రూటే సెపరేటు | Sakshi
Sakshi News home page

రూటే సెపరేటు

Published Mon, May 6 2024 5:20 AM

రూటే సెపరేటు

 అందరి వాడు కాదు  

నిన్నమొన్నటి వరకూ స్థానికంగా ఓటుహక్కూ లేదు 

 ఒంటెత్తు పోకడతో దూరమైన టీడీపీ సీనియర్లు 

పార్వతీపురం నియోజకవర్గంలో ‘ఎన్‌ఆర్‌ఐ’కు ఎదురుగాలి

ఆయన స్థానికుడు కాదు. ఓ ఎన్‌ఆర్‌ఐ(నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌). కానీ ఇక్కడే నివాసమంటూ జనాలకు నమ్మబలుకుతున్నాడు. విదేశాల్లో ఉద్యోగమని..ప్రజాసేవ కోసం ఇక్కడికి వచ్చానని ఊదర గొడుతున్నాడు. నియోజకవర్గ రాజకీయాల్లోకి వస్తూనే టీడీపీలో ముసలం సృష్టించాడు. అప్పటివరకు నియోజకవర్గ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ఓ మాజీ ఎమ్మెల్సీని, మరో మాజీ ఎమ్మెల్యేను పూర్తిగా పక్కకు నెట్టేశాడు. పార్టీని తన చేతుల్లోకి తీసుకుని నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీల్చేశాడు. ఒంటెత్తు పోకడలకు తెరతీసి ఎవరైనా తన వద్దకే రావాలి గానీ..తాను ఎవరి వద్దకూ వెళ్లనంటూ పార్టీలో విభేదాలకు ఆజ్యం పోశాడు. ఈ పంచాయితీ అధిష్టానం దగ్గరికి వెళ్లినా..‘చినబాబు’ మద్దతుతో ఆయన మాటకు ఎదురే లేకపోయింది. దీంతో పార్టీ సీనియర్‌ నాయకులంతా ఇప్పుడు అంటీముట్టనట్లు ఉంటున్నారు.
● అందరి వాడు కాదు ● నిన్నమొన్నటి వరకూ స్థానికంగా ఓటుహక్కూ లేదు ● ఒంటెత్తు పోకడతో దూరమైన టీడీపీ సీనియర్లు ● పార్వతీపురం నియోజకవర్గంలో ‘ఎన్‌ఆర్‌ఐ’కు ఎదురుగాలి

సాక్షి, పార్వతీపురం మన్యం:

నిజానికి పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తే అన్నీ ఆర్థిక నేరారోపణలు, మోసాలు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వాటినే తెలుగుదేశం పార్టీ ఆ వ్యక్తి అర్హతలుగా నిర్ణయించి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. రాజకీయాల్లోకి రాకముందే ఇన్ని అబద్ధాలా అంటూ! నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. రేప్పొద్దున ఇటువంటి వ్యక్తికి ఓటేస్తే..ఇంకెన్ని మోసాలు చేస్తాడోనని చర్చించుకుంటున్నారు.

పార్వతీపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ ఎన్నికల బరిలో గెలిచేందుకు అన్ని అడ్డదారులూ తొక్కుతున్నట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈ వ్యక్తికి రాజకీయంగా గానీ, ప్రజాసేవపరంగా గానీ గతంలో ఎటువంటి అనుభవమూ లేదు. పుట్టింది, పెరిగింది, నివాసం ఇక్కడ కానేకాదు. ఎప్పుడో తాతల కాలంలో ఉండేవార మని ఓ ఊరు పేరు చెప్పి, తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పోనీ, ఆ ఊరిలోనైనా ఓటుహక్కు ఉందా? అంటే అదీ లేదు. మరో ఊరిలో ఆరునెలల క్రితం ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆయనకే అన్న హామీ లభించిన తర్వాతే..ఈ ప్రక్రియలన్నీ ప్రారంభించారు.

పార్టీ క్యాడర్‌లోనూ అసంతృప్తి

ఎక్కడి వ్యక్తినో తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారని..ఆయన ఒంటెత్తు పోకడలతో నలిగిపోతున్నామంటూ టీడీపీ క్యాడర్‌ రగిలిపోతోంది. దీనికితోడు ప్రచార సమయంలో ఆయన వెంట వెళ్లే క్యాడర్‌కు అయ్యే ఖర్చును సైతం సదరు ‘ఎన్‌ఆర్‌ఐ’ పెట్టుకోవడం లేదని, స్థానికంగా ఉండే పార్టీ నాయకుల మీదే నెట్టేస్తున్నాడని వినికిడి. దీంతో చోటామోటా నాయకులకు చేతిచమురు వదిలిపోతోంది. మరోవైపు ప్రజలు కూడా ఎక్కడో వ్యక్తిని ఇక్కడెందుకు ప్రోత్సహించాలన్న ఆలోచనలో పడినట్లు సమాచారం. స్థానికేతరుడికి ఓటు వేయడం కన్నా.. స్థానికంగా ఉంటూ నిత్యం మన సమస్యలను పరిష్కరిస్తూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను మరోసారి గెలిపించుకుందామని ఓ నిర్ణయానికి వచ్చేశారన్న చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోంది. అటు పార్టీ క్యాడర్‌కు దూరమై, ఇటు ప్రజలకూ దగ్గర కాలేక.. సదరు ‘ఎన్‌ఆర్‌ఐ’ ఓటమికి మానసికంగా ముందుగానే సిద్ధపడిపోయినట్లు అనుచరులు చెప్పుకుంటున్నారు.

ఆర్థిక నేరారోపణల్లో దిట్ట

సదరు అభ్యర్థిపై తీవ్రమైన ఆర్థిక నేరారోపణలూ ఉన్నాయి. కులం ముసుగులో తమను మోసం చేశారని..అక్కడ సంపాదించిన డబ్బులతో రాజ్యాధికారం కోసం సదరు వ్యక్తి ఆరాటపడుతున్నారని ఇన్‌ఫాం ఇంటర్నేషనల్‌ అనే సంస్థ గతంలో తీవ్రంగా ఆరోపణలు గుప్పించింది. కులం అభ్యున్నతి కోసం 2014లో ఐఎఫ్‌ఎం అనే సంస్థ ఏర్పాటైందని చెప్పిన అక్కడి ప్రతినిధులు..2018లో తమ సంస్థ చేసిన కార్యక్రమాలు చూసి ఆ వ్యక్తి తమతో కలిశాడని పేర్కొ న్నారు. సంస్థలో ఉన్న కొంతమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ మేధావులను పక్కదారి పట్టించి..ఇదే సంస్థ పేరు మీద విశాఖ గీతం యూనివర్సిటీలో కెనరా బ్యాంకు ఖాతా తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్నారు. అదేవిధంగా ఓ టీవీ చానల్‌లో డైరెక్టర్‌గా చేరి, రూ.4 కోట్లు వసూలు చేసి సంస్థకు ఇవ్వలేదని నాడు గుర్తు చేశారు. ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియక ఆ టీవీ చానల్‌ నడుపుతున్న శ్రీనివాసరావు చనిపోయారని అప్పట్లో పార్వతీపురంలో విలేకరుల సమావేశం పెట్టి మరీ

సంస్థ సభ్యులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement