బాబు, పవన్ లేకుండానే మోదీ సభలు
బీజేపీ అభ్యర్థులున్నచోటే మోదీ ప్రచారం
రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేటలో ప్రచారం
అసలు చేయితగిలితేనే ఒప్పుకోని మనిషి కాలు తగిల్తే ఊరుకుంటుందా ? అసలే ఊరుకోదు... ఇల్లుపీకి పందిరిస్తుంది.. ఊరంతా గాయి గత్తర చేస్తుంది. బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది... మ్యానిఫెస్టోలో చంద్రబాబు బాటు పక్కనే తన ఫోటో ఉంచితేనే వద్దన్నా ప్రధాని మోడీ ఇప్పుడు చంద్రబాబు... పవన్ తో కలిసి ప్రచారం చేస్తారా? చేయనే చేయరు. వాస్తవానికి టీడీపీ జనసేన...బీజేపీల ఉమ్మడి మ్యానిఫెస్టో మొన్న విడుదల చేసారు. వాస్తవానికి మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నపుడు... సీట్లు కూడా పంచుకుని మరీ బరిలోకి దిగుతున్నపుడు మ్యానిఫెస్టోలో కూడా మూడుపార్టీల ఫోటోలు ఉండాలి.
కానీ దీనికి బిజెపి పెద్దలు నో అన్నారని, అందుకే మోడీ పేరు, ఫోటో లేకుండానే కేవలం చంద్రబాబు, పవన్ ఫొటోలతో మ్యానిఫెస్టో విడుదల చేసారు.. ఆ మ్యానిఫెస్టోతో తమకు సంబంధం లేదని, దాని అమలు అనేది వాళ్లదే బాధ్యత అని బీజేపీ తేల్చేసింది. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం అనేది తుది అంకానికి చేరిన తరుణంలో మోడీ మరోమారు ఆంధ్రాలో ప్రచారానికి వస్తున్నారు. గతంలో వచ్చి పవన్, చంద్రబాబులతో కలిసి చిలకలూరిపేటలో బహిరంగ సభలో మాట్లాడారు. అప్పుడు కూడా మా ఎన్డీయేను గెలిపించండి అన్నారు తప్ప మాటవరసకు ఐన జగన్ను విమర్శించలేదు... బాబును నెత్తికి ఎత్తుకుని గెలిపించాలని ప్రజలను కోరలేదు. వాస్తవానికి బీజేపీ ఆంధ్రాలో ఆరు లోక్‌సభ ...పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.
ఇప్పుడు మళ్ళీ మోదీ రెండోవిడత ప్రచారానికి వస్తున్నారు., ఇందులో భాగంగా 7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ వస్తున్నారు. ఏదో తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి నియియోజకవర్గంలో ని వేమగిరిలో బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఆ తరువాత అదేరోజు సాయంత్రం సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేస్తున్న అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న రాజంపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పీలేరులో పాల్గొంటారు... ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు... అదేరోజు రాత్రి రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు
వాస్తవానికి ఈ కార్యక్రమాలకు కూటమి భాగస్వాములు అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైతం హాజరవ్వాలి... కానీ మోడీ తీరు, బిజెపి విధానం చూస్తుంటే అసలు వాళ్లతో మాట్లాడేందుకు సైతం ఇష్టపడుతున్నట్లు కనిపించడం లేదు.. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తుపెట్టుకున్నాం తప్ప మాకు వాళ్ళిద్దరంటేనే చిరాకు.. చూస్తుంటేనే ఎలపరం వస్తోంది అన్నట్లుగా ఉన్నారు.. అందుకే ఈ ప్రచార సభల్లో టీడీపీ, జనసేన నేతలు పాల్గొనే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. మోడీ కూడా కేవలం తమ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోటనే ప్రచారం చేసేలా టూర్ షెడ్యూల్ రూపొందించారు..
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment