ఆ మేరకు టీడీపీ బేరసారాలు
కౌంటింగ్ కేంద్రాల్లో ఎక్కువ మంది తెలుగు తమ్ముళ్లు ఉండేలా ఎత్తుగడ
అవసరమైతే గొడవలు చేసేందుకు సిద్ధంగా ఉండేలా వ్యూహం
సత్తెనపల్లి: జూన్ 4న కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎక్కువ మంది తెలుగు తమ్ముళ్లను పంపేలా కూటమి నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఏజెంట్ల నియామకానికి గురువారంలోగా వివరాలు పంపాలని పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేశ్ బి లత్కర్ సూచించారు.
ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులతోపాటు మరో 93 మంది అభ్యర్థులు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల బరిలో ఉన్నారు. అభ్యర్థుల తరఫున ఏజెంట్లు నియమించుకోవడానికి ఆధార్ కార్డులతో పాటు గుర్తింపు పత్రాలు, ఫొటోలు ఇస్తే గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. గుర్తింపు పొందిన పార్టీలతో పాటు పోటీలో ఉన్న ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి తరఫున ఏజెంట్లను నియమించుకునేందుకు అవకాశం ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులకు ఎరవేసి వారి తరఫున కూడా తమవారిని నియమించుకునే వ్యూహాన్ని పల్నాడు జిల్లాలోని ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులు పన్నుతున్నట్లు చర్చ జరుగుతోంది.
స్వతంత్రంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఉన్న ఏజెంట్లకు బదులు టీడీపీ అభ్యర్థులు సొంత మనుషులను ఏజెంట్లుగా నియమించుకున్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థులు వారి ఏజెంట్లకు మాత్రమే ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. దీంతో స్వతంత్ర అభ్యర్థుల తరఫున తమ అనుచరులను ఏజెంట్లుగా నియమించుకున్నట్టు తెలిసింది.
లెక్కింపు కేంద్రం లోపల తమ వారు ఎక్కువ మంది ఉండేలా చూసుకుంటున్నారని, అందుకు ప్రధాన కారణం రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు అధికారులు ప్రకటించగానే తమకు సమాచారం ఇచ్చేలా నమ్మకస్తులను ఏర్పాటు చేసుకున్నట్లు అనుచర వర్గం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అవసరమైతే లోపల గొడవలకు కూడా సిద్ధంగా ఉండేలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, పోలీసులు ఇలాంటి ప్రలోభాలను నిలువరిస్తారా! లేక చేతులు ఎత్తేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది.
వ్యూహాత్మకంగా స్వతంత్రులుగా రంగంలోకి..
టీడీపీకి చెందిన కొందరినీ ముందుగానే వ్యూహం ప్రకారం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించారు. ఇప్పుడు వారి తరఫున కూడా ఏజెంట్లుగా తెలుగు తమ్ముళ్లే వెళ్లబోతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 15 మంది పోటీలో ఉన్నారు. వీరిలో వివిధ పార్టీల నుంచి 9 మంది బరిలో ఉంటే ఆరుగురు స్వతంత్రులున్నారు. స్వతంత్రులతో పాటు కొందరు బరిలో ఉన్న అభ్యర్థులనూ ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా చివరి ఘట్టమైన కౌంటింగ్ కేంద్రాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని, అనుకూలంగా లేకపోతే గొడవలకు దిగాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment