ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని వివరిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజలు నియోజకవర్గంలో భారీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సీఎం వైఎస్ జగన్ తమకు చేసిన మేలును వివరించారు.
యువత బైక్‌లతో ర్యాలీ చేశారు. నెల్లిమర్ల డైట్ కాలేజీ మీదుగా కొండవెలగాడ, జర్జాపుపేట వరకూ యాత్ర సాగింది. కొండవెలగాడలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శించారు. సాయంత్రం 4 గంటలకు నెల్లిమర్ల మొయిదా జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ – జైజై జగన్, జగనే కావాలి – జగనే రావాలి నినాదాలు సభలో హోరెత్తాయి.
పేదల పెన్నిధి సీఎం జగన్ : ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర
సీఎం వైఎస్ జగన్ పేదల పెన్నిధి అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉండగా గిరిజనులు, ముస్లింలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. మంత్రి పదవుల నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింటా పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. గిరిజనుడైన తాను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానంటే జగన్ వల్లే నని అన్నారు. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇలా 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందర్నీ మోసం చేశారన్నారు.
వ్యవస్థల్లో సమూల మార్పులు: మంత్రి ధర్మాన ప్రసాదరావు
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవస్థల్లో సమూల మార్పులు తెచ్చారని తెలిపారు. పేదల కోసం విద్య, వైద్య రంగాలను సమూలంగా ప్రక్షాళన చేసి, అధునాతనంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పుడు ప్రతి పేద కుటుంబం మంచి విద్యను, మంచి వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందుకుంటున్నాయని తెలిపారు.
విభజన తర్వాత పదేళ్ల వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ వదిలేసి వచ్చిన చంద్రబాబు కొత్త రాజధానిని రాజ్యాంగం, చట్టం ప్రకారం గాకుండా వ్యాపారంగా మార్చేశారన్నారు. రాష్ట్రంలో పెద్ద పట్టణం, అన్ని హంగులూ ఉన్న విశాఖని కాదని, తన అనుయాయులతో భూములు కొనిపించిన ప్రాంతంలో అర్ధరాత్రి రాజధానిని ప్రకటించిన పాపం చంద్రబాబుదేనన్నారు.
సీఎం జగన్‌ది సుపరిపాలన: మంత్రి సీదిరి అప్పలరాజు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అందిస్తూ సుపరిపాలన చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలను అక్కున చేర్చుకొని, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అవమానించిన చంద్రబాబును అందరూ సమష్టిగా మరోసారి ఓడించాలని పిలుపునిచ్చారు.
భోగాపురంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి: మంత్రి అమర్‌నాథ్
నెల్లిమర్ల నియోజకవర్గంలో సీఎం జగన్ ఇటీవల భూమిపూజ చేసిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. రూ.4,750 కోట్లతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయంతో 50 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సారిపల్లి ఇండ ్రస్టియల్ పార్కు అప్‌గ్రేడ్ పనులకు సీఎం త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారని తెలిపారు.
నెల్లిమర్లలో రూ.1172 కోట్ల సంక్షేమం: ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు
నెల్లిమర్ల నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలో రూ.1,172 కోట్లు సంక్షేమ కార్యక్రమాల కోసం సీఎం వైఎస్ జగన్ వెచ్చించారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చెప్పారు. రామతీర్థంలో విధ్వంసాన్ని టీడీపీ రాజకీయం చేస్తే, సీఎం జగన్ మాత్రం రూ.4.5 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించారని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు, ఎమ్మెల్యేలు శంబంగి అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ శోభా స్వాతిరాణి, నవరత్నాల వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment