
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17 నుంచి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చేపట్టనున్న నాలుగో విడత బస్సు యాత్రలో ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆయన రాష్ట్ర పర్యటన దాదాపు ఖరారైందని పేర్కొన్నాయి. రాష్ట్రంలో రాహుల్ పర్యటన ద్వారా 2019 ఎన్నికలకు సమరశంఖం పూరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. జూన్ 1 నాటికే బస్సు యాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్ లేదా వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభకు రాహుల్‌ను టీపీసీసీ ఆహ్వానించాల్సి ఉంది.
అనివార్య కారణాల వల్ల బస్సు యాత్ర షెడ్యూల్‌లో జాప్యం జరిగింది. దీంతో బహిరంగ సభ కూడా రద్దయింది. నాలుగో విడత బస్సు యాత్రకు రాహుల్‌ను ఆహ్వానించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చేత ప్రజలకు సందేశం ఇప్పించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ భావించారు. గత నెల ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ పెద్దలను కలసి రాహుల్ పర్యటన ఖరారు చేయాలని కోరా రు. దీనికి రాహుల్ కూడా సానుకూలంగా స్పందించారని, అమెరికా నుంచి రాగానే రాష్ట్ర పర్యటన తేదీలను ఖరారు చేస్తారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.
ఈ నెల చివరి వారంలో రాహు ల్ హైదరాబాద్ పర్యటన ఉంటుందన్నారు. ఆ సమయానికల్లా బస్సు యాత్ర రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వరకు వస్తుందని, అప్పుడు యాత్రలో రాహుల్ పాల్గొనేలా చేయాలని టీపీసీసీ నేతలు యోచిస్తున్నారు. రెండురోజులపాటు ఆయన సమయం ఇచ్చే అవకాశం ఉన్నందున రాహుల్ పర్యటన షెడ్యూల్ తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా టీపీసీసీ కమిటీల విషయంలో కసరత్తు జరుగుతోందని, నేడో, రేపో ఈ కమిటీలకు సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని మంగళవారం ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవం కాదని టీపీసీసీ నేతలు వెల్లడించారు.