గుంటూరు, సాక్షి: కోట్ల మందికి సంక్షేమం అందించినా.. గతంలో జరగనంత మంచి చేసినా.. అన్ని వర్గాల మంచి కోసం ప్రతీ అడుగు వేసిన తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనే లేదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమిపై మంగళవారం సాయంత్రం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.
‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. యాభై మూడు లక్షల మంది తల్లులకు, మంచి చేసిన పిల్లలకు, వాళ్ల పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి ఆ అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేశాం. వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే ఫించన్ పంపిచే వ్యవస్థను తీసుకొచ్చాం. చాలీచాలని పెన్షన్ల నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపించిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఇలాంటి ఫలితాల్ని ఊహించలేదు. పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
54 లక్షల మంది రైతులకు మంచి చేశాం. రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చాం. కోటి ఐదు లక్షల మందికి సంక్షేమం అందించాం. ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడ్డాం. పిల్లలు బాగుండాలని అడుగులు వేశాం. అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డాం. ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు’’ అని వైఎస్ జగన్ అన్నారు.
సామాజిక న్యాయం చేసి ప్రపంచానికి చూపించాం. మేనిఫెస్టోను పవిత్రంగా భావించాం. చిత్తశుద్ధితో మేనిఫెస్టోను అమలు చేశాం. ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయపడ్డాం. మరి ఇంత చేసినా ఆ ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. చేయగలిగిన మంచి చేశాం. ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం. కానీ, పేదవాడికి తోడుగా.. అండగా ఎప్పుడూ నిలబడతాం’’ అని వైఎస్ జగన్ గద్గద స్వరంతో చెప్పారు.
పెద్ద పెద్ద నేతల కూటమి ఇది. బీజేపీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. గొప్ప విజయానికి కూటమి నేతలకు అభినందనలు. నా తోడుగా నిలబడిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తకి, స్టార్ క్యాంపెయినర్ నా అక్కచెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఏం చేసినా, ఎంత చేసినా ఇంక 40 శాతం ఓటు బ్యాంకుని తగ్గించలేకపోయారు. కిందపడినా గుండె ధైర్యంతో పైకి లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం పోరాటాలు చేయడం నాకు కొత్త కాదు. ఎవరూ అనుభవించని రాజకీయ కష్టాలు అనుభవించా. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా దేనికైనా సిద్ధం. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వాళ్లకు ఆల్ ది వెరీ బెస్ట్’’ అని వైఎస్ జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment