పవన్ సరికొత్త ఆలోచన
బీకాం చదివి డాక్టర్ అయ్యి..బోలెడు బిల్డింగులు నిర్మించి రైతులకు లాభం చేకూర్చి సైన్యంలో చేరి యుద్ధం చేసి ఓడలు నడపాలి.. ఇదే నా లక్ష్యం అన్నాడొక స్మార్ట్ బాయ్.. స్మార్ట్ అంటే..మహా స్మార్ట్.. తెలివి.. అతి తెలివన్నమాట.
అంటే తానేం కావాలనుకున్నదీ.. ఆ దిశగా తనేం చేస్తున్నదీ తెలియని ఓ మేధావితనం అన్నమాట. ఇప్పుడు జనసేనాని పవన్ సైతం అలాగే ఉన్నారు. పెద్దమ్మ చెరువు గట్టు మీద మూడు సుమోలు.. ఆ తరువాత మర్రి చెట్టు దగ్గర మూడు సుమోలు.. అదీ మిస్సయితే ఈసారి ఊరు పొలిమేర దగ్గర ఏకంగా ఆరు సుమోలు పెట్టాడు.. అన్నెందుకురా బుజ్జా అంటే..ఏమో..నాకు తెలీదు అంటాడు. తాను ముఖ్యమంత్రి అవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ పరిస్థితి ఇప్పుడు జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా ఉంది. పేరుకే జన సేన కానీ సైనికుల్లో బోలెడు సందేహాలు. సేనాని గమనం అనుమానాస్పదం.. ఎటు పయనిస్తున్నాడో తెలీదు. ఆయన లక్ష్యం గమ్యం.. గమనం అంతా సందేహాస్పదంగా ఉంటోందని సైనికుల కలవరం.
ఆత్మ విశ్వాసం ఉన్న వారు నిర్ణయాలు ఠకీ ఠకీమని తీసేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మాదిరిగా అన్నమాట. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 గెలిచి తీరతామన్న ధీమా నుంచి ‘వైనాట్ 175?’ పుట్టుకొచ్చింది ఈ ఆత్మ విశ్వాసం నుంచే. నియోజకవర్గాల ఇంఛార్జుల నియామకమూ టకటకా సాగిపోయింది కూడా తనపై, తన పార్టీ విధానాలపై, పరిపాలనదక్షతలపై ఉన్న నమ్మకం కారణంగానే.. వైఎస్సార్సీపీలో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రతిపక్ష పార్టీల్లో జరుగుతోందేమిటి? అడుగుఅడుగునా బలహీనత! నీడను చూసి కూడా భయపడే పరిస్థితి. పొత్తుల కోసం తాపత్రయం. పొత్తు బలమిస్తుందన్న భ్రమ.
ఇదిలా ఉండగా సీఎం అవుతానని పార్టీ పెట్టిన పవన్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ లో ఉన్నారు. తెలుగుదేశంలో పొత్తుతో 24 ఎమ్మెల్యే మూడు ఎంపీ సీట్లు తెచ్చుకున్న పవన్ ఇప్పుడు సీఎం పదవి సంగతి పక్కనబెట్టి తన రాజకీయ గమనాన్ని..మార్గాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో భీమవరం.. గాజువాకలో కూడా ఓడిపోయిన పవన్ ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అంటే...ఎంపీగా గెలిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం వస్తుందని ఆయన చూస్తున్నారు.
ఈ చంద్రబాబు.. జనసేన.. బిజేపీ పొత్తులో ఎలాగైనా ఎంపీగా గెలవాలన్న అశతో ఉన్న పవన్ ఈసారి అనకాపల్లి లేదా ఇంకో చోట ఎంపిగా పోటీ చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం.. బిజేపీ..జనసేనతో కూడిన ప్రభుత్వం రాకపోతే కనీసం కేంద్రంలో అయినా మంత్రిగా ఉండోచ్చనేది పవన్ ఆలోచన. అయితే ఆయన ఎక్కడ పోటీ చేస్తారు. ఎంపీగా గెలిచే సాధన సంపత్తి, క్యాడర్.. అన్నిటికీ మించి అటు టీడీపీ నుంచి సహాయం..మద్దతు ఉంటుందా అన్నది చూడాలి.. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి ఎంపీగా ఎలా గెలుస్తారని వెక్కిరించేవాల్లు ఉన్నా పవన్ మాత్రం.. అటు ఎమ్మెల్యే..ఇటు ఎంపీగా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment