విజయనగరం జిల్లా రాజాంలో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సుపరిపాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధిని ప్రతిబింబిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాంలో ఆ వర్గాల జైత్రయాత్రలా ఘనంగా సాగింది. ఈ యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువత, మహిళలు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజాం మండలం బొద్దాం గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను యాత్రలో పాల్గొన్న మంత్రులు, ఇతర నేతలు ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా ప్రారంభమైన యాత్ర రాజాం పట్టణ సమీపంలో కంచరాం తృప్తి రిసార్ట్ వరకూ సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజాం పట్టణంలోకి ప్రవేశించింది. దాదాపు మూడు వేల మంది బైక్‌ర్యాలీగా బస్సు యాత్ర ముందు సాగారు.
అంబేడ్కర్ కూడలిలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన వేలాది మంది తరలివచ్చారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును నేతలు వివరిస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. జై జగన్.. జై జై జగన్ అంటూ నినదించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆత్మ బంధువు అని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. దేశంలో మరే సీఎంచేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని పదవుల్లో పెద్దపీట వేసి, అనేక పథకాలతో అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నారని చెప్పారు.
అందుకే ఈరోజు సామాజిక సాధికార యాత్రను ఓ జైత్రయాత్ర నిర్వహించుకోగలుగుతున్నామన్నారు. 139 బీసీ సామాజికవర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, వాటికి చైర్మన్‌లతో పాటు 700 డైరెక్టర్ల పదవులను ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడారని వివరించారు.
కులగణన జరగాలని దేశంలోనే మొట్టమొదటగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నదీ సీఎం జగనే అని చెప్పారు. విద్య, వైద్యాన్ని బడుగు, బలహీనవర్గాలకు చేరువ చేస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, ఇదే అసలైన అభివృద్ధి అని వివరించారు. తాండ్ర పాపారాయుడు పుట్టిన గడ్డపై ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే టీడీపీ నాయకులను తిప్పికొడతామని హెచ్చరించారు.
సంతృప్తకర స్థాయిలో సంక్షేమం: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నారని, అన్ని రంగాలనూ అభివృద్ధి చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి: ఎమ్మెల్యే జోగులు
రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఈ ప్రాంతానికి చెందిన సామాజిక వర్గానికి 70 శాతం మేర పదవులు వచ్చాయని వెల్లడించారు. నాగావళి నదిపై రుషింగి, కిమ్మి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 25 కోట్లు మంజూరుచేస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పనులు పూర్తిచేయించారని చెప్పారు.
తోటపల్లి రెగ్యులేటర్ కుడికాలువ ఆధునికీకరణకు రూ.40 కోట్లు మంజూరుచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment