15 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర!  | Sakshi
Sakshi News home page

15 నుంచి కాంగ్రెస్‌ బస్సుయాత్ర! 

Published Sat, Oct 7 2023 3:34 AM

Congress bus trip from 15 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లోని సీనియర్‌ నేతలు నిర్వహించ తలపెట్టిన బస్సుయాత్రను ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు తెలిసింది. ఈ నెల 14 తర్వాత ఏ క్షణమైనా కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా వెలువడుతుందన్న అంచనాల నేపథ్యంలో టీపీసీసీ నేతలు దీనిపై సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

బస్సు యాత్రను ప్రారంభించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రానున్నారని.. యాత్ర జరుగుతున్న సమయంలో రాహుల్‌గాందీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యేలా షెడ్యూల్‌ రూపొందుతోందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 9న లేదా 10న జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో షెడ్యూల్, రూట్‌ మ్యాప్‌ను ఖరారు చేయనున్నట్టు వివరిస్తున్నాయి. 

టికెట్లు ఎప్పుడు?.. సమావేశాలు ఎన్నడు? 
ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశం హాట్‌టాపిక్‌గా నడుస్తోంది. రెండు దఫాలు స్క్రీనింగ్‌ కమిటీ సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో.. అదిగో జాబితా, ఇదిగో జాబితా అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే టికెట్ల ప్రకటన ఈనెల 14వ తేదీ తర్వాతే ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి అక్టోబర్‌ మొదటి వారంలోనే తొలిజాబితా విడుదల చేసేలా కాంగ్రెస్‌ పెద్దలు కసరత్తు చేశారు.

కానీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశాలు ఇంకా జరగాల్సి ఉండడం, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరగకపోవడంతోపాటు పితృపక్షాల కారణంగా మంచి రోజులు లేవనే ఉద్దేశంతో అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసినట్టు సమాచారం. ఈ నెల 14న అమావాస్య    ఉండటంతో ఆ తర్వాత తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా ఉంటుందని టీపీసీసీ కీలక నేత ఒకరు వెల్లడించారు. ఇందుకోసం ఈనెల 8న స్క్రీనింగ్‌ కమిటీ భేటీ అవుతుందని, తర్వాత 10న సీఈసీ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.

మరోవైపు స్క్రీనింగ్‌ కమిటీ ఒక్కోపేరు పంపిన నియోజకవర్గాలకే తొలుత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిసింది. రెండు, మూడుపేర్లు పంపిన సెగ్మెంట్లకు సంబంధించి ఒక్కో పేరును ఫైనల్‌ చేసేందుకు సీఈసీ కొన్ని మార్గదర్శకాలు ఇస్తుందని, ఆ మార్గదర్శకాల మేరకు మళ్లీ స్క్రీనింగ్‌ కమిటీనే ఒక్కో పేరు సూచించాల్సి వస్తుందనే చర్చ ఏఐసీసీ వర్గాల్లో జరుగుతోంది. 

పెద్ద నేతల పర్యటనలపై చర్చ 
శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి చేరిక సందర్భంగా ఢిల్లీలో ఖర్గే, వేణుగోపాల్‌లతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు తెలంగాణలో ఏఐసీసీ కీలక నేతల పర్యటనలపై చర్చించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీలున్నన్ని ఎక్కువ సార్లు ప్రియాంక, రాహుల్‌గాంధీలతోపాటు ఖర్గే కూడా రాష్ట్రంలో పర్యటించేలా షెడ్యూల్‌ ఇవ్వాలని, కీలక సమయంలో మరోమారు సోనియాగాంధీ కూడా పాల్గొనేందుకు అనుమతి ఇప్పించాలని రేవంత్‌ కోరినట్టు సమాచారం. ఈ నెల 15 తర్వాత రాష్ట్రంలో రెండు రోజులపాటు రాహుల్‌ పర్యటన ఉంటుందని తెలిసింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement