బస్సు యాత్ర | Bus trip | Sakshi
Sakshi News home page

బస్సు యాత్ర

Published Mon, Mar 24 2014 3:41 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

బస్సు యాత్ర - Sakshi

బస్సు యాత్ర

దయనీయంగా కాంగ్రెస్ పరిస్థితి

  •      పూర్వ వైభవం కోసం నాయకుల తంటాలు
  •      కనుచూపు మేరలో కానరాని    నాయకత్వం, క్యాడర్
  •      అధికారం అనుభవించి సైకిలెక్కేశారు
  •      మాజీ సీఎం కిరణ్ సొంత కుంపటి
  •      తిరుపతిలో చిరంజీవికి హ్యాండిచ్చిన అనుచరవర్గం

 సాక్షి, చిత్తూరు: పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించాలని నూతన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చిత్తూరు జిల్లాలో కొంచెం కూడా ఫలించేలా కనిపించడం లేదు. ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాలో నిర్వహించనున్న బస్సుయాత్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు ఇవ్వడం కష్టమే.

నూతన పీసీసీ సారథి రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి, మరికొందరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి చిత్తూరు జిల్లాలో 25వ తేదీన బస్సుయాత్ర ప్రారంభం కానున్నది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌గ్రౌండ్స్‌లో ఎన్నికల బహిరంగసభ నిర్వహించనున్నారు. తరువాత రోజు కూడా జిల్లాలో బస్సుయాత్ర సాగుతుంది.
 
దయనీయంగా కాంగ్రెస్ పరిస్థితి
 
కాంగ్రెస్ బస్సుయాత్రకు అవసరమైన ఖర్చులు కూడా జిల్లా నాయకత్వం పెట్టుకునే పరిస్థితి లేదు. డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి నిన్న మొన్నటి వరకు ఒక మండల నాయకుడిగా మాత్రమే ఉన్నారు. ఇప్పుడు జిల్లా రాజకీయూలపై పట్టు సాధించడం అంత సులభం కాదు. అదే సమయంలో తిరుపతి ఎంపీ చింతామోహన్ ఒక్కడే కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా మిగి లారు. ప్రస్తుతం ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌కు ప్రధాన నాయకత్వం లేదు. నిన్నమొన్నటి వరకు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత కుంపటి పెట్టుకున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒకరకంగా షాకే.

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా చివరి వరకు మంత్రి పదవి అనుభవించారు. నాలుగుసార్లు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి కొద్దిరోజుల క్రితమే తెలుగుదేశం పార్టీలో చేరారు. దీనికి తోడు ఇప్పటి వరకు తుడా చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్న వెంకటరమణ పదవిలో ఉంటూనే తెలుగుదేశం జెండా భుజానికి ఎత్తుకున్నారు.

జీడీనెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ ఇదే బాటలో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో రవి, షాజహాన్ బాషా కూడా కాంగ్రెస్‌ను వదిలేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రధాన నాయకత్వం కొరవడటంతో పరిస్థితి దారుణంగా మారింది. 14 నియోజకవర్గాల్లో చరిష్మా ఉన్న నాయకులు కాంగ్రెస్‌లో లేరు.  
 
తిరుపతిలో చిరంజీవికి దిక్కులేదు
 
సామాజికవర్గం దయతో చిరంజీవి తిరుపతిలో ఎమ్మెల్యే అయ్యారు. అదే సామాజికవర్గం ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్‌గా చిరంజీవి తిరుపతికి వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. తిరుపతిలోని పూర్వపు పీఆర్పీ నాయకులు అందరూ చిరంజీవి వెంట కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు ఆయన మంత్రి పదవి అనుభవిస్తూ తమను గాలికి వదిలేశాడని, ఆయన దారి ఆయన చూసుకున్నాడన్న కోపంతో ఆయనకు షాకిచ్చారు.

ఒకప్పుడు చిరంజీవికి సన్నిహితంగా ఉన్న సైకం జయచంద్రారెడ్డి కాంగ్రెస్‌ను వదలి టీడీపీ నీడన చేరారు. తిరుపతి నియోజకవర్గం పీఆర్పీ నాయకులుగా, చురుకుగా ఉంటూ చిరంజీవి వెంట నడిచిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఊకా విజయకుమార్ తదితర పూర్వపు పీఆర్పీ నాయకులు అందరూ ఇప్పుడు చంద్రబాబు పంచన చేరారు. దీంతో చిరంజీవి అనుచరవర్గమంతా తుడిచి పెట్టుకుపోయినట్టయింది.
 
రెండో శ్రేణితో నెట్టుకొచ్చే యత్నం
 
రెండో శ్రేణిలో ఉన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను బతిమాలి, భవిష్యత్‌లో పదవులు ఇస్తామని ఆశలు చూపుతూ వారిని సమావేశాలకు రప్పించుకుంటున్నారు. నేరుగా అధినాయకులే జిల్లాకు వస్తున్నారు. ‘మీరు ఏం చెబితే అదే చేస్తాం... టిక్కెట్ల విషయంలోనూ మీ సలహాలు తీసుకుంటాం’ అంటూ చోటా నాయకులకు చెబుతూ వారు ‘చేయి’ జారిపోకుండా తంటాలు పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement