ఎన్నికల్లో గెలుపుకోసం టీడీపీ, జనసేన పాట్లు
ఫలితంపై ఎడతెగని ఆందోళన
భారీ ఆశలతో బెట్టింగ్‌లకు దిగుతున్న టీడీపీ తమ్ముళ్లు
అంతా భ్రాంతియేనా..జీవితాన వెలుగింతేనా..అని ఓ సినీకవి అన్నట్లు తయారైంది జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన నాయకుల పరిస్థితి. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కోట్ల రూపాయలు ఓటర్లకు పంచినప్పటికీ తమను విజయం వరిస్తుందా? అన్న సందేహం వీడక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్సార్‌సీపీకి పూర్తి పట్టున్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎలాగైనా ఉనికిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ ఫలితం ఎలా ఉంటుందో అంతుబట్టక దిగాలుగా ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పోలింగ్ ముగిసి రెండు వారాలైంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మళ్లీ ఎగిరేది వైఎస్సార్‌సీపీ జెండాయేనని, రానున్న విజయం ఫ్యాన్‌దేనని రాజకీయ విశ్లేషకుల్లో అధికశాతం మంది ఢంకా భజాయించి చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ముహూర్తం కూడా చెప్పేశారు. ప్రత్యర్థులైన టీడీపీ, జనసేన నాయకులు మాత్రం ఓట్ల కోసం తాము ఖర్చు చేసిన కోట్ల రూపాయలతో తమకు అనుకూల ఫలితం వస్తుందనే భ్రమలో ఉన్నారు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసిన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎలాగైనా ఉనికి కాపాడు కోవాలన్నది వారి ఉద్దేశం. ఇందుకోసం తాయిలాలతో పాటు మద్యం ఏరులై పారించారు. కోట్లాది రూపాయలు వెదజల్లారు. ఓటరైతే చాలు వెయ్యి రూపాయలు, ప్రత్యర్థి పార్టీవారైతే రెండు వేల రూపాయల వరకూ పంచడమే వారి అధికార దాహానికి అద్దం పడుతోంది. కరోనా వంటి కష్టకాలంలో తామంతా ముఖం చాటేసినా, కోటల గేట్లు మూసేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఏవిధంగా అండగా నిలబడిందీ, ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులు ఏవిధంగా చేసిందీ ప్రజలు గుర్తుంచుకున్నారన్న విషయమే ఇప్పుడు టీడీపీ, జనసేన నాయకులకు నిద్ర పట్టనీయడం లేదు.
నోట్లు తీసుకున్నవారంతా ఓట్లేస్తే గట్టెక్కుతామన్న ధీమా వారికి కనబడడం లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసి ఎన్ని పక్కదారులు తొక్కినా ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకుంటూనే తమ్ముళ్లలో మనోధైర్యం కల్పించడానికి టీడీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన వారిని విజయనగరం రప్పిస్తూ, మనమే గెలుస్తున్నామంటూ రోజుకొకరితో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఈ ప్రకటనల భ్రమలో తెలుగు తమ్ముళ్లు భారీగా బెట్టింగ్‌లకు దిగుతున్నారు.
పదవే పరమావధిగా పందేరం
గతంలో ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ప్రజలకు తాయిలాలు ఇవ్వడమెరగని తండ్రి శైలికి భిన్నంగా ఆయన వారసురాలు మాత్రం ఈసారి రూ.కోట్లలో డబ్బులు బయటకు తీసినట్లు సమాచారం. అసెంబ్లీలో అధ్యక్షా అనాలనేదే లక్ష్యంగా విజయనగరం జిల్లాకేంద్రంలో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకూ ఖర్చు చేయడంపై ప్రజలే ఆశ్చర్యపోతున్నారు.
👉 టీడీపీ సీనియర్ నాయకులను కంగుతినిపించి మరీ పారిశ్రామిక ప్రాంతంలో టికెట్ తెచ్చుకున్న మాజీ మంత్రి ఒకరు ఈసారి ఎలాగైనా గెలవాలని తనదైన ఎత్తులు జిత్తులన్నీ అమలుచేశారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు చోటుచేసుకున్న మారణకాండ మచ్చ నుంచి బయటపడటానికి, ఓటర్లను మభ్యపెట్టడానికి గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా పారించారు. ఓటర్ల లెక్క ప్రకారం ఒక్కో గ్రామానికి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ గుట్టుచప్పుడు గాకుండా మూటలు పంపించారంటేనే పరిస్థితి ఊహించవచ్చు.
👉 గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకపోయినా ఈసారి టీడీపీ నాయకులకు ఝలక్ ఇచ్చి మరీ టికెట్ తెచ్చుకున్న కూటమి అభ్యర్థిని అధికార దాహంతో అడ్డదారులన్నీ తొక్కారు. తన విద్యాసంస్థను, తనకున్న స్వదేశీ, విదేశీ కంపెనీలను చూపించి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఓట్లేస్తే అందరికీ ఉద్యోగాలిచ్చేస్తానంటూ భ్రమలు కల్పించారు. గ్రామీణ ప్రజలకు మాత్రం అప్పటికే బకెట్లు పంచిన ఆమె పోలింగ్‌కు ముందు డబ్బుల పందేరానికి తెరతీశారు. ఇందుకు తమ సంస్థ ఉద్యోగులనే పావులుగా వాడుకున్నారు.
👉 దీర్ఘకాలంగా తాను నమ్ముకున్న నియోజకవర్గం నుంచి కొత్త నియోజకవర్గానికి వలసవచ్చిన టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరతీశారు. చీపురుపల్లి–విజయనగరం ప్రధాన రహదారిని ఆనుకుని ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయమే కేంద్రంగా తాయిలాలు, నగదు పంపిణీ జరిగింది. ఒడిశా నుంచి చీప్ లిక్కర్‌తో పాటు సారా కూడా రప్పించి మరీ గ్రామాల్లో పారించారు.
👉 బాబాయ్ సీటుకు ఎసరుపెట్టి ఆఖరి నిమిషంలో టికెట్ తెచ్చుకున్న ఓ టీడీపీ అభ్యర్థి తన తరఫున భారీ ఎత్తున డబ్బు పంపిణీకి ఏకంగా ఎన్నారైలను రంగంలోకి దించారు. అవినీతిలో అన‘కొండ’గా పేరొందిన తన తండ్రికి ఆ బాధ్యతలు అప్పగిస్తే ఎక్కడ తేడా కొడుతుందోనని ఆలోచించినట్లు ఉంది. అన్ని మార్గాల్లో నుంచి చేతికి అందొచ్చిన రూ.30 కోట్ల వరకూ పందేరం చేసినట్లు వినికిడి.
👉 తనదే గెలుపు అని రెండేళ్లుగా కత్తి దూసి మరీ సోషల్ మీడియాలో చాటింపు వేయించుకున్న ఓ రాజు ఆఖరి నిమిషంలో తాయిలాల మోత మోగించారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ పంపిణీ చేయించారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి లాడ్జిల్లో మకాం వేసిన బంధువులతో పాటు గతంలో మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించిన సోదరుడి సాయం తీసుకున్నారు. మరోవైపు ఖరీదైన మద్యాన్నే మందుబాబులకు రుచి చూపించారు.
👉 గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ఓ నాయకురాలు తాయిలాల పంపిణీలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. తన చేతిలో ఉన్నది ఇదేనంటూ రూ.10 కోట్ల వరకూ ఎంపీ అభ్యర్థి చేతిలో పెట్టి ఊరుకున్నారట. ఇదే అదునుగా ఆ నియోజకవర్గానికి చెందిన కుటుంబంలోని భార్య ఒక పార్టీలో, భర్త ఒక పార్టీలో ఉంటున్న వారు డబ్బు పందేరంలో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. తన విద్యాసంస్థకు చెందిన విద్యార్థులనే పావులుగా వాడుకుంటూ ఎంపీ అభ్యర్థి పంపించిన డబ్బు మూటలు ఎవరికి ఎంతమేర ఇవ్వాలో చెబుతూ ఈ ఆదర్శ దంపతులు రూ.కోట్లలోనే వెనకేసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటుకు రూ.వెయ్యి చొప్పున డబ్బుతో పాటు మద్యం బాగానే ఇక్కడ టీడీపీ నాయకులు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment