
జగన్ బస్సు యాత్ర సక్సెస్
భారీగా తరలివచ్చిన బానకచర్ల, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ఆయకట్టు రైతులు
కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఏపీ శాసనసభలో విపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చేపట్టిన ప్రాజెక్టుల బస్సు యాత్రకు శుక్రవారం కర్నూలులో విశేష స్పందన లభించింది. జిల్లాలోని బానకచర్ల, పోతిరెడ్డిపాడు వద్దకు పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. రాయలసీమలో మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణ పనులు, సాగునీటి సాధన కోసం విపక్ష నేత హోదాలో జగన్ జరిపే పోరాటానికి మద్దతుగా నిలిచి సంఘటితంగా ఉద్యమిస్తామని రైతులు ఉద్ఘాటించారు. గత 3 రోజులుగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో సాగిన ఈ యాత్ర శుక్రవారం రాత్రి 10 గంటలకు హంద్రీనీవా దగ్గర విజయవంతంగా ముగిసింది.
మూడో రోజు ఇలా..
యాత్రలో మూడో రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పెదదోర్నాల నుంచి బయలుదేరారు. నల్లగుంట్ల గ్రామంలో వయోవృద్ధుడు అనంతయ్య, యువతి వెంకటమ్మలతో సంభాషించిన జగన్.. గ్రామంలోని వసతులు, వారికి అందుతున్న పింఛన్లపై ప్రశ్నించారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధాపురం చేరుకుని అక్కడి చెరువును పరిశీలించి మహిళలతో మాట్లాడారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆత్మకూరు చేరుకుని మండుటెండలో సైతం తనకోసం ఎదురు చూస్తున్న వందల మంది ముస్లిం పెద్దల కోరిక మేరకు బస్సు దిగి అక్కడే ఉన్న దివంగత వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు.
బానకచర్లలో ఇరిగేషన్ ఇంజినీర్లతో..
మధ్యాహ్నం 3 గంటలకు బానకచర్ల క్రస్ట్‌గేట్లున్న ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న తెలుగు గంగ లింక్ చానల్, కేసీ కెనాల్, ఎస్‌ఆర్‌బీసీ రెగ్యులేటర్లను పరిశీలించారు. రిటైర్డ్ ఈఎన్సీ ప్రభాకరరావు, ప్రస్తుత డీఈఈ శివరామకృష్ణలతో జగన్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తనతో పాటున్న 40 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు రాయలసీమ ప్రాజెక్టుల గురించి వివరించారు. ప్రాజెక్టు స్థలంలో ఏర్పాటు చేసిన రచ్చబండ సభలో జగన్.. రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
వేంపెంటకు పార్టీ అండ..
ర్యాంక్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల వల్ల తాము తీవ్ర భయాందోళనలకు గురవుతున్నామని, నిర్మాణాన్ని వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ వేంపెంట గ్రామానికి చెందిన 200 మంది రైతులు, మహిళలు బానకచర్ల దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరి దగ్గరకెళ్లిన జగన్.. ప్రాజెక్టు వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జాగృత యాత్ర..: రాత్రి 8.40 గంటలకు నందికొట్కూరు మండలం మల్యాల పరిధిలోని హంద్రీనీవా ప్రాజెక్టు ప్రాంతాన్ని జగన్ సందర్శించారు. అక్కడే వేచి ఉన్న రైతులతో మాట్లాడారు. కోస్తా, రాయలసీమల్లో సాగిన జగన్ ప్రాజెక్టుల యాత్ర అటు ఎమ్మెల్యేలు, ఇటు రైతులను చైతన్యపరిచే జాగృత యాత్రగా ముగిసింది. పార్టీ శాసనసభ్యులతో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న మైసూరా ప్రసంగం
బానకచర్ల ప్రాజెక్టు వద్ద మాజీ ఎంపీ, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. సామెతలు, పిట్టకథలతో సాగిన ఆయన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. వైఎస్ జగన్ తన తండ్రి దివంగత నేత వైఎస్‌ఆర్ పేరు ప్రస్తావించిన ప్రతిసారీ పార్టీ అభిమానులు, రైతులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు.