పాలకొండలో గర్జించిన గిరిజనం | samajika sadhikara sabha at palakonda | Sakshi
Sakshi News home page

పాలకొండలో గర్జించిన గిరిజనం

Published Sat, Nov 25 2023 4:08 AM | Last Updated on Sat, Nov 25 2023 3:33 PM

samajika sadhikara sabha at palakonda - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: గిరిజనుల గడ్డ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో శుక్ర­వారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు జనం పోటెత్తారు. గిరిజనులతో పాటు ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత పాలకొండ మండలం చినమంగళాపురంలో ఆర్బీకే, గ్రామ సచివాలయం భవ­నాలను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఎమ్మె­ల్సీ పాలవ­లస విక్రాంత్, ఎమ్మెల్యేలు విశ్వాస­రాయి కళావతి, అలజంగి జోగారావు, కంబాల జోగులతో కలిసి వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. పాలకొండ వరకూ సాగిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వందలాది కార్యకర్తలు ఉత్సాహంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు.   

సాధికారతకు నేనే నిదర్శనం: ఎమ్మెల్యే కళావతి
సీఎం జగన్‌ పాలనలో సామాజిక సాధికారత సాకా­రమైందనడానికి ఆదివాసీ మహిళనైన తానే నిదర్శ­నమని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. గత టీడీపీ పాలనలో ప్రసంగాలకే పరిమితమైన సామాజిక న్యాయం.. ఇన్నాళ్లకు జగనన్న ప్రభుత్వంలో సాకారమైందని చెప్పారు.   

3 లక్షల ఎకరాల భూ పంపిణీ: ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర
సీఎం జగన్‌ నాలుగున్నరేళ్ల పాలనలో 3 లక్షల ఎక­రాల భూమిని గిరిజనులకు పంపిణీ చేశారని, గతంలో చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో 40 వేల ఎకరాలు కూడా ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న­దొర చెప్పారు. గిరిజనుల అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు, జగన్‌కు నక్కకు, నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందన్నారు. బాబు మోసాలను గుర్తు చేసుకో.. ఫ్యాన్‌ గుర్తును తలచుకో.. అంటూ వేదికపై పాడిన పాట ఆకట్టుకుంది.  

దేశమంతా చర్చ : స్పీకర్‌ తమ్మినేని 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సామాజిక సాధి­కా­రతకు సంబంధించి ఏపీలో జరుగుతున్న బస్సు యాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. గతంలో ఎన్నడూ వెలుగుచూడని 139 వెనుకబడిన కులాలను గుర్తించి 56 కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా నిధులు, విధులు, బాధ్యతలు ఇచ్చి వారి ఆత్మాభిమానాన్ని సీఎం జగన్‌ పెంచారన్నారు.  

ఏపీలో సామాజిక విప్లవం : మంత్రి మేరుగు  
దేశంలో మరే ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా సీఎం జగన్‌ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాష్ట్రంలో సామాజిక విప్లవం ద్వారా సాధికారత సాధించారని తెలిపారు.    

గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు అన్ని సామా­జిక వర్గాలను అవమానించారని మంత్రి సీదిరి అప్ప­లరాజు గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఇంకెంత కాలం చంద్రబాబుకు బానిసలు­గా ఉంటారని, బయటకు వస్తే విశాఖను పరిపా­లన రాజధాని చేసుకుందామని పిలుపునిచ్చా­రు. ఎంపీలు గొడ్డేటి మాధవి, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, రెడ్డి శాంతి, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతీరాణి పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement