రాష్ట్రంలో తొలిసారిగా చీపురుపల్లి జెడ్పీ బాలుర హైస్కూల్‌లో ఏఐ ల్యాబ్ ఏర్పాటు
రూ.15 లక్షలతో 9 అత్యాధునిక కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు...
ఇంటెల్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
పాఠశాల స్థాయి నుంచే కృత్రిమ మేధ చదువుకు పునాది
పేద విద్యార్థులు ఆధునిక ఆవిష్కరణలు చేసేందుకు చక్కని అవకాశం
చీపురుపల్లి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) శకం ఆరంభమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లలో సైతం ఎక్కడా లేని విధంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇంటెల్ ఇండియా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అధునాతన ఏఐ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది రాష్ట్రంలోనే తొలి ఏఐ ల్యాబ్ కావడం విశేషం. ఈ ల్యాబ్ పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయనుంది. రానున్న రోజుల్లో మరిన్ని అధునాతన ల్యాబ్‌ల ఏర్పాటుకు మార్గదర్శి కానుంది. సమాజానికి ఉపయోగపడే ఆధునిక ఆవిష్కరణలకు దోహదపడనుంది.
‘ఏఐ ఫర్ యూత్’ పేరుతో నాలుగు సెషన్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌లలో ‘ఏఐ ఫర్ యూత్’ అనే పేరుతో నాలుగు సెషన్లలో 8, 9 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మొదటి సెషన్‌లో ఇన్‌సై్పర్, రెండో సెషన్‌లో ఎక్వయర్, మూడో సెషన్‌లో ఎక్స్‌పీరియన్స్, నాలుగో సెషన్‌లో ఎంపవర్ అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ నాలుగు సెషన్లు పూర్తయిన తర్వాత సమాజంలో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేయాల్సి ఉంటుంది.
రూ.15 లక్షలతో ల్యాబ్ ఏర్పాటు
రాష్ట్రంలో తొలిసారిగా రూ.15 లక్షలతో చీపురుపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో తొమ్మిది అత్యాధునిక కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, ఏసీలు ఉన్నాయి. దీనికోసం బాలుర ఉన్నత పాఠశాలలో ఒక గదిని కేటాయించారు.
విద్యార్థులకు వరం
ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేయడం విద్యార్థులకు వరం. రాష్ట్రానికి ఒక ల్యాబ్ కేటాయిస్తే దానిని చీపురుపల్లిలో ఏర్పాటు చేయడం ఇక్కడి విద్యార్థులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. విద్యార్థులు ఈ ల్యాబ్‌ను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్‌లో ఎంతో అవసరమైన అద్భుత నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు.
– ఏవీఆర్‌డీ ప్రసాద్, ఏఐ ల్యాబ్ కన్సల్టేటర్
Comments
Please login to add a commentAdd a comment