
చిరంజీవి ప్రసంగానికీ కానరాని స్పందన
- చిరంజీవి ప్రసంగానికీకానరాని స్పందన
- ఆరంభంలో జోష్..ఆ తర్వాత నీరసం!
సాక్షి, విశాఖపట్నం, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిరథ మహారథులతో బస్సు యాత్రన్నారు. వెండితెర నేలిన మెగాస్టార్ చిరంజీవి ప్రచార సారథ్య బాధ్యతలు చేపట్టడంతో ఆశలు పెంచుకున్నారు. భారీ బహిరంగ సభ.. ర్యాలీలుగా జనం.. ప్రకటనలు భారీగానే గుప్పించారు. శ్రీకాకుళం సభకు వచ్చిన స్పందనతో జాగ్రత్తపడ్డారు. బహిరంగ సభను కాస్తా.. కార్యకర్తల సమావేశంగా మార్చేశారు. అది కూడా నిర్ణీత సమయానికి ప్రారంభం కాకపోవడంతో.. చిరంజీవి మాట్లాడక ముందే తీసుకొచ్చిన జనాలు
తిరుగు ముఖంపట్టారు. దీంతో దిగాలుపడటం నేతల వంతయింది.
ఆరంభంలో జనాలు ఫుల్!
ఉదయం 10 గంటలకు కార్యకర్తల సమావేశం ప్రారంభమవుతుందని ముందుగా ప్రకటించారు. సభా వేదిక ముందు సుమారు 2,500 కుర్చీలు వేశారు. అయితే ప్రధాన నేతలు వచ్చేసరికి 11.15 గంటలయింది. అప్పటికిగానీ సమావేశం ప్రారంభంకాలేదు. ఆ సమయంలో కుర్చీలు పూర్తిగా నిండిపోయాయి.
ప్రధాన నేతల బస్సుతోపాటు వచ్చిన వారితో కాసేపు సభా ప్రాంగణం కిటకిటలాడింది. కూర్చునేందుక్కూడా వీల్లేని పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షుడు బెహరా భాస్కరరావు నేతృత్వంలో బాగానే జన సమీకరణ చేశారు. అయితే నేతల ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపేశారు. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి జనాలు తిరుగుముఖం పట్టడం మొదలయింది.
ఆనం రామనారాయణరెడ్డి ప్రసంగించే సమయంలో మొదలైన ఈ ధోరణి రఘువీరారెడ్డి ప్రసంగించేసరికి మరింత పెరిగింది. చిరంజీవిని చూడాలి, ఆయనతో కరచాలనం చేయాలనుకునేవారంతా ముందు నుంచీ సభా వేదిక ముందే పడిగాపులు కాశారు. వీరు మాత్రమే చివరి వరకు మిగిలారు. వెనుక కుర్చీలన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. దీంతో చిరంజీవి కూడా మీడియాకు చేతులు జోడిస్తూ.. వెనుక కుర్చీలు ఖాళీగా ఉన్నాయని.. ప్రచారం చేయకండి.. అంతా ముందుకు రావడం వల్లే ఖాళీ అయిందంటూ వివరణిచ్చుకున్నారు.
ఆ నేతల్ని ఎండగట్టారు
కాంగ్రెస్, పీఆర్పీ గుర్తుపై గత ఎన్నికల్లో గెలిచి, ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి కాంగ్రెస్‌ను కష్టాల్లోకి నెట్టి వెళ్లిపోయిన నేతల తీరును రఘువీరారెడ్డి, చిరంజీవి తీవ్రంగా ఎండగట్టారు. వారిని విశ్వాసఘాతకులుగా, కృతఘు్నలుగా అభివర్ణించారు. స్థానిక ఎన్నికల నామినేషన్లకు ముందు నేతలు పార్టీని వీడటం వల్లే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు పడలేదని రఘువీరారెడ్డి అన్నారు. ఇలాంటి విశ్వాసఘాతకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ జోస్యం చెప్పారు.
చిరంజీవైతే.. బాహాటంగానే తన బాధను వ్యక్తపరిచారు. పీఆర్పీకి రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా విశాఖలో 32-33 శాతం ఓట్లేసి, నలుగురిని గెలిపించారని, మీరిచ్చిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నుంచి.. ఈ చిరంజీవి నుంచి నిష్ర్కమించడం కొంచెం బాధాకరమనిపించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ పురందేశ్వరినైతే కృతఘు్నరాలిగా పేర్కొన్నారు. 127 ఏళ్ల కాంగ్రెస్ ఎప్పటికప్పుడు యువరక్తం ఎక్కించుకుంటూ నూతనోత్సాహంతో ముందుకెళ్తూనే ఉంటుందంటూ.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించారు.
దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, మాజీ మంత్రులు పసుపులేటి బాలరాజు, ఆనం రామనారాయణరెడ్డి, సి.రామచంద్రయ్య, పార్టీ నగర అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు సతీష్‌వర్మ, నగర మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, మాజీ మేయర్ పులుసు జనార్దనరావు, మాజీ కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు