టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
బీజేపీ చేతిలో ఆయన పావు
ఏపీ తరహాలో ఇక్కడా చేయాలనుకుంటున్నారు
కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు జాగ్రత్తగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుపెట్టి బీజేపీ రాజకీయం ప్రారంభించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆడిన విధంగానే ఇక్కడ బీజేపీతో కలిసి నాలుగు స్తంభాలాట ఆడాలనేది చంద్రబాబు వ్యూహమని, ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని నిర్వీర్యం చేయలేరని పేర్కొన్నారు.
గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు బి.లింగం యాదవ్, గజ్జి భాస్కర్‌లతో కలసి ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు హైదరాబాద్ ఎన్నోసార్లు వచ్చి వెళ్లారని, అయినా ఎవరికీ తెలిసేది కాదని, ఇప్పుడు విభజన సమస్యల పేరుతో మళ్లీ హైదరాబాద్‌లో బాబు ప్రవేశించారని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి బీజేపీ వేస్తున్న ఎత్తుగడలో చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ డైరెక్షన్‌లోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని విమర్శించారు. అందుకే చంద్రబాబు వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా సమరి్థంచారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అని, హైటెక్‌సిటీకి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలోనే పునాదులు పడ్డాయని, ఇప్పుడు చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
చేసిన అభివద్ధినే బాబు, కేసీఆర్ కొనసాగించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తాను నామినేటెడ్ పదవులు ఆశించే వాడిని కాదని స్పష్టం చేశారు. రాజుయుద్ధం చేసి గెలిచినట్టు సంగారెడ్డి రాజ్యానికి మళ్లీ ప్రజలు గెలిపించి తనను రాజును చేస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment