
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. రెండో విడత బస్సు యాత్రను ఆయన వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభిస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే రాహుల్‌గాంధీ ఎక్కడ పాల్గొంటారనేది ఖరారు కావాల్సి ఉందన్నాయి. మొదటి విడత బస్సు యాత్రలో భాగంగా మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణలోని 8 నియోజకవర్గాల్లో పర్యటించిన రాహుల్ ఈసారి దక్షిణ తెలంగాణలో పర్యటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇక, ప్రియాంకాగాంధీ ఈనెల 31న కొల్లాపూర్‌లో జరిగే పాలమూరు ప్రజాభేరి సభకు హాజరు కానున్నారు. ఆ రోజున సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న ఆమె అక్కడి నుంచి నేరుగా వెళ్లి కొల్లాపూర్ సభలో పాల్గొంటారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర నేతలు మొదటి విడత బస్సు యాత్రను ఈనెల 26, 27 తేదీల్లో కొనసాగించేలా పార్టీ షెడ్యూల్ రూపొందించింది.
ఈ రెండు రోజుల్లో మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్‌తోపాటు మొత్తం 10 మంది నాయకులు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున 40 నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. ఈ రెండు రోజులపాటు ఆయా నియోజకవర్గాల్లో గడప గడపకూ వెళ్లి ఆరు గ్యారంటీ పథకాల కార్డులను పంపిణీ చేయడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసే సభల్లో కూడా నేతలు పాల్గొననున్నారు.
సీఈసీ నిర్ణయమే ఫైనల్: మహేశ్‌కుమార్‌గౌడ్
పార్టీ అభ్యర్థుల ఖరారు కోసం బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశమవుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని, సీఈసీ నిర్ణయమే ఫైనల్ అని ఆయన గాందీభవన్‌లో మంగళవారం విలేకరులకు చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానాలను మైనార్టీ నేతలు అడుగుతున్నారని, పార్టీ కూడా మైనార్టీలకు న్యాయం చేస్తుందని చెప్పారు.
తాను ఆశిస్తున్న నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని ఎవరికి కేటాయించాలన్న దానిపై స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం జరగనున్న సీఈసీ సమావేశానికి అందుబాటులో ఉండాలని పార్టీ నుంచి పిలుపు రావడంతో ఆయన ఢిల్లీ వెళ్లారని, రాష్ట్ర నాయకత్వం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సానుకూలంగానే ఉన్నా ఆయనకు మైనార్టీ సెగ తప్పదని తెలుస్తోంది. మరోవైపు ఇదే స్థానం తనకు కేటాయించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ కూడా గట్టిగా పట్టుపడుతుండటం, అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.