రేపు ఉదయం ఓట్ల లెక్కింపు
కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేస్తున్న అభ్యర్థులు
వైఎస్సార్‌సీపీ గెలుపు ధీమా.. కూటమిలో గుబులు
సంక్షేమం, అభివృద్ధి గెలిపిస్తాయంటున్న అధికారి పార్టీ
పొత్తు ప్రకటనల నుంచే కూటమి పార్టీల్లో గొడవలు
ఎన్నికల ప్రచారానికి ప్రజా స్పందన లేకపోవడంతో నేతల్లో వైరాగ్యం
పోలింగ్ తర్వాత పత్తా లేకుండా పోయిన కూటమి అధినేతలు
ఓటమి ఊహించే తుర్రుమన్నారని సొంత పార్టీల్లో గుసగుసలు
ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఫ్యాన్‌దే హవా
ఎగ్జిట్ ఫలితాల తర్వాత మరింత ఢీలాపడ్డ కూటమి
సార్వత్రిక ఎన్నికల సమరంలో.. ఇంకా గంటలే మిగిలి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు రేపు ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తమ గెలుపు ఖాయమైందని వైఎస్సార్‌సీపీ.. లోపల ఓటమి భయం ఉన్నప్పటికీ పైగా మాత్రం తాము గెలిచి తీరతామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రకటనలు పోటాపోటీగా ఇచ్చుకుంటున్నాయి. ఇటు ఏపీ ప్రజానీకం, అటు రాజకీయ శ్రేణులు ఉత్కంఠంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.
ఏపీ ఎన్నికల ఫలితాల వేళ కూటమికి ఓటమి భయం పట్టుకుంది. వాస్తవానికి సీఎం జగన్ నేతృత్వంలోని సంక్షేమ పాలన, ఆయన ఎన్నికల ప్రచారానికి దక్కిన స్పందన.. తమ సమావేశాలకు జనాదరణ కరువు కావడం చూశాక గెలుపు ఆశలు వదులుకుంది. ఈ ఎన్నికల్లో ఓడితే.. టీడీపీ, జనసేన, బీజేపీలది ప్యాకప్ పరిస్థితి. అందుకే గెలుపు కోసం ప్రతిపక్ష కూటమి ఎంతకైనా తెగించవచ్చని అధికార పక్షం భావిస్తోంది. గెలుపు ధీమా ప్రదర్శిస్తూనే.. ప్రత్యర్థుల కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు YSRCP కీలక నేతలు.
ఎలక్షన్ నాటి హింసాత్మక ఘటనలు, పల్నాడు రీజియన్‌లో పలు చోట్ల రిగ్గింగ్ జరగడం, ఈసీ.. పోలీసులు ఎన్టీయే కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వైఎస్సార్‌సీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. తమ పార్టీ తరఫున ఏజెంట్లగా నియమించినవారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లెక్కింపు సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి.. అభ్యంతరం వ్యక్తం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి.. ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు అడ్డంకులు సృష్టిస్తే ఏంచేయాలనే విషయమై తమ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: లెక్క ఏదైనా.. 'ఫ్యాన్' పక్కా
ఇంకోవైపు.. వైఎస్సార్‌సీపీకే ఎక్కువ విజయవకాశాలున్నట్లు మెజారిటీ సర్వేసంస్థలు వెల్లడించాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల్లో ఫలితాలకు ముందే జోష్ కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు మాత్రం మేమే వస్తామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన భయం వెంటాడుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత పందేలు కట్టడానికి కూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు సాహసించడం లేదు.
సామాన్య వర్గాల్లో ఉత్కంఠే
బరిలో నిలిచివారు, అనుచరులు, రాజకీయ శ్రేణులు మాత్రమే కాదు.. సామాన్యుల్లోనూ ఇప్పుడు ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. తీర్పు తమదే అయినా.. ఓటర్ నాడి గందరగోళంగా ఉందనే అభిప్రాయాల నడుమ ఫలితం ఎలా ఉండబోతుందా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి
ఈసారి లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సెంటర్‌కు ఇరువైపులా రెండు కి.మీ. రెడ్ జోన్‌గా ప్రకటించారు. లెక్కింపు కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంటు చొప్పున అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించే ఏజెంట్లకు బ్రీత్ ఎన్‌లైజర్‌తో ముందుగా పరీక్ష చేస్తారు. మద్యం తాగినట్లు తెలితే లోపలికి అనుమతించరు. తెల్లవారుజామున అయిదు గంటల నుంచే తనిఖీలు చేపట్టనున్నారు.
కౌంటింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు, అధికారులు, ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు ధరించి తనిఖీల్లో చూపించాలి. కేంద్రంలోకి ఒక్కసారి ఏజెంట్ లోపలికి వెళితే పూర్తయ్యే వరకు బయటకు రావడానికి వీలు లేదు.మరోవైపు.. అభ్యర్థులు, ఏజెంట్లు తప్ప మిగిలిన ప్రజలెవరూ కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమిగూడడానికి వీల్లేదు. అలాగే.. పోలింగ్ నాటి పరిస్థితుల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు కొన్నిచోట్ల అనుమతుల్లేవని పోలీసులుస్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేంద్రాల వద్ద మీడియా కమ్యూనికేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. రౌండ్లు వారీగా ఫలితాలు వెల్లడిస్తారు.
ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?.. రేపు ఉదయం 6గం. నుంచి మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ మీ సాక్షిలో..
Comments
Please login to add a commentAdd a comment