
పునర్విభజనపై ప్రధాని మోదీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ
అలాగైతేనే అన్ని రాష్ట్రాలకు లోక్‌సభలో సమాన ప్రాతినిధ్యం
ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం
జనాభా నియంత్రణను నిజాయితీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ ప్రక్రియ శిక్ష కాకూడదు
దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని డీలిమిటేషన్.. ఈ మేరకు కసరత్తు చేస్తామని హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు
ఆ హామీ అమలు చేయాలంటే రాజ్యాంగంలోని 81(2)(ఏ) అధికరణను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలి
దీని వల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి
లోక్‌సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అంశం ఉత్పన్నం కాదు
కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం, ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలను డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం
దేశ రాజకీయ, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నందున ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
ప్రధానిగా మీ నాయకత్వం, మార్గ నిర్దేశం చాలా ముఖ్యం
మీరు ఇచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుంది
ప్రధానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలని.. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి( YS Jagan Mohan Reddy) వివరించారు. జాతీయ ప్రాధాన్యతగా జనాభా నియంత్రణను నిజాయితీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ప్రక్రియ శిక్షగా మారకూడదని స్పష్టంచేశారు.
దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ అమలుకు అడ్డంకిగా మారిన రాజ్యాంగంలోని 81(2)(ఏ) అధికరణ(ఆర్టికల్)ను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. దీనివల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయని, లోక్‌సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అంశం ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వైఎస్ జగన్ శుక్రవారం లేఖ రాశారు.
శనివారం మీడియాకు విడుదల చేశారు. కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతోపాటు ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలను డీలిమిటేషన్ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున, ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని మోదీని కోరారు.
ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గ నిర్దేశం చాలా ముఖ్యమని.. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుందని ప్రధానికి వైఎస్ జగన్ వివరించారు. లోక్‌సభలో ఇప్పుడున్న సీట్ల పరంగా ఆయా రాష్ట్రాలకు ఉన్న వాటాను కుదించకుండా పునర్విభజన (డీలిమిటేషన్) కసరత్తు చేపట్టాలని కోరారు. ఆ లేఖలో ఇంకా ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకూడదు
రాజ్యాంగంలో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కానీ.. దీనికి ముందుగా 2021లో చేపట్టాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. 2026 నాటికి జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయడానికి ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇది జరిగిన వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందన్న అంశం అనేక రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ద్వారా తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జనాభా నియంత్రణను నిజాయితీగా చేయడం వల్లే..
జనాభా నియంత్రణ కోసం వివిధ రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. అయితే వాటి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. దీని వల్ల జనాభా పెరుగుదల వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంది. దేశ వ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు. అసమతుల్యత ఉంది. దీని వల్ల డీలిమిటేషన్ అంశం విస్తృత స్థాయిలో ఆందోళనకు దారి తీస్తోంది. 42వ.. 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపును నిలిపేశారు.
కాలక్రమేణా అన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణ కసరత్తులో భాగంగా ఒకే స్థాయిలో ఫలితాలు సాధిస్తాయని భావించి ఈ సీట్ల కేటాయింపును నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటికి అనుకున్న స్థాయికి చేరుకుంటుందని భావించారు. కానీ, 2011 జనాభా లెక్కల గణాకాంలను చూస్తే.. దశాబ్దాల తరబడి జనాభా వృద్ధి, దాని అంచనాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవని తేలింది. 1971, 2011 మధ్య 40 సంవత్సరాల్లో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది.
గత 15 సంవత్సరాల్లో జనాభా మరింత తగ్గిందని మేం నమ్ముతున్నాం. జనాభా నియంత్రణను జాతీయ ప్రాధాన్యతగా తీసుకున్నందున, దక్షిణాది రాష్ట్రాలు నిజాయితీగా తమ విధానాలను అమలు చేయడం వల్ల ఈ వాటా తగ్గింది. 1971 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.80 శాతం అయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం 20.88 శాతంగా ఉంది.
అపోహలు, భయాలు తొలగించండి
రాష్ట్రాల్లో ఇప్పుడున్న జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే దేశ విధానాల రూపకల్పన సహా శాసన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
అయితే ఈ హామీని అమలు చేయాలంటే రాజ్యాంగ పరంగా చేయాల్సిన సడలింపును కూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 (2) (ఎ) జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరగాలని పేర్కొంది. దీని ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియలో ముందుకు వెళ్తే ఈ నిబంధన వల్ల హోంమంత్రి అమిత్‌షా ఇచ్చిన హామీని అమలు చేయడంలో అడ్డంకులు ఏర్పడతాయి.
అందువల్ల దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపుపై రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి, ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే అంశం ఉత్పన్నం కాదు. డీలిమిటేషన్ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గనిర్దేశం చాలా ముఖ్యం. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుంది.
డీఎంకే నాయకులకు లేఖ ప్రతి
డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష కమిటీ సమావేశం శనివారం చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశం నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. ఆయన ప్రధాని మోదీకి రాసిన లేఖ ప్రతిని
ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి డీఎంకే నాయకులకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment