సాక్షి, విశాఖపట్నం: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు విశాఖ మహా నగరం వేదికకానుంది. ఐదున్నర దశాబ్దాల తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఇంటర్నేషనల్ కమిషన్(ఐసీఐడీ) 25వ అంతర్జాతీయ కాంగ్రెస్‌ను నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు విశాఖ రిషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహించనున్నారు. ‘వ్యవసాయంలో నీటి కొరతను అధిగమించడం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 74 దేశాలకు చెందిన 1,200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరులశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సును రెండో తేదీన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఐసీఐడీ అధ్యక్షుడు డాక్టర్ రాగబ్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వివిధ దేశాల అంబాసిడర్లు, మంత్రులు పాల్గొంటారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీగా జలవనరుల శాఖ ప్రత్యేక అధికారి ఎల్లారెడ్డి వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఐసీఐడీ 25వ అంతర్జాతీయ కాంగ్రెస్‌తోపాటు 74వ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఐఈసీ) సదస్సు కూడా ఇదే వేదికపై జరగనుంది.
లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు
విశాఖలో జరగనున్న 25వ అంతర్జాతీయ కాంగ్రెస్, 74వ ఐఈసీ సదస్సుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు 74 దేశాల నుంచి సభ్యులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఏర్పాట్లపై సమీక్షించి భద్రత, నిర్వహణపరంగా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. సదస్సుకు హాజరయ్యే అతిథుల్లో సుమారు 300మంది స్థానిక పర్యాటక ప్రాంతాలతోపాటు అరకు, తాటిపూడి రిజర్వాయర్లను సందర్శించనున్నారు.
– డాక్టర్ మల్లికార్జున, విశాఖపట్నం జిల్లా కలెక్టర్
కార్యక్రమం ఇలా...
- ఐసీఐడీ ఏర్పాటైన తర్వాత తొలి సదస్సు 1951లో భారత్‌లో నిర్వహించారు. ఆ తర్వాత 1966లో 6వ అంతర్జాతీయ కాంగ్రెస్‌ను ఢిల్లీలో నిర్వహించారు. మళ్లీ 57 ఏళ్ల తర్వాత విశాఖలో నిర్వహించనున్నారు.
- విశాఖ సదస్సులో వ్యవసాయం కోసం ప్రత్యామ్నాయ నీటి వనరులు ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ఐసీఐడీలోని 54 సభ్యదేశాలు, మరో 20 అసోసియేట్ మెంబర్ సభ్యదేశాల ప్రతినిధులు చర్చించనున్నారు.
- సంప్రదాయ నీటివనరులను అభివృద్ధి చేయడం, నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడం, వర్షపునీటి సంరక్షణ, పొలాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు మార్గాలు, భూగర్భ జలాల పెంపు, మురుగునీటిని శుద్ధి చేసి సాగునీటిగా వినియోగించేందుకు ఉన్న మార్గాలు, అధిక దిగుబడుల కోసం శుద్ధజలాల వినియోగం తదితర అంశాలపై తొలి రెండు రోజులు సెషన్స్ నడుస్తాయి.
- రైతు సాధికారత అంశంపై సహకార సంస్థలు, నీటి వినియోగదారుల సంఘాల పాత్ర, వ్యవసాయ విస్తరణ సేవలు, రైతులకు ఉపయోగపడే సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయ రంగంలో సాంకేతికతను పెంపొందించడం, వ్యవసాయ పరిశోధనలు, ఆవిష్కరణలు, స్కాడా తదితర అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు జరగనున్నాయి.
- 2 నుంచి 4వ తేదీ వరకు వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, ఆధునిక పద్ధతులు, కొత్త పరికరాలతో కూడిన 128 స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు.
- భారత్ నుంచి 300 మంది ప్రతినిధులు, ఇతర దేశాల నుంచి 900 మందికిపైగా ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment