రోజుల వ్యవధిలో 11 మంది వరకు చనిపోయారు. కొదమ పంచాయతీ గిరిశిఖర సిరివర గ్రామం నుంచి డోలీలో గర్భిణిని తీసుకువస్తే..మార్గమధ్యంలోనే ఆమె ప్రసవించింది. దీంతో మానవహక్కుల సంఘం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

ఎన్నికల ముందు హడావుడి
సాలూరులో వంద పడకల ఆస్పత్రికి 2019 ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావుతో కలిసి సంధ్యారాణి హడావుడిగా భూమి పూజ చేశారు. తర్వాత పట్టించుకోలేదు. కందులపథం బ్రిడ్జికి కూడా ఎన్నికలకు ముందు కొబ్బరికాయ కొట్టి పనులు చేయకుండా వదిలేశారు. సొంత మండలాన్నే ఆమె ఏనాడూ పట్టించుకున్న పా పాన పోలేదని..ఇంక నియోజకవర్గాన్ని ఏం పట్టించుకుంటారని ‘తెలుదేశం పార్టీలోని ఓ వర్గం ప్రశ్ని స్తోంది. తన పదవీ కాలంలో అంటీముట్టనట్లుగానే ఆమె కాలం గడిపేశారని గుర్తుచేస్తున్నారు. ఇప్పు డు తాము కూడా అలాగే ప్రవర్తిస్తామని ఆ పార్టీ నేతలు, క్యాడర్‌ చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement