మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఒక్కోసారి ఒక్కోలా వినూత్నంగా, విచిత్రంగా వ్యవహరిస్తుంటారు. అటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంతోనూ, ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంతోనూ సఖ్యతగా ఉంటారు. కొన్నాళ్ళకు బీజేపీ వాళ్లతో బావుంటారు. ఇంకోరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫోటో దిగుతారు. అలా సందర్భాన్ని బట్టి అల్లుకుపోతుంటారు.
ఇదిలాఉండగా ఆయన తాజాగా జనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం ఇచ్చిన అంశం పెద్దగా చర్చకు వచ్చింది. తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్‌కు మాత్రం రూపాయి విరాళం ఇవ్వలేదు కానీ.. తన తమ్ముడి జనసేన పార్టీకి మాత్రం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం చిరంజీవి ఇంకా తమ పార్టీ నాయకుడే అంటున్నారు. వాస్తవానికి చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగుతూనే ఉన్నారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దీంతోబాటు ఆయన్ను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా కూడా పలుమార్లు చెబుతూ వచ్చింది.
కానీ, ఆయన మాత్రం అటు కాంగ్రెస్‌తో పెద్దగా రిలేషన్ కొనసాగించకుండా అంటీముట్టనట్లుగా ఉన్నారు. బీజేపీ, నరేంద్ర మోదీతో కూడా ఆయన మంచి సంబంధాలనే కలిగి ఉన్నారు. ఆ మధ్య ఆంధ్రకు వచ్చి, భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సైతం హాజరైన మోదీ అప్పట్లో చిరంజీవితో సఖ్యతగానే మెలిగారు. మొత్తానికి ఇప్పుడు ఆయన తమ్ముడికి మద్దతుగా ఆర్థిక సాయం అందజేశారు.
ఇదిలా ఉండగా అటు కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్.. గిడుగు రుద్రరాజు వంటివాళ్ళు సైతం చిరంజీవిని ఇంకా తమవాడేనని, ఆయన తమ కోసం ప్రచారం చేస్తారని అంటున్నారు. అయితే, అసలుకు చిరంజీవి కేవలం టాక్స్ ఎగ్గొట్టడానికి అలా విరాళం ఇచ్చారు తప్ప సీట్లు, పార్టీని అమ్ముకున్న పవన్ కళ్యాణ్‌కు ఈ విరాళాలు ఎందుకని కొందరు అంటున్నారు. మరోవైపు చిరంజీవి కేవలం విరాళంతో ముగిస్తారా లేక జనసేన తరఫున ప్రచారం చేస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే, అటు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న చిరంజీవి.. తమ్ముడి కోసం ఎలా ప్రచారం చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో, అదంతా ఫామిలీ డ్రామా తప్ప ఇంకేం లేదని రాజకీయ విశ్లేషకులు తేల్చేశారు.
- సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment