మద్దిలపాలెం (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి/ఆరిలోవ (విశాఖ తూర్పు): రుషికొండ చూడడానికి వెళ్లి పవన్‌కళ్యాణ్ అక్కడ జరుగుతున్నవి అక్రమ నిర్మాణాలని, అక్కడ స్థలాలను కబ్జాచేశారని, ఈ నిర్మాణాలకు అనుమతులెవరు ఇచ్చారని అర్థంపర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు.
ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కట్టడాలు అధికారికంగా కడుతుంటే ఎవరి అనుమతి తీసుకుంటారని, ఈ మాత్రం జ్ఞానంలేకుండా పవన్‌కళ్యాణ్ అవివేకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజారంజకమైన పాలనతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న సీఎం జగన్ చర్మిషాను చూసి పవన్ విద్వేషంతో రగిలిపోతున్నారన్నారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో ఆదివారం మంత్రి అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే..
రుషికొండ మీద నిర్మిస్తున్న భవనాలలో సీఎం కార్యాలయాన్ని గానీ, ప్రభుత్వ కార్యాలయాలను గాని వినియోగించే అవకాశాలున్నాయి. సీఎం విశాఖపట్నం రావడానికి ఎలాంటి బిల్లు అవసరంలేదు. విశాఖ నుంచి పాలన చేస్తాననే మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు. త్వరలో సీఎం విశాఖకు రానున్నారు. ఇక రుషికొండలో షరతులను ఎక్కడా ఉల్లంఘించకుండా అన్ని అనుమతులతో చేపడుతున్నవే.
రామానాయుడు స్టూడియో, వేంకటేశ్వరస్వామి ఆలయం, ఐటీ కంపెనీలు కొండలపైన కట్టినవే. ఇవన్ని అభివృద్ధిలో భాగమే. భూమి లభ్యత తక్కువున్న ప్రాంతాల్లో కొండలపై ఇటువంటి భవనాలను నిర్మించడం సర్వసాధారణం. ఈ విషయం పవన్‌కు తెలీకపోవడం దురదృష్టకరం. రామోజీ ఫిల్మ్‌సిటీ, మీ అన్నగారు చిరంజీవి ఇళ్లు కొండ మీద కట్టలేదా? వీటన్నింటికి లేని అభ్యంతరాలు రుషికొండపై ప్రభుత్వ భవనాలు కడితే వచ్చిందా?
బాబు అజెండాను మోస్తున్న పవన్
చంద్రబాబు కోసం కోతిలా ఎగురుతున్న పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం హయాంలో జరిగిన అక్రమాలను ఆ పార్టీ నాయకులే బయట పెట్టినప్పడు ఎందుకు నోరు విప్పలేదు? నది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కట్టుకున్నప్పుడు పవన్ కళ్లు కనబడలేదా? నిజానికి.. పవన్ తన జెండాను పక్కనపెట్టి చంద్రబాబు అజెండాను మోస్తున్నారు. విశాఖ నగరంలో లక్షన్నర మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తే దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు కేసులు వేశారు. దీనిపై పవన్ ఎందుకు చంద్రబాబుని ప్రశ్నించలేదు? అసలు ఆయనకు సరైన పొలిటకల్ స్టాండ్‌లేదు.
మంత్రిగా వాస్తవాలను చెప్తే వేయరా?: రోజా
మరోవైపు.. మంత్రి రోజా ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే.. మధ్యలో పవన్, చంద్రబాబుకు వచి్చన బాధేంటని ఆమె అందులో ప్రశ్నించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. రుషికొండ వద్ద ఏం నిర్మిస్తున్నామన్న విషయాన్ని శనివారం అధికారికంగా మీడియా సమావేశంలో వివరించా. కానీ, ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ఈ నిజాలను ప్రజలకు చెప్పలేదు. అందుకే మరోసారి స్పష్టతనిస్తున్నాను. రుషికొండలోని భూమి ప్రభుత్వ భూమి. పర్యాటక శాఖకు సంబంధించిన భూమి అది.
ఇక్కడ పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉంది. ఇందులో 9.88 ఎకరాల్లో నిర్మాణాల కోసం ప్రభుత్వానికి అనుమతులిచ్చారు. ఇందులో కూడా మేం కడుతున్నది కేవలం 2.7 ఎకరాల్లోపే. ఏడు భవన నిర్మాణాలకు అనుమతులొస్తే కేవలం నాలుగు భవనాలు మాత్రమే నిర్మిస్తున్నారు. అదికూడా జీ ప్లస్ వన్ మాత్రమే. రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు వేసిన కమిటీ అన్నింటినీ పరిశీలించి, తనిఖీచేసి రిపోర్టు కూడా ఇచ్చింది. హైకోర్టు ఏమైనా సూచనలు చేస్తే వాటిని కూడా పాటిస్తాం. ప్రజాప్రతినిధిగా ఏ హోదాలేని వాడు, కనీసం వార్డు మెంబర్ కూడా కాని పవన్ మాటలను పెద్దపెద్దగా ప్రచారం చేస్తారా? ఆయన ఊగుడు చూస్తుంటే త్వరగా మెంటల్ ఆస్పత్రిలో చేరేట్లు ఉన్నాడు.
పవన్ ఓ ఫ్లవర్‌స్టార్: వరుదు కళ్యాణి
విశాఖపట్నం రుషికొండ వద్ద ఉన్న గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములు కనిపించడం లేదా? అని పవన్‌ను ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. రుషికొండపై ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతింటుందని తప్పుపడుతున్నారని, అయితే దీనికి ఎదురుగా ప్రభుత్వ భూమిని ఎకరాలకొద్దీ ఆక్రమించిన లోకేశ్ తోడల్లుడు భరత్‌కు చెందిన గీతం వర్సిటీ గురించి, ఓ కొండపై పూర్తిగా పచ్చదనం నాశనం చేసి నిర్మించిన రామానాయుడు స్టూడియో గురించి పవన్ ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలన్నారు.
తన పర్యటనల్లో పవన్ చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె అన్నారు. పవన్ నడుపుతున్నది జనసేన కాదు.. చంద్రసేన అంటూ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఆయన సినిమాల్లో పవర్‌స్టారే కావచ్చు.. కానీ, రాజకీయాల్లో మాత్రం ఫ్లవర్‌స్టార్ అని వ్యాఖ్యానించారు. పెందుర్తిలో మరణించిన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారన్నారు. వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ అని అనడానికి ఆయనకు నోరెలా వచ్చిందన్నారు. ఇక హిందూపురంలో జనసేన నేత ఓ వ్యక్తిపై దాడిచేసి 16 తులాల బంగారు ఆభరణాలు దోచేశాడని, ఈ ఘటనతో జనసేన నేతలు హత్యలు, దోపిడీలు చేస్తారని ఒప్పుకుంటావా? అని ఆమె ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment