bus trip
-
రాజాంలో సామాజిక జైత్రయాత్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సుపరిపాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధిని ప్రతిబింబిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయనగరం జిల్లా రాజాంలో ఆ వర్గాల జైత్రయాత్రలా ఘనంగా సాగింది. ఈ యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువత, మహిళలు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజాం మండలం బొద్దాం గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను యాత్రలో పాల్గొన్న మంత్రులు, ఇతర నేతలు ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా ప్రారంభమైన యాత్ర రాజాం పట్టణ సమీపంలో కంచరాం తృప్తి రిసార్ట్ వరకూ సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజాం పట్టణంలోకి ప్రవేశించింది. దాదాపు మూడు వేల మంది బైక్‌ర్యాలీగా బస్సు యాత్ర ముందు సాగారు. అంబేడ్కర్ కూడలిలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన వేలాది మంది తరలివచ్చారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును నేతలు వివరిస్తుంటే చప్పట్లతో స్వాగతించారు. జై జగన్.. జై జై జగన్ అంటూ నినదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మ బంధువు అని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. దేశంలో మరే సీఎంచేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని పదవుల్లో పెద్దపీట వేసి, అనేక పథకాలతో అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నారని చెప్పారు. అందుకే ఈరోజు సామాజిక సాధికార యాత్రను ఓ జైత్రయాత్ర నిర్వహించుకోగలుగుతున్నామన్నారు. 139 బీసీ సామాజికవర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, వాటికి చైర్మన్లతో పాటు 700 డైరెక్టర్ల పదవులను ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడారని వివరించారు. కులగణన జరగాలని దేశంలోనే మొట్టమొదటగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నదీ సీఎం జగనే అని చెప్పారు. విద్య, వైద్యాన్ని బడుగు, బలహీనవర్గాలకు చేరువ చేస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, ఇదే అసలైన అభివృద్ధి అని వివరించారు. తాండ్ర పాపారాయుడు పుట్టిన గడ్డపై ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే టీడీపీ నాయకులను తిప్పికొడతామని హెచ్చరించారు. సంతృప్తకర స్థాయిలో సంక్షేమం: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ నాలుగున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నారని, అన్ని రంగాలనూ అభివృద్ధి చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి: ఎమ్మెల్యే జోగులు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఈ ప్రాంతానికి చెందిన సామాజిక వర్గానికి 70 శాతం మేర పదవులు వచ్చాయని వెల్లడించారు. నాగావళి నదిపై రుషింగి, కిమ్మి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 25 కోట్లు మంజూరుచేస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పనులు పూర్తిచేయించారని చెప్పారు. తోటపల్లి రెగ్యులేటర్ కుడికాలువ ఆధునికీకరణకు రూ.40 కోట్లు మంజూరుచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మళ్లీ రాష్ట్రానికి రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. రెండో విడత బస్సు యాత్రను ఆయన వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభిస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే రాహుల్‌గాంధీ ఎక్కడ పాల్గొంటారనేది ఖరారు కావాల్సి ఉందన్నాయి. మొదటి విడత బస్సు యాత్రలో భాగంగా మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణలోని 8 నియోజకవర్గాల్లో పర్యటించిన రాహుల్ ఈసారి దక్షిణ తెలంగాణలో పర్యటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రియాంకాగాంధీ ఈనెల 31న కొల్లాపూర్‌లో జరిగే పాలమూరు ప్రజాభేరి సభకు హాజరు కానున్నారు. ఆ రోజున సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న ఆమె అక్కడి నుంచి నేరుగా వెళ్లి కొల్లాపూర్ సభలో పాల్గొంటారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర నేతలు మొదటి విడత బస్సు యాత్రను ఈనెల 26, 27 తేదీల్లో కొనసాగించేలా పార్టీ షెడ్యూల్ రూపొందించింది. ఈ రెండు రోజుల్లో మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్‌తోపాటు మొత్తం 10 మంది నాయకులు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున 40 నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. ఈ రెండు రోజులపాటు ఆయా నియోజకవర్గాల్లో గడప గడపకూ వెళ్లి ఆరు గ్యారంటీ పథకాల కార్డులను పంపిణీ చేయడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసే సభల్లో కూడా నేతలు పాల్గొననున్నారు. సీఈసీ నిర్ణయమే ఫైనల్: మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీ అభ్యర్థుల ఖరారు కోసం బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశమవుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని, సీఈసీ నిర్ణయమే ఫైనల్ అని ఆయన గాందీభవన్‌లో మంగళవారం విలేకరులకు చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానాలను మైనార్టీ నేతలు అడుగుతున్నారని, పార్టీ కూడా మైనార్టీలకు న్యాయం చేస్తుందని చెప్పారు. తాను ఆశిస్తున్న నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని ఎవరికి కేటాయించాలన్న దానిపై స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం జరగనున్న సీఈసీ సమావేశానికి అందుబాటులో ఉండాలని పార్టీ నుంచి పిలుపు రావడంతో ఆయన ఢిల్లీ వెళ్లారని, రాష్ట్ర నాయకత్వం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సానుకూలంగానే ఉన్నా ఆయనకు మైనార్టీ సెగ తప్పదని తెలుస్తోంది. మరోవైపు ఇదే స్థానం తనకు కేటాయించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ కూడా గట్టిగా పట్టుపడుతుండటం, అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. -
టీడీపీ ఇక గెలవదు..
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2024లో సీఎం అవుతారని కొందరు టీడీపీ నేతలు కంటున్న కలలు కల్లలవుతాయని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన తాడేపల్లిలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవ రాజకీయ పరిస్థితులను బాబు అభిమానులు గమనించాలని సూచించారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న డీఎంకేకు, మామను వెన్నుపోటు పొడిచి లాక్కున్న టీడీపీకి నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలిపారు. ప్రజా ఉద్యమాల్లో రాటుదేలిన పోరాట యోధుడు, గొప్ప రచయిత అయిన కరుణానిధికి, కుప్పం ఎమ్యెల్యే నారా చంద్రబాబుకి మధ్య పోల్చడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. గెలుపే లక్ష్యంగా సామాజిక సాధికార యాత్ర.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రలు చేయాలని వైఎస్సార్సీపీ సంకల్పించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూనే.. మరోవైపు పార్టీ పరమైన కార్యక్రమాల నిర్వహణకు సీఎం వైఎస్ జగన్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలోని తెనాలి, రాయలసీమలోని శింగనమల నియోజకవర్గాలలో బస్సు యాత్రలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. తొలి విడతలో నవంబర్ తొమ్మిదో తేదీ వరకు యాత్రలు కొనసాగుతాయని వివరించారు. గడిచిన నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సీఎం జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఈ యాత్రల్లో వివరిస్తారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. -
15 నుంచి కాంగ్రెస్ బస్సుయాత్ర!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలు నిర్వహించ తలపెట్టిన బస్సుయాత్రను ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు తెలిసింది. ఈ నెల 14 తర్వాత ఏ క్షణమైనా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడుతుందన్న అంచనాల నేపథ్యంలో టీపీసీసీ నేతలు దీనిపై సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బస్సు యాత్రను ప్రారంభించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రానున్నారని.. యాత్ర జరుగుతున్న సమయంలో రాహుల్గాందీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందుతోందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 9న లేదా 10న జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో షెడ్యూల్, రూట్ మ్యాప్‌ను ఖరారు చేయనున్నట్టు వివరిస్తున్నాయి. టికెట్లు ఎప్పుడు?.. సమావేశాలు ఎన్నడు? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశం హాట్‌టాపిక్‌గా నడుస్తోంది. రెండు దఫాలు స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో.. అదిగో జాబితా, ఇదిగో జాబితా అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే టికెట్ల ప్రకటన ఈనెల 14వ తేదీ తర్వాతే ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి అక్టోబర్ మొదటి వారంలోనే తొలిజాబితా విడుదల చేసేలా కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేశారు. కానీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఇంకా జరగాల్సి ఉండడం, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరగకపోవడంతోపాటు పితృపక్షాల కారణంగా మంచి రోజులు లేవనే ఉద్దేశంతో అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసినట్టు సమాచారం. ఈ నెల 14న అమావాస్య ఉండటంతో ఆ తర్వాత తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా ఉంటుందని టీపీసీసీ కీలక నేత ఒకరు వెల్లడించారు. ఇందుకోసం ఈనెల 8న స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతుందని, తర్వాత 10న సీఈసీ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ ఒక్కోపేరు పంపిన నియోజకవర్గాలకే తొలుత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిసింది. రెండు, మూడుపేర్లు పంపిన సెగ్మెంట్లకు సంబంధించి ఒక్కో పేరును ఫైనల్ చేసేందుకు సీఈసీ కొన్ని మార్గదర్శకాలు ఇస్తుందని, ఆ మార్గదర్శకాల మేరకు మళ్లీ స్క్రీనింగ్ కమిటీనే ఒక్కో పేరు సూచించాల్సి వస్తుందనే చర్చ ఏఐసీసీ వర్గాల్లో జరుగుతోంది. పెద్ద నేతల పర్యటనలపై చర్చ శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి చేరిక సందర్భంగా ఢిల్లీలో ఖర్గే, వేణుగోపాల్‌లతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు తెలంగాణలో ఏఐసీసీ కీలక నేతల పర్యటనలపై చర్చించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీలున్నన్ని ఎక్కువ సార్లు ప్రియాంక, రాహుల్‌గాంధీలతోపాటు ఖర్గే కూడా రాష్ట్రంలో పర్యటించేలా షెడ్యూల్ ఇవ్వాలని, కీలక సమయంలో మరోమారు సోనియాగాంధీ కూడా పాల్గొనేందుకు అనుమతి ఇప్పించాలని రేవంత్ కోరినట్టు సమాచారం. ఈ నెల 15 తర్వాత రాష్ట్రంలో రెండు రోజులపాటు రాహుల్ పర్యటన ఉంటుందని తెలిసింది. -
‘బీసీలను ఏకం చేసేందుకు బస్సు యాత్ర’
ఖైరతాబాద్ (హైదరాబాద్): బీసీ జనగణనపై పార్లమెంట్లో తీర్మానించకపోతే అమరావతి నుంచి హైదరాబాద్ వరకు బస్సు యాత్ర చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం లక్డీకాపూల్‌లోని ఒక హోటల్లో తెలంగాణ, ఏపీకి చెందిన బీసీ సంఘాల నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల మాట్లాడుతూ.. సంక్రాంతి నుంచి యాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశంలో అన్ని వర్గాలకు.. వారి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు మాత్రం కల్పించడం లేదని విమర్శించారు. ఈ విషయాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలను ఏకం చేసేందుకు బస్సు యాత్రతో పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అ ధ్యక్షుడు శంకర్రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ పాల్గొన్నారు. -
‘సామాజిక న్యాయం అనే మాటకు విలువిచ్చిన ఏకైక సీఎం.. వైఎస్ జగన్’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర పోస్టర్‌ను మంత్రి జోగి రమేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.ఆటోల ద్వారా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ బస్సు యాత్ర ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి జోగి రమేష్, పూనూరు గౌతమ్ రెడ్డి పోస్టర్లు అంటించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి 29 వరకూ సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర సాగనున్నట్లు తెలిపారు. బహుజనులంతా జయహో జగనన్న అని నినదిస్తున్నారని అన్నారు. భారత దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా సామాజిక న్యాయం పాటించలేకపోయారని, సామాజిక న్యాయం అనే మాటకు విలువిచ్చిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. స్పీకర్ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకూ సామాజిక న్యాయం పాటించారన్నారు. అలాగే 75% శాతం సామాజిక న్యాయం అమలు చేశారన్నారు. సీఎం జగన్ సామాజిక విప్లవ కారుడని, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ బస్సుయాత్రను దిగ్విజయం చేస్తామని తెలిపారు. బస్సుయాత్రలో 17 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారన్నారు. నాలుగు జిల్లాల్లో బహిరంగ సభలు వేలమందితో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక సామాజిక న్యాయభేరికి వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పూర్తి సహకారం అందిస్తున్నట్లు పూనూరు గౌతమ్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆటోల ద్వారా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ బస్సు యాత్రకు రాహుల్!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17 నుంచి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చేపట్టనున్న నాలుగో విడత బస్సు యాత్రలో ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆయన రాష్ట్ర పర్యటన దాదాపు ఖరారైందని పేర్కొన్నాయి. రాష్ట్రంలో రాహుల్ పర్యటన ద్వారా 2019 ఎన్నికలకు సమరశంఖం పూరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. జూన్ 1 నాటికే బస్సు యాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్ లేదా వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభకు రాహుల్‌ను టీపీసీసీ ఆహ్వానించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల బస్సు యాత్ర షెడ్యూల్లో జాప్యం జరిగింది. దీంతో బహిరంగ సభ కూడా రద్దయింది. నాలుగో విడత బస్సు యాత్రకు రాహుల్‌ను ఆహ్వానించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చేత ప్రజలకు సందేశం ఇప్పించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ భావించారు. గత నెల ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ పెద్దలను కలసి రాహుల్ పర్యటన ఖరారు చేయాలని కోరా రు. దీనికి రాహుల్ కూడా సానుకూలంగా స్పందించారని, అమెరికా నుంచి రాగానే రాష్ట్ర పర్యటన తేదీలను ఖరారు చేస్తారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఈ నెల చివరి వారంలో రాహు ల్ హైదరాబాద్ పర్యటన ఉంటుందన్నారు. ఆ సమయానికల్లా బస్సు యాత్ర రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వరకు వస్తుందని, అప్పుడు యాత్రలో రాహుల్ పాల్గొనేలా చేయాలని టీపీసీసీ నేతలు యోచిస్తున్నారు. రెండురోజులపాటు ఆయన సమయం ఇచ్చే అవకాశం ఉన్నందున రాహుల్ పర్యటన షెడ్యూల్ తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా టీపీసీసీ కమిటీల విషయంలో కసరత్తు జరుగుతోందని, నేడో, రేపో ఈ కమిటీలకు సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని మంగళవారం ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవం కాదని టీపీసీసీ నేతలు వెల్లడించారు. -
బస్సు రెడీ.. నేతలూ రెడీ..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఈనెల 26 నుంచి తలపెట్టిన ‘బస్సుయాత్ర’కు సర్వం సిద్ధమవుతోంది. యాత్ర విజయవంతం కోసం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో సలహా కమిటీ, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ సారథ్యంలో ఆర్గనైజింగ్ కమిటీ, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి చైర్మన్‌గా ఆర్థిక కమిటీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆధ్వర్యంలో మీడియా కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించారు. ఈ కమిటీల ఏర్పాటుతోపాటు యాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన 40 సీట్ల వోల్వో బస్సు కూడా సిద్ధమయింది. నాలుగువైపులా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాల బొమ్మలతో ఈ బస్సు తయారైంది. బస్సుతోపాటు రెండు ప్రచార రథాలను సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను మాజీ మంత్రి దానం నాగేందర్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, బస్సుయాత్ర కోసం ఏర్పాటు చేసిన కమిటీలలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డిలలో ఎవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. ఫేస్బుక్ లైవ్ బస్సుయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆ పార్టీ కార్యకర్తలతో ముచ్చటించారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ లైవ్ ప్రోగ్రాంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కేడర్‌తో ఆయన మాట్లాడారు. బస్సుయాత్ర చేయాల్సిన ఆవశ్యకతతో పాటు పార్టీ ఉద్దేశాన్ని కేడర్‌కు ఆయన వివరించారు. ఉత్తమ్ నిర్వహించిన ఈ ఫేస్బుక్ లైవ్‌కు విశేష స్పందన లభించిందని, మానకొండూరు, నారాయణ్‌ఖేడ్, జడ్చర్ల, కామారెడ్డి, ఖాజీపేట, హైదరాబాద్‌కు చెందిన పలువురు కార్యకర్తలు, ప్రజలు ఉత్తమ్‌తో తమ సమస్యలు, అనుభవాలను పంచుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, బస్సుయాత్ర ప్రారంభానికి ముందు సోమవారం ఉదయం నుంచి సర్వమత పూజలు నిర్వహించనున్నారు. నాంపల్లి దర్గా, ఆరెమైసమ్మ దేవాలయం, మొయినాబాద్ చర్చిలలో పూజలు నిర్వహించిన అనంతరం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు చేవెళ్లలో యాత్ర ప్రారంభించనున్నారు. తొలి దశలో మూడు రోజులపాటు జరిగే ఈ యాత్రలో ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. -
చంద్రబాబు అవినీతిని బయట పెట్టేందుకు..
సాక్షి, ఏలూరు : సీఎం చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసేందుకు, పోలవరం ప్రాజెక్టు వాస్తవ స్థితిని పరిశీలించేందుకు వైఎస్సార్ సీపీ బృందం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించాలని నిర్ణయించింది. వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సీనియర్ నేతల బృందం గురువారం ఉదయం బస్సు యాత్రకు బయలుదేరింది. యాత్రకు బయలుదేరిన వారిలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా, మరికొందరు కీలకనేతలు ఉన్నారు. విజయవాడలో బయలుదేరి నేరుగా పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని, అనంతరం నేతలు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. టెండర్ల అంశాలను, వాస్తవాలను తెలుసుకోవడానికి వైఎస్ఆర్ సీపీ నేతలు బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఓ పథకం ప్రకారం సమాధి కట్టాలని యోచిస్తోంది. ఈ దుర్మార్గ వైఖరిని ప్రజలకు చూపించాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయించుకుంది. పోలవరం ప్రాజెక్టును రక్షించేందుకు, సత్వరం నిర్మించేందుకు అన్ని రకాలుగా చంద్రబాబు సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బస్సుయాత్రను మార్గంగా ఎంచుకున్నట్లు వైఎస్ఆర్ సీపీ బృందం తెలిపింది. నిర్వాసితులకు అమలు చేస్తున్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి నిర్వాసితులతో మాట్లాడి తెలుసుకుంటామన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు దక్కించుకుని పనులు చేపట్టారని, ఆయన చెబుతున్నదానికి పనులు జరుగుతున్న తీరుకు సంబంధం లేదన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు చెబుతున్న అబద్దాలు, అవాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందన్నారు. -
చంద్రబాబు అవినీతిని బయట పెట్టేందుకు..
-
పోలవరానికి YSRCP నేతలు బస్సు యాత్ర
-
వినూత్న ఆలోచనలకు ‘షురువాత్’
హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)–2017 నేపథ్యంలో ‘రోడ్ టు జీఈఎస్’పేరిట ప్రారంభించిన దేశవ్యాప్త ‘షురువాత్’ బస్సు యాత్ర నగరానికి చేరుకుంది. గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌కు ఆదివారం ఈ యాత్ర చేరింది. నీతిఆయోగ్, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సంయుక్త ఆధ్వర్యంలో ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ఫౌండేషన్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా, సీఈవో గౌరీ ఈశ్వరన్, స్పెషల్ ప్రాజెక్ట్స్ లీడ్ క్షితిజ్ శరణ్ నేతృత్వంలో పది మంది సభ్యుల బృందం ఈ బస్సులో ప్రయాణం సాగిస్తోంది. ఐఐటీ ఢిల్లీలో ప్రారంభమైన ఈ షుర్వాత్ బస్సు ఐదు నగరాల్లో పర్యటిస్తూ హైదరాబాద్ చేరుకుంది. జీఈఎస్ జరిగే మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ ప్రాంగణంలో మూడు రోజులూ ఈ బస్సు ఉంటుంది. 14 రోజుల పర్యటనలో ఢిల్లీ, అహ్మదాబాద్, పుణే, ముంబై, బెంగళూరు నగరాల్లో పర్యటించి 500 వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను ‘షురువాత్’ బస్సులోని బృందం సేకరించింది. వీటిలో అత్యుత్తమమైన ఆలోచనలకు ఫండింగ్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. జాబ్ క్రియేటర్లుగా మార్చడమే లక్ష్యం.. ‘రోడ్ టు జీఈఎస్’ పేరిట ప్రారంభించిన ఈ యాత్ర.. పలు ప్రధాన విద్యా సంస్థల క్యాంపస్‌లలో పర్యటిస్తూ విద్యార్థులను జాబ్ క్రియేటర్లుగా మార్చడమే లక్ష్యంగా సాగుతోంది. ఉన్నత చదువులు చదివి.. ఉపాధి కోసం ఎదురు చూడకుండా వినూత్న ఆలోచనలతో వ్యాపారాన్ని ప్రారంభించిన పది మందికి ఉపాధి కల్పించేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకే షురువాత్ బస్సును ప్రారంభించారు. 100 సెకన్లలో వివరించాలి.. ప్రజలకు మేలు చేకూర్చే వినూత్న ఆలోచనలతో వచ్చే విద్యార్థులు, యువత తమ ఆలోచనలను 100 సెకన్లలో వివరించాల్సి ఉంటుంది. ‘షురువాత్’ బస్సులో ఉన్న ఐదుగురితో కూడిన కమిటీ ముందు విద్యార్థులు తమ ఆలోచనలను వివరించాలి. ఉర్దూ విశ్వవిద్యాలయం నుంచి 85 మంది తమ ఆలోచనలు వివరించేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి స్టార్టప్.. మహిళల సమస్యలు, వాటి పరిష్కారానికి ‘వాక్ ఫర్ విమెన్’పేరిట స్టార్టప్‌ను నిర్వహిస్తున్నా. ఇంట్లో కూర్చునే తమ సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవడానికి అవసరమైన టెక్నాలజీని వినియోగించడానికి ఈ స్టార్టప్ రూపొందించాం. మహిళా పారిశ్రామికవేత్తగా మరికొంత మంది మహిళలకు ఉపాధి కల్పించాలన్నదే నా ప్రధాన లక్ష్యం. – సాఫియా,వాక్ ఫర్ విమెన్ స్టార్టప్ నిర్వాహకురాలు సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు పుట్టుకతోనే నాకు కళ్లు లేవు. చాలా మంది నీకు చదువెందుకన్నారు. కానీ నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు.. çపట్టుదలతో చదివా, కష్టపడ్డా.. ఆ తర్వాత సరైన తోడ్పాటు దొరకడంతో ముందుకు సాగా.. ప్రస్తుతం రూ.400 కోట్ల పరిశ్రమలను నడుపుతున్నా. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు పొందలేదు. కళ్లు లేవని ఎప్పుడూ బాధపడలేదు. మా సంస్థల్లో 600 మంది ఉపాధి పొందుతున్నారు. అందులో 50 శాతం మంది వికలాంగులే. కష్టపడేతత్వం.. పట్టుదల.. సంకల్పం ఉంటే యువత ఏదైనా సాధించవచ్చు. – శ్రీకాంత్ బొల్లా,బొల్లాంత్ ఇండస్ట్రీస్, వ్యవస్థాపకుడు ‘ఈ–లెర్నింగ్’స్టార్టప్ నిర్వహిస్తున్నా.. ఆన్లైన్ ద్వారా ఈ–లెర్నింగ్ ప్రోగ్రామ్ స్టార్టప్‌ను ప్రారంభించా. ఇప్పటికే ఇందులో 650 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. దీని ద్వారా ఆన్లైన్లో చదువు కోవడానికి అవకాశం ఉంటుంది. కళాశాల విద్యార్థులకు ఈవ్‌టీజింగ్, ఇతర వేధింపులపై అవగాహన కల్పించడానికే ఈ స్టార్టప్ రూపొందించాం. ప్రోత్సాహం లభిస్తే.. నిధులు సమకూరితే అందరికీ చేరువలోకి తీసుకెళతాం. – సయీద్,ఈ–లెర్నింగ్ ప్రోగ్రామ్ స్టార్టప్ నిర్వాహకుడు యువత మైండ్‌సెట్ మార్చడమే లక్ష్యం.. దేశవ్యాప్తంగా యువత మైండ్‌సెట్ మార్చడమే షురువాత్ బస్సు లక్ష్యం.బస్సు యాత్ర ద్వారా అన్ని ఉన్నత విద్యా సంస్థలకు వెళ్లి విద్యార్థులను కలవడం.. వారి నుంచి వినూత్న ఆలోచనలను సేకరించి అందులో మంచి వాటిని ప్రోత్సహించేలా చేస్తాం. ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు, అహ్మదాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నాం. 450 మంది నుంచి వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను సేకరించాం. వాటిని పరిశీలించి ఉత్పత్తి ఆధారిత పరిశ్రమలుగా ప్రోత్సహించేలా నీతిఆయోగ్ దృష్టికి తెస్తాం. – క్షితిజ్శరణ్, ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ఫౌండేషన్ స్పెషల్ ప్రాజెక్ట లీడ్ జనవరిలో.. మలివిడత బస్సుయాత్ర తొలి విడతలో భాగంగా ఆరు నగరాల్లో కొనసాగిన షుర్వాత్ బస్సు యాత్రను ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు వరకు పొడిగించారు. దీంతో మొదటి విడత పర్యటన ముగుస్తుంది. మలివిడత పర్యటనను జనవరి నుంచి ప్రారంభించి భువనేశ్వర్, రాంచీ, కోల్‌కతా, షిల్లాంగ్, గువాహటి, లక్నోతోపాటు మరికొన్ని నగరాల్లో సాగేలా ప్రణాళిక రూపొందించారు. -
కార్పొరేట్ శక్తులకు కేంద్రం దాసోహం
సురవరం ధ్వజం ► 16నుంచి రౌండ్‌టేబుల్ సమావేశాలు.. అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర: చాడ సాక్షి, హైదరాబాద్: కేంద్రం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారి, యథేచ్ఛగా దోచుకునేందుకు అవకాశం కల్పించిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రం అవినీతి తెలంగాణగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సీపీఐ రాష్ట్ర శాఖ మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సదస్సు నిర్వహించింది. అబద్ధాలు ప్రచారం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీని, సీఎం కేసీఆర్ మించిపోతున్నారని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ అంటే రైతులను పట్టించుకోకుండా ఉండటమా.. రోడ్లు దారుణంగా ఉండటమా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల రాష్ట్రం గా ముందుకి వెళుతోందని, అప్పుల తెలం గాణగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని, అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర చేపడతామన్నారు. జీఎస్టీతో చిన్న పరిశ్రమలకు దెబ్బ జీఎస్టీతో చిన్న పరిశ్రమలు దెబ్బ తిన్నాయని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం చేసే యాత్రకు జేఏసీ మద్దతు ఉంటుందని, సామాజిక నాయ్యం కోసం అందరినీ కలుపుకొని పోవాలని, అభివృద్ధి కోసం ప్రజా సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్న పరిశ్రమలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని, నెరెళ్లలో దళితులపై దాడి దారుణమని విమలక్క పేర్కొన్నారు. నేరెళ్ల ఘటనతో ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. 60 ఏళ్ల పోరాట ఫలితాలను సీఎం కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారా యణ ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 17 చోట్ల దళితులపై దాడులు జరిగాయన్నారు. ఎంపీ కవితకు కేంద్రమంత్రి పదవి కోసం సీఎం కేంద్రానికి దాసోహం అయ్యాడని విమర్శించారు. కేసీఆర్ నియంత పాలనపై ఉద్యమాలు చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. -
కమ్యునిస్టుల త్యాగాలు వెలకట్టలేనివి..
వారే తెలంగాణ సాయుధ పోరాటానికి మారుపేరు యోధుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర జరుగుతుంది సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మానుకోటకు చేరిన సీపీఐ బస్సు యాత్ర మహబూబాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే కమ్యూనిస్టులు అని.. వారి త్యాగాలు వెలకట్టలేనివని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. వీరతెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర ఖమ్మం మీదుగా సోమవారం రాత్రి మానుకోకు చేరింది. ఈ యాత్రకు స్థానిక నాయకులు స్వాగతం పలకగా పట్టణంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్థూపాల వద్ద నివాళులర్పించారు. అనంతరం స్థానిక వీరభవన్ ఎదుట పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బి.విజయసారథి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకట్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన కమ్యూనిస్టు యోధుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని.. వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ పోరాట యోధుల పోరాట పటిమను, త్యాగాలను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు మాత్రం సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు. ఈ మేరకు 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ కార్యక్రమాలు చేపట్టామని వెంకట్‌రెడ్డి తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 17న హైదరా ఎగ్జిబిషన్ గౌండ్‌లో జరగనున్న సమావేశంలో నాటి పోరాట యోధులతో పాటు మలివిడత తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంను సన్మానించనున్నామని అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు పద్మ, బి.అజయ్, దాస్యం రామ్మూర్తి, ఫాతిమా, పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, మేక వీరన్న, చింతకుంట్ల వెంకన్న, యాకాంబ్రం, జటంగి శ్రీశైలం, మంద శంకర్, అనిల్ కుమార్, తోట విజయ్, వీరవెల్లి రవి, లింగ్యానాయక్, తోట బిక్షపతి, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతుల కోసం టీజేఏసీ బస్సు యాత్ర
టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతాంగానికి భరోసా కల్పించేందుకు టీజేఏసీ సిద్ధమవుతోంది. కరువుతో ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. ఆ యాత్ర తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. టీజేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన బుధవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. జేఏసీ వర్గాల ప్రకారం.. ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఈనెల 10న ట్రాన్స్‌కో అధికా రులు జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహ రించుకోవాలని తీర్మానించారు. ట్రాన్స్‌కో ఉద్యోగులెవరూ సంస్థ విషయాలపై బహిరంగంగా మాట్లాడొద్దని, మీడియాకు సమాచారం ఇవ్వొద్దని, కార్యాలయాల్లోకి మీడియాను అనుమతించవద్దంటూ జారీ చేసిన ఈ సర్క్యులర్ రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధమని టీ జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. ఛత్తీస్గడ్ విద్యుత్ ఒప్పందంపైనా పూర్తిస్థాయి చర్చ జరగాలనే అంశంపై, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యుత్ జేఏసీ నేత రఘు బదిలీపైనా చర్చించారు. ఒక వ్యక్తికోసం జేఏసీ పోరాడ డమని కాదుగానీ, తెలంగాణ కోసం ఉద్యమించిన నేతగా, ఉద్యోగ సంఘాలు ఆయన బదిలీపై స్పందిస్తే మద్దతుగా ఉండాలన్న అభిప్రాయానికి వచ్చారు. భేటీలో జేఏసీ కో-ఆర్డినేటర్ పిట్టల రవీందర్, నేతలు రాజేందర్‌రెడ్డి, ప్రహ్లాద్, విజేందర్‌రెడ్డి, మమత తదితరులు పాల్గొన్నారు. -
జగన్ బస్సు యాత్ర సక్సెస్
భారీగా తరలివచ్చిన బానకచర్ల, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ఆయకట్టు రైతులు కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఏపీ శాసనసభలో విపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చేపట్టిన ప్రాజెక్టుల బస్సు యాత్రకు శుక్రవారం కర్నూలులో విశేష స్పందన లభించింది. జిల్లాలోని బానకచర్ల, పోతిరెడ్డిపాడు వద్దకు పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. రాయలసీమలో మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణ పనులు, సాగునీటి సాధన కోసం విపక్ష నేత హోదాలో జగన్ జరిపే పోరాటానికి మద్దతుగా నిలిచి సంఘటితంగా ఉద్యమిస్తామని రైతులు ఉద్ఘాటించారు. గత 3 రోజులుగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో సాగిన ఈ యాత్ర శుక్రవారం రాత్రి 10 గంటలకు హంద్రీనీవా దగ్గర విజయవంతంగా ముగిసింది. మూడో రోజు ఇలా.. యాత్రలో మూడో రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పెదదోర్నాల నుంచి బయలుదేరారు. నల్లగుంట్ల గ్రామంలో వయోవృద్ధుడు అనంతయ్య, యువతి వెంకటమ్మలతో సంభాషించిన జగన్.. గ్రామంలోని వసతులు, వారికి అందుతున్న పింఛన్లపై ప్రశ్నించారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధాపురం చేరుకుని అక్కడి చెరువును పరిశీలించి మహిళలతో మాట్లాడారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆత్మకూరు చేరుకుని మండుటెండలో సైతం తనకోసం ఎదురు చూస్తున్న వందల మంది ముస్లిం పెద్దల కోరిక మేరకు బస్సు దిగి అక్కడే ఉన్న దివంగత వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. బానకచర్లలో ఇరిగేషన్ ఇంజినీర్లతో.. మధ్యాహ్నం 3 గంటలకు బానకచర్ల క్రస్ట్గేట్లున్న ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న తెలుగు గంగ లింక్ చానల్, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్లను పరిశీలించారు. రిటైర్డ్ ఈఎన్సీ ప్రభాకరరావు, ప్రస్తుత డీఈఈ శివరామకృష్ణలతో జగన్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తనతో పాటున్న 40 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు రాయలసీమ ప్రాజెక్టుల గురించి వివరించారు. ప్రాజెక్టు స్థలంలో ఏర్పాటు చేసిన రచ్చబండ సభలో జగన్.. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వేంపెంటకు పార్టీ అండ.. ర్యాంక్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల వల్ల తాము తీవ్ర భయాందోళనలకు గురవుతున్నామని, నిర్మాణాన్ని వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ వేంపెంట గ్రామానికి చెందిన 200 మంది రైతులు, మహిళలు బానకచర్ల దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరి దగ్గరకెళ్లిన జగన్.. ప్రాజెక్టు వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జాగృత యాత్ర..: రాత్రి 8.40 గంటలకు నందికొట్కూరు మండలం మల్యాల పరిధిలోని హంద్రీనీవా ప్రాజెక్టు ప్రాంతాన్ని జగన్ సందర్శించారు. అక్కడే వేచి ఉన్న రైతులతో మాట్లాడారు. కోస్తా, రాయలసీమల్లో సాగిన జగన్ ప్రాజెక్టుల యాత్ర అటు ఎమ్మెల్యేలు, ఇటు రైతులను చైతన్యపరిచే జాగృత యాత్రగా ముగిసింది. పార్టీ శాసనసభ్యులతో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న మైసూరా ప్రసంగం బానకచర్ల ప్రాజెక్టు వద్ద మాజీ ఎంపీ, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. సామెతలు, పిట్టకథలతో సాగిన ఆయన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. వైఎస్ జగన్ తన తండ్రి దివంగత నేత వైఎస్ఆర్ పేరు ప్రస్తావించిన ప్రతిసారీ పార్టీ అభిమానులు, రైతులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. -
పోటెత్తిన గోదారి గట్టు
ఊరూరా వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన ప్రజలు 10 గంటలు సాగిన తొలిరోజు బస్సు యాత్ర 60 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతల హాజరు పట్టిసీమ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘పట్టిసీమ వద్దు.. పోలవరం ముద్దు..’ అంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సుయాత్ర తొలిరోజు విజయవంతమైంది. గోదారి గట్టు వెంబడి సాగిన యాత్రకు స్థానికులు పోటెత్తారు. యాత్ర తొలిరోజు.. బుధవారం ఉదయం 10 గంటలకు రాజ మండ్రి విమానాశ్రయం నుంచి మొదలైన బస్సుయాత్ర రాత్రి 8 గంటల సమయంలో పట్టిసీమ వద్ద ముగిసింది. రాజమండ్రి విమానాశ్రయంలో 10 గంటలకు దిగిన విపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి 3 బస్సుల్లో 10.30 గంటలకు యాత్ర మొదలైంది. దాదాపు 50 నిమిషాల తర్వాత ధవళేశ్వరానికి చేరి, అక్కడ సర్ ఆర్థర్ కాటన్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాటన్ బ్యారేజీని సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు రిటైర్డ్ ఎస్ఈ ఎస్.నాగేశ్వరరావు నేతృత్వంలో కొంత మంది రిటైర్డ్ ఇంజనీర్ల బృందం అక్కడ జగన్‌ను కలిసింది. ‘పట్టిసీమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. ప్రజలపక్షాన నిలబడి పోరాటం చేయకపోతే గోదావరి జిల్లాలు ఎడారిగా మారతాయి. పట్టిసీమ లిఫ్ట్ కోసం రూ.1300 కోట్లు, 21.9 శాతం అదనపు చెల్లింపులు కలిపి.. దాదాపు రూ.1600 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమను నిర్మించి గోదావరి జిల్లాల రైతుల పొట్టగొట్టడం కంటే, పోలవరం మీద శ్రద్ధ పెట్టి వేగంగా పూర్తి చేస్తే రాష్ట్రమంతా సశ్యశ్యామలం అవుతుంది’ అని జగన్‌కు వారు వివరించారు. ఉదయం 12.10 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి బయలుదేరిన కాసేపటికి బొబ్బర్లంక గ్రామంలో యువత యాత్రకు ఘన స్వాగతం పలికారు. అక్కవ యువతను పలకరించిన జగన్.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి యాత్ర కొనసాగించారు. తూర్పు నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన సందర్భం లోనూ ప్రజలు రోడ్డుపై నిలబడి యాత్రకు స్వాగతం పలి కారు. అక్కడ నుంచి గోదావరి గట్టు వెంబడి యాత్ర సాగుతున్న కొద్దీ.. ఊరూరా ప్రజలు రోడ్డుపై నిలబడి జగన్‌కు ఘనంగా స్వాగతం చెప్పారు. మహిళలు, రైతులు వచ్చి జగన్‌కు వినతిపత్రాలిచ్చారు. దారిపొడవుగా ప్రజలకు అభివాదం చేస్తూ, పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ జగన్ బస్సుయాత్రను కొనసాగించారు. 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న పోలవరం చేరుకోడానికి మూడున్నర గంటల కుపైగా సమయం పట్టింది. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో యాత్ర పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరాక, అక్కడ అధికారులతో జగన్ మాట్లాడారు. ఎప్పటికి పూర్తయ్యేను?: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత పని జరిగిందని సంబంధిత అధికారులను జగన్ ప్రశ్నించారు. దీనికి అధికారులు రూ.100 కోట్ల పని జరిగినట్టు చెప్పారు. దివంగత వైఎస్, తర్వాత ప్రభుత్వాలు దాదాపు రూ.4,500 కోట్లు ఖర్చు చేయగా, ఇంకా రూ.12 వేల కోట్ల వ్యయం చేసే పనులు మిగిలి ఉన్నాయని, ఏటా రూ.100 కోట్ల చొప్పున పనులు చేస్తే ఎంత కాలానికి పనులు పూర్తవుతాయి? అని జగన్ ప్రశ్నించినప్పుడు.. అధికారులు నీళ్లు నమిలారు. పోలవరం ప్రాజెక్టు కోసం 1,200 ఎకరాలు సేకరించడానికి 11 నెలల సమయం ప్రభుత్వానికి సరిపోలేదని, కానీ.. పట్టిసీమ లిఫ్ట్‌కు అవసరమైన 250 ఎకరాల రైతులను మాత్రం ఒప్పించడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్న తీరును జగన్ తప్పుబట్టారు. పోలవరం పనులు దాదాపు నిలిచిపోయాయని, వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర ఉందనే నేపథ్యంలో మంగళవారం నుంచి మళ్లీ కొద్దిగా పనులు మొదలుపెట్టారని స్థానిక రైతులు జగన్ దృష్టికి తెచ్చారు. గోదావరి నదిలో కనీసం ఒక్కశాతం పనులు జరినట్టుగా కూడా ఆనవాళ్లు కనిపించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. రైతుల ఆమోదం సరిపోతుందా..: పట్టిసీమ లిఫ్ట్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని జగన్ పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడారు. లిఫ్ట్‌కు అవసరమైన పైపులైన్లకోసం భూములను తీసుకునేందుకు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తున్న విషయం నిజమేనా? అని ప్రశ్నించినప్పుడు.. కాదని వారు జవాబిచ్చారు. మరి రైతులకు పరిహా రం చెల్లించకుండా పనులు ఎలా మొదలుపెట్టారని జగన్ అడిగినప్పుడు.. రైతుల ఆమోదం తీసుకున్నామన్నారు. పరిహారం చెల్లించకుండా రైతుల ఆమోదం సరిపోతుందా? అని జగన్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పంపుల ఫుట్‌వాల్వ్ లెవల్‌ను అడిగినప్పుడు.. 11 మీటర్ల వద్ద ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాటన్ బ్యారేజీ జలాశయం నీటిమట్టం 13.6 మీటర్లు ఉన్నప్పుడు, పంపుల ఫుట్‌వాల్వ్ లను 11మీటర్ల వద్ద ఏర్పాటు చేసి జలాశయంలో నీళ్లనూ తోడేస్తారా? అని అడగ్గా.. వారి నుంచి జవాబు కరువైంది. రైతులతో ముఖాముఖి: సాయంత్రం 6.30 గంటలకు పట్టిసీమ వద్ద రైతులతో జగన్ ముఖాముఖి మాట్లాడారు. పట్టిసీమ లిఫ్ట్‌తో గోదావరి జిల్లాలు బీడుబారిపోతాయని, తమ పొట్టగొట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని.. రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం.. తొలిరోజు యాత్ర ముగించుకొని విజయవాడ వైపు బస్సులు బయలుదేరాయి. -
ప్రాజెక్టుల పరిశీలనకు వైఎస్సార్సీపీ బస్సు యాత్ర
15, 16, 17 తేదీల్లో యాత్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాల్గొననున్న వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రపరిశీలన చేసి అక్కడి రైతులతో ముఖాముఖిగా మాట్లాడేందుకు ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమ పార్టీ బస్సు యాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలసి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ బస్సు యాత్రలో పాల్గొంటారని చెప్పారు. 15వ తేదీ ఉదయం రాజమండ్రిలో యాత్ర ప్రారంభించి.. ధవళేశ్వరం, పోలవరం కాలువలు, పట్టిసీమ ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ, వెలుగొండ, బనకచర్ల క్రాస్, పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా హెడ్‌రెగ్యులేటర్ వరకూ మూడు రోజుల పాటు యాత్ర కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కోస్తా, రాయలసీమల్లో ప్రతిపాదిత ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని కోరుకుంటున్నామని, అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధిని తమ పార్టీ కాంక్షిస్తోందని చెప్పారు. దానిగురించే ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పోలవరాన్ని ఎందుకు అటకెక్కిస్తున్నారు? అన్ని అనుమతులూ లభించడంతో పాటు ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తరుణంలో బృహత్తరమైన పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పోలవరాన్ని విభజన చట్టంలో పేర్కొన్నారని, అయినా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇపుడున్న ప్రాజెక్టులపై ప్రతి ఏటా రూ. 2,000 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల వరకూ ఖర్చు చేసి రెండు మూడేళ్లలో వాటిని పూర్తి చేయాలని తమ పార్టీ కోరుతోందన్నారు. కానీ బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఆశాజనకంగా లేవని.. టీడీపీ నేతలు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోందని విమర్శించారు. రాయలసీమకు నీళ్లిస్తామని చెబుతున్న వారు హంద్రీ-నీవా, గాలేరు-నగరికి పూర్తిస్థాయిలో నిధులెందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. రాయలసీమలోని 7,000 చెరువులకు నీళ్లు ఇవ్వగలిగామని టీడీపీ మంత్రి ఒకరు సంతోషంగా చెప్పారని, అయితే అందుకు కారణమైన మహనీయుడు ఎవరనే విషయం చెప్పలేదని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులనే మొక్కలు నాటి పెంచి పోషించిన వ్యక్తి పేరును చెట్టు ఫలాలు తింటున్నపుడైనా స్మరించుకోవాలనే కనీస విజ్ఞత వారికి లేకుండా పోయిందన్నారు. పదేళ్ల క్రితం ఎవరు కృషి చేస్తే.. ఇప్పుడు చెరువులకు నీళ్లివ్వగలిగారో చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు ఈ స్థాయిలో ఉన్నాయంటే అందుకు కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. పులిచింతల, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, పట్టిసీమ కాలువలు.. ఇలా ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా వాటి ని తీర్చిదిద్దిన ఘనత వైఎస్‌దేనని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు చేయకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని అప్పట్లో వైఎస్ ఆలోచించారని ఆయన అన్నారు. -
ఇదేం తీరు..?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రైతు సమస్యల పేరుతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేపట్టిన బస్సు యాత్రపై రైతుల నుంచి స్పందన మాట దేవుడెరుగు, ఆ పార్టీ నేతల్లోని అంతర్గత కలహాలు, అసంతృప్తులను మాత్రం మరింత రగిల్చేస్తోంది. వరుస ఎన్నికల్లో చావు దెబ్బతిని జిల్లాలో దాదాపు కనుమరుగైన ఆ పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఒకరిద్దరు ముఖ్య నేతల ఒంటెద్దుపోకడల కారణంగా ఉన్న నాయకులూ వలసబాట పట్టే పరిస్థితి దాపురించిందనే అభిప్రాయం ఆ పార్టీ ముఖ్య నేతల్లోనే వ్యక్తమవుతోంది. కనీసం జిల్లా అధ్యక్షుడితో కూడా చర్చించకుండానే ఈ బస్సు యాత్రను ప్రకటించడం ఏంటని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు, ముఖ్య నాయకులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ కోతలు, రుణ మాఫీ విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు టీటీడీపీ పలు జిల్లాల్లో ఈ బస్సు యాత్ర చేపట్టింది. ఆదివారం ఈ యాత్ర జిల్లాలో ప్రవేశించనుంది. కరీంనగర్ జిల్లా నుంచి తూర్పు జిల్లా పరిధిలోని లక్సెట్టిపేట మీదుగా కొనసాగి.. ఉట్నూర్‌లో ధర్నా చేపట్టనున్నారు. ఈ యాత్ర ఎలా నిర్వహించాలనే అంశంపై ముందస్తు సమావేశాలేవీ జరిగిన దాఖలాల్లేవు. కనీసం ఈ విషయంలో ఆ పార్టీ తూర్పు జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్రావుతో గానీ, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో గానీ ముందుగా చర్చించలేదని, వారి అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోలేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల తర్వాత నాలుగు నెలలుగా పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. మొదటిసారిగా రైతు సమస్యలపై నిర్వహిస్తున్న ఈ యాత్ర నిర్వహణ తీరు ఇలా ఉండటం ఆ పార్టీలోని అసంతృప్తులను మరింత రగిలేలా చేస్తోంది. ‘పార్టీలో ఉన్నాం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో యాత్రలో పాల్గొనాల్సి వస్తోంది. ఈ యాత్రలో పాల్గొనకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతోనే ఈ యాత్రలో పాల్గొనాల్సి వస్తోంది’ అని ఆ పార్టీ ఓ నియోజకవర్గ ఇన్చార్జి పేర్కొన్నారు. మరోవైపు ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒకరిద్దరు మినహా దాదాపు పార్టీకి దూరమయ్యారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పాటి సుభద్ర, నిర్మల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాబర్ వంటి నేతలు ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ శ్రేణులు టీటీడీపీ బస్సు యాత్ర ప్రకటించిన వెంటనే అధికార టీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. విద్యుత్ సంక్షోభానికి గత ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో విద్యుత్ కోసం బషీర్‌బాగ్‌లో నిరసన కార్యక్రమాలు చేపడితే తూటాల వర్షం కురిపించి పలువురు రైతుల ప్రాణాలను బలిగొన్న ఘనత చంద్రబాబుది కాదా? ఆని టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి విమర్శించారు. ఈ యాత్రను ప్రజలే తగిన విధంగా స్పందిస్తారని, అడ్డుకుంటారని ఆయన తెలిపారు. టీటీడీపీ నుంచి నేతల వలసలకు అడ్డుకట్ట వేసే జిమ్మిక్కుల్లో భాగమే ఈ బస్సు యాత్ర తప్ప, రైతులపై మమకారంతో కాదని ఆయన విమర్శించారు. -
టీడీపీ బస్సుయాత్రకు పంక్చర్ !
కారెక్కుతున్న చల్లా ధర్మారెడ్డి స్వయంగా ప్రకటించిన పరకాల ఎమ్మెల్యే నేడు జిల్లాలో టీడీపీ బస్సు యాత్ర అయోమయంలో ‘తమ్ముళ్లు’ పరకాల టీఆర్ఎస్లో పెరిగిన నేతలు సాక్షిప్రతినిధి, వరంగల్ : కరెంట్ సరఫరా విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన బస్సు యాత్ర శనివారం జిల్లాలో జరగనుంది. బస్సు యాత్రకు సరిగ్గా ఒక్క రోజు ముందే టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. టీఆర్ఎస్ ఆకర్ష్‌తో టీడీపీకి మరో భారీ దెబ్బ పడింది. మంచి రోజు చూసుకుని త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు టీడీపీకి చెందిన పరకాల ఎమ్మెల్యే శుక్రవారం స్వయంగా ప్రకటించారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రకు ధర్మారెడ్డి ప్రకటన ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీ మారుతుండడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. ధర్మారెడ్డి వెంట ఎంత మంది వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంత జిల్లాలోనే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు కారెక్కుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం టీఆర్ఎస్లో చేరుతారని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. దీన్ని ఆయన స్పష్టంగా ఖండించారు. ఈ ప్రచారాన్ని తగ్గించేందుకు ఇటీవల ముఖ్యమంత్రి పైనా, ప్రభుత్వంపైనా విమర్శలను పెంచారు. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ని అనువుగా మార్చుకునేందుకు ఎమ్మెల్యేలతో బస్సు యాత్ర మొదలుపెట్టారు. శుక్రవారం నల్లగొండలో మొదలైన బస్సు యాత్ర శనివా రం మన జిల్లాకు చేరనుంది. టీడీపీ చెందిన ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు ఈ యాత్ర లో పాల్గొననున్నారు. సాధారణ ఎన్నికల తర్వాత టీడీపీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ఈ బస్సు యాత్రే. ధర్మారెడ్డి మొదటి నుంచి దయాకర్‌రావుకు సన్నిహితుడు. కీలకమైన బస్సుయాత్ర సమయంలోనే ధర్మారెడ్డి... టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, కేసీఆర్ ప్రణాళి కలు బాగున్నాయని ప్రశంసించడం టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ధర్మారెడ్డి రాజ కీయప్రకటన బస్సుయాత్ర ప్రాధాన్యాన్ని తగ్గిం చేదిగా ఉందని టీడీపీ నేతలు వాపోతున్నారు. పరకాలలో నాలుగు స్తంభాలాట... చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ చేరడం ఖాయమైన నేపథ్యంలో అక్కడి రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పరంగా ఇప్పటికే మూడు వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే ధర్మారెడ్డి అదే పార్టీలో చేరడంతో గులాబీ రాజకీయం మరింత జోరుగా సాగే అవకాశం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ముద్దసాని సహోదర్‌రెడ్డిపై చల్లా ధర్మారెడ్డి గెలిచారు. ప్రస్తుతం పరకాల టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ తానేనని సహోదర్‌రెడ్డి చెబుతున్నారు. చల్లా ధర్మారెడ్డి చేరిక తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనే ఇన్‌చార్జ్‌అయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పుడు సహోదర్‌రెడ్డి, ధర్మారెడ్డి ఎలా ఉంటారో వేచి చూడాల్సి ఉంది. 2009 ఎన్నికల వరకు పరకాల ఎమ్మెల్యేగా ఉన్న మొలుగూరి బిక్షపతికి నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. పరకాల సెగ్మెంట్లో సుదీర్ఘకాలం ఆధిపత్యం ఉన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుకు ప్రతి గ్రామంలో కేడర్ ఉంది. ఇప్పుడు ఈ నలుగురు నేతలకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు, అనుచరులు క్షేత్ర స్థాయిలో ఎలా సర్దుకుంటారో త్వరలోనే తేలనుంది. కేసీఆర్ మాటే ఫైనల్ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీని బలోపేతం చేయడం కోసం కేసీఆర్ అందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇతరల పార్టీల నుంచి వచ్చే వారితో మరింత బలం పెరుగుతుంది. మా పార్టీలోకి ఎవరు వచ్చినా... అభ్యంతరం లేదు. కేసీఆర్ ఏది చెప్పినా మాకు ఓకే. ఆయన మాటనే మాకు ఫైనల్. - మొలుగూరి బిక్షపతి, మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం టీఆర్ఎస్ను బలోపేతం చేయడం కోసం కేసీఆ ర్ అందరిని కలుపుకుని పోతున్నారు. ముఖ్యం గా టీడీపీని నిర్మూలించడం కోసం కేసీఆర్ చేస్తు న్న చర్యలను స్వాగతిస్తున్నాం. 2001 నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించాలి. త్వరలో చేరబోయే ఎమ్మెల్యే టీఆర్ఎస్ బలోపేతం కోసం పనిచేసి న నాయకులకు ప్రాధాన్యమివ్వాలి. - ముద్దసాని సహోదర్‌రెడ్డి -
బస్సు యాత్ర
దయనీయంగా కాంగ్రెస్ పరిస్థితి పూర్వ వైభవం కోసం నాయకుల తంటాలు కనుచూపు మేరలో కానరాని నాయకత్వం, క్యాడర్ అధికారం అనుభవించి సైకిలెక్కేశారు మాజీ సీఎం కిరణ్ సొంత కుంపటి తిరుపతిలో చిరంజీవికి హ్యాండిచ్చిన అనుచరవర్గం సాక్షి, చిత్తూరు: పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించాలని నూతన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చిత్తూరు జిల్లాలో కొంచెం కూడా ఫలించేలా కనిపించడం లేదు. ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాలో నిర్వహించనున్న బస్సుయాత్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు ఇవ్వడం కష్టమే. నూతన పీసీసీ సారథి రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి, మరికొందరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి చిత్తూరు జిల్లాలో 25వ తేదీన బస్సుయాత్ర ప్రారంభం కానున్నది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్గ్రౌండ్స్లో ఎన్నికల బహిరంగసభ నిర్వహించనున్నారు. తరువాత రోజు కూడా జిల్లాలో బస్సుయాత్ర సాగుతుంది. దయనీయంగా కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ బస్సుయాత్రకు అవసరమైన ఖర్చులు కూడా జిల్లా నాయకత్వం పెట్టుకునే పరిస్థితి లేదు. డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి నిన్న మొన్నటి వరకు ఒక మండల నాయకుడిగా మాత్రమే ఉన్నారు. ఇప్పుడు జిల్లా రాజకీయూలపై పట్టు సాధించడం అంత సులభం కాదు. అదే సమయంలో తిరుపతి ఎంపీ చింతామోహన్ ఒక్కడే కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా మిగి లారు. ప్రస్తుతం ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌కు ప్రధాన నాయకత్వం లేదు. నిన్నమొన్నటి వరకు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత కుంపటి పెట్టుకున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒకరకంగా షాకే. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా చివరి వరకు మంత్రి పదవి అనుభవించారు. నాలుగుసార్లు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి కొద్దిరోజుల క్రితమే తెలుగుదేశం పార్టీలో చేరారు. దీనికి తోడు ఇప్పటి వరకు తుడా చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్న వెంకటరమణ పదవిలో ఉంటూనే తెలుగుదేశం జెండా భుజానికి ఎత్తుకున్నారు. జీడీనెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ ఇదే బాటలో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో రవి, షాజహాన్ బాషా కూడా కాంగ్రెస్‌ను వదిలేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రధాన నాయకత్వం కొరవడటంతో పరిస్థితి దారుణంగా మారింది. 14 నియోజకవర్గాల్లో చరిష్మా ఉన్న నాయకులు కాంగ్రెస్‌లో లేరు. తిరుపతిలో చిరంజీవికి దిక్కులేదు సామాజికవర్గం దయతో చిరంజీవి తిరుపతిలో ఎమ్మెల్యే అయ్యారు. అదే సామాజికవర్గం ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్‌గా చిరంజీవి తిరుపతికి వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. తిరుపతిలోని పూర్వపు పీఆర్పీ నాయకులు అందరూ చిరంజీవి వెంట కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు ఆయన మంత్రి పదవి అనుభవిస్తూ తమను గాలికి వదిలేశాడని, ఆయన దారి ఆయన చూసుకున్నాడన్న కోపంతో ఆయనకు షాకిచ్చారు. ఒకప్పుడు చిరంజీవికి సన్నిహితంగా ఉన్న సైకం జయచంద్రారెడ్డి కాంగ్రెస్‌ను వదలి టీడీపీ నీడన చేరారు. తిరుపతి నియోజకవర్గం పీఆర్పీ నాయకులుగా, చురుకుగా ఉంటూ చిరంజీవి వెంట నడిచిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఊకా విజయకుమార్ తదితర పూర్వపు పీఆర్పీ నాయకులు అందరూ ఇప్పుడు చంద్రబాబు పంచన చేరారు. దీంతో చిరంజీవి అనుచరవర్గమంతా తుడిచి పెట్టుకుపోయినట్టయింది. రెండో శ్రేణితో నెట్టుకొచ్చే యత్నం రెండో శ్రేణిలో ఉన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను బతిమాలి, భవిష్యత్‌లో పదవులు ఇస్తామని ఆశలు చూపుతూ వారిని సమావేశాలకు రప్పించుకుంటున్నారు. నేరుగా అధినాయకులే జిల్లాకు వస్తున్నారు. ‘మీరు ఏం చెబితే అదే చేస్తాం... టిక్కెట్ల విషయంలోనూ మీ సలహాలు తీసుకుంటాం’ అంటూ చోటా నాయకులకు చెబుతూ వారు ‘చేయి’ జారిపోకుండా తంటాలు పడుతున్నారు. -
చిరంజీవి ప్రసంగానికీ కానరాని స్పందన
చిరంజీవి ప్రసంగానికీకానరాని స్పందన ఆరంభంలో జోష్..ఆ తర్వాత నీరసం! సాక్షి, విశాఖపట్నం, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిరథ మహారథులతో బస్సు యాత్రన్నారు. వెండితెర నేలిన మెగాస్టార్ చిరంజీవి ప్రచార సారథ్య బాధ్యతలు చేపట్టడంతో ఆశలు పెంచుకున్నారు. భారీ బహిరంగ సభ.. ర్యాలీలుగా జనం.. ప్రకటనలు భారీగానే గుప్పించారు. శ్రీకాకుళం సభకు వచ్చిన స్పందనతో జాగ్రత్తపడ్డారు. బహిరంగ సభను కాస్తా.. కార్యకర్తల సమావేశంగా మార్చేశారు. అది కూడా నిర్ణీత సమయానికి ప్రారంభం కాకపోవడంతో.. చిరంజీవి మాట్లాడక ముందే తీసుకొచ్చిన జనాలు తిరుగు ముఖంపట్టారు. దీంతో దిగాలుపడటం నేతల వంతయింది. ఆరంభంలో జనాలు ఫుల్! ఉదయం 10 గంటలకు కార్యకర్తల సమావేశం ప్రారంభమవుతుందని ముందుగా ప్రకటించారు. సభా వేదిక ముందు సుమారు 2,500 కుర్చీలు వేశారు. అయితే ప్రధాన నేతలు వచ్చేసరికి 11.15 గంటలయింది. అప్పటికిగానీ సమావేశం ప్రారంభంకాలేదు. ఆ సమయంలో కుర్చీలు పూర్తిగా నిండిపోయాయి. ప్రధాన నేతల బస్సుతోపాటు వచ్చిన వారితో కాసేపు సభా ప్రాంగణం కిటకిటలాడింది. కూర్చునేందుక్కూడా వీల్లేని పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షుడు బెహరా భాస్కరరావు నేతృత్వంలో బాగానే జన సమీకరణ చేశారు. అయితే నేతల ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపేశారు. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి జనాలు తిరుగుముఖం పట్టడం మొదలయింది. ఆనం రామనారాయణరెడ్డి ప్రసంగించే సమయంలో మొదలైన ఈ ధోరణి రఘువీరారెడ్డి ప్రసంగించేసరికి మరింత పెరిగింది. చిరంజీవిని చూడాలి, ఆయనతో కరచాలనం చేయాలనుకునేవారంతా ముందు నుంచీ సభా వేదిక ముందే పడిగాపులు కాశారు. వీరు మాత్రమే చివరి వరకు మిగిలారు. వెనుక కుర్చీలన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. దీంతో చిరంజీవి కూడా మీడియాకు చేతులు జోడిస్తూ.. వెనుక కుర్చీలు ఖాళీగా ఉన్నాయని.. ప్రచారం చేయకండి.. అంతా ముందుకు రావడం వల్లే ఖాళీ అయిందంటూ వివరణిచ్చుకున్నారు. ఆ నేతల్ని ఎండగట్టారు కాంగ్రెస్, పీఆర్పీ గుర్తుపై గత ఎన్నికల్లో గెలిచి, ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి కాంగ్రెస్‌ను కష్టాల్లోకి నెట్టి వెళ్లిపోయిన నేతల తీరును రఘువీరారెడ్డి, చిరంజీవి తీవ్రంగా ఎండగట్టారు. వారిని విశ్వాసఘాతకులుగా, కృతఘు్నలుగా అభివర్ణించారు. స్థానిక ఎన్నికల నామినేషన్లకు ముందు నేతలు పార్టీని వీడటం వల్లే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు పడలేదని రఘువీరారెడ్డి అన్నారు. ఇలాంటి విశ్వాసఘాతకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ జోస్యం చెప్పారు. చిరంజీవైతే.. బాహాటంగానే తన బాధను వ్యక్తపరిచారు. పీఆర్పీకి రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా విశాఖలో 32-33 శాతం ఓట్లేసి, నలుగురిని గెలిపించారని, మీరిచ్చిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నుంచి.. ఈ చిరంజీవి నుంచి నిష్ర్కమించడం కొంచెం బాధాకరమనిపించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ పురందేశ్వరినైతే కృతఘు్నరాలిగా పేర్కొన్నారు. 127 ఏళ్ల కాంగ్రెస్ ఎప్పటికప్పుడు యువరక్తం ఎక్కించుకుంటూ నూతనోత్సాహంతో ముందుకెళ్తూనే ఉంటుందంటూ.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, మాజీ మంత్రులు పసుపులేటి బాలరాజు, ఆనం రామనారాయణరెడ్డి, సి.రామచంద్రయ్య, పార్టీ నగర అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు సతీష్‌వర్మ, నగర మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, మాజీ మేయర్ పులుసు జనార్దనరావు, మాజీ కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు