రైతు సమస్యల పేరుతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేపట్టిన బస్సు యాత్రపై రైతుల నుంచి స్పందన మాట దేవుడెరుగు, ఆ పార్టీ నేతల్లోని అంతర్గత కలహాలు,
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రైతు సమస్యల పేరుతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేపట్టిన బస్సు యాత్రపై రైతుల నుంచి స్పందన మాట దేవుడెరుగు, ఆ పార్టీ నేతల్లోని అంతర్గత కలహాలు, అసంతృప్తులను మాత్రం మరింత రగిల్చేస్తోంది. వరుస ఎన్నికల్లో చావు దెబ్బతిని జిల్లాలో దాదాపు కనుమరుగైన ఆ పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఒకరిద్దరు ముఖ్య నేతల ఒంటెద్దుపోకడల కారణంగా ఉన్న నాయకులూ వలసబాట పట్టే పరిస్థితి దాపురించిందనే అభిప్రాయం ఆ పార్టీ ముఖ్య నేతల్లోనే వ్యక్తమవుతోంది. కనీసం జిల్లా అధ్యక్షుడితో కూడా చర్చించకుండానే ఈ బస్సు యాత్రను ప్రకటించడం ఏంటని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ముఖ్య నాయకులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ కోతలు, రుణ మాఫీ విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు టీటీడీపీ పలు జిల్లాల్లో ఈ బస్సు యాత్ర చేపట్టింది. ఆదివారం ఈ యాత్ర జిల్లాలో ప్రవేశించనుంది.
కరీంనగర్ జిల్లా నుంచి తూర్పు జిల్లా పరిధిలోని లక్సెట్టిపేట మీదుగా కొనసాగి.. ఉట్నూర్‌లో ధర్నా చేపట్టనున్నారు. ఈ యాత్ర ఎలా నిర్వహించాలనే అంశంపై ముందస్తు సమావేశాలేవీ జరిగిన దాఖలాల్లేవు. కనీసం ఈ విషయంలో ఆ పార్టీ తూర్పు జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావుతో గానీ, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో గానీ ముందుగా చర్చించలేదని, వారి అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోలేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల తర్వాత నాలుగు నెలలుగా పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. మొదటిసారిగా రైతు సమస్యలపై నిర్వహిస్తున్న ఈ యాత్ర నిర్వహణ తీరు ఇలా ఉండటం ఆ పార్టీలోని అసంతృప్తులను మరింత రగిలేలా చేస్తోంది.
‘పార్టీలో ఉన్నాం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో యాత్రలో పాల్గొనాల్సి వస్తోంది. ఈ యాత్రలో పాల్గొనకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతోనే ఈ యాత్రలో పాల్గొనాల్సి వస్తోంది’ అని ఆ పార్టీ ఓ నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్కొన్నారు. మరోవైపు ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒకరిద్దరు మినహా దాదాపు పార్టీకి దూరమయ్యారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పాటి సుభద్ర, నిర్మల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాబర్ వంటి నేతలు ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్ శ్రేణులు
టీటీడీపీ బస్సు యాత్ర ప్రకటించిన వెంటనే అధికార టీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. విద్యుత్ సంక్షోభానికి గత ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో విద్యుత్ కోసం బషీర్‌బాగ్‌లో నిరసన కార్యక్రమాలు చేపడితే తూటాల వర్షం కురిపించి పలువురు రైతుల ప్రాణాలను బలిగొన్న ఘనత చంద్రబాబుది కాదా? ఆని టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి విమర్శించారు. ఈ యాత్రను ప్రజలే తగిన విధంగా స్పందిస్తారని, అడ్డుకుంటారని ఆయన తెలిపారు. టీటీడీపీ నుంచి నేతల వలసలకు అడ్డుకట్ట వేసే జిమ్మిక్కుల్లో భాగమే ఈ బస్సు యాత్ర తప్ప, రైతులపై మమకారంతో కాదని ఆయన విమర్శించారు.