హోదా హామీ అమలు కాలేదు  | YS Jagan Comments On Special Status at an all-party meeting | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హోదా హామీ అమలు కాలేదు 

Published Thu, Jun 20 2019 4:13 AM | Last Updated on Thu, Jun 20 2019 1:36 PM

YS Jagan Comments On Special Status at an all-party meeting - Sakshi

బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ తదితరులు

పార్లమెంట్‌ను నేను ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణిస్తాను.లోక్‌సభలో 22 మంది సభ్యులతో కూడిన నాలుగో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా నేనొక మౌలిక ప్రశ్నను మీ ముందుంచుతున్నా. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు 2014, ఫిబ్రవరిలో ముందస్తు షరతుగా నూతన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పార్లమెంట్‌ స్పష్టమైన హామీ ఇచ్చింది. దీన్ని ఐదేళ్లయినా నెరవేర్చకపోతే ప్రజాస్వామ్య దేవాలయంగా కొలుస్తున్న పార్లమెంట్‌ను ప్రజలు ఇంకా ఎంతకాలం విశ్వసిస్తారు?
– సీఎం వైఎస్‌ జగన్
 
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కాలేదని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఐదు అంశాల ఎజెండాతో ప్రధాని నేతృత్వంలో బుధవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌ మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు మార్గాలు, ఒకే దేశం–ఒకే ఎన్నిక, 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి నవభారత నిర్మాణం, మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆకాంక్ష (వెనుకబడిన) జిల్లాల అభివృద్ధి అనే ఐదు అంశాలు ఎజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ అఖిలపక్ష భేటీకి పలు పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎజెండాలోని అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు మద్దతు పలికారు. అలాగే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు రాజ్యాంగంలో పదో షెడ్యూలును, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించారు. మహాత్ముడి 150వ జయంతిని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో విద్యా రంగంలో, ఆరోగ్య రంగంలో పటిష్ట పథకాలు ప్రకటించాలని కోరారు. సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఇలా సాగింది..  

‘పార్లమెంటరీ విలువలు, సంప్రదాయాలపై నాకు అపార గౌరవం, భక్తి ఉన్నాయి. పార్లమెంట్‌ను నేను ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణిస్తాను. లోక్‌సభలో 22 మంది సభ్యులతో కూడిన నాలుగో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా నేనొక మౌలిక ప్రశ్నను మీ ముందుంచుతున్నా. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు 2014, ఫిబ్రవరిలో ముందస్తు షరతుగా నూతన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పార్లమెంట్‌ స్పష్టమైన హామీ ఇచ్చింది. దీన్ని ఐదేళ్లయినా నెరవేర్చకపోతే ప్రజాస్వామ్య దేవాలయంగా కొలుస్తున్న పార్లమెంట్‌ను ప్రజలు ఇంకా ఎంతకాలం విశ్వసిస్తారు? మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించగల సామర్థ్యం ఉండి.. ఆ విభజనకు ముందస్తు షరతుగా విధించిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చగలిగే సామర్థ్యం లేకపోవడాన్ని పార్లమెంట్‌ ఎలా సమర్థించుకుంటుంది? ఇది ఏరకమైన న్యాయం? ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలంటే, గౌరవాన్ని పొందాలంటే పార్లమెంట్‌ ఇచ్చిన ప్రతి హామీని నిర్ణీత వ్యవధిలో, తూచా తప్పకుండా అమలు చేయడం తప్పనిసరి. అప్పుడే బాధిత పార్టీలు సభలో ఆందోళన చేయడం ఆపుతాయి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. 

ప్రధాని నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు 

ఫిరాయింపులపై పటిష్ట చర్యలు ఉండాలి 
‘రాజ్యాంగంలోని పదో షెడ్యూలు అమలులో పటిష్ట చర్యలు ఉండాల్సిన ఆవశ్యకతను మీ ముందుకు తెస్తున్నాను. ఈ అంశాన్ని మీకు తెలిపేందుకు వీలుగా కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తెస్తున్నా. గత లోక్‌సభకు మా పార్టీ నుంచి గెలిచిన వారిలో ముగ్గురు ఎంపీలు టీడీపీలోకి ఫిరాయించడమే కాకుండా బహిరంగంగా వారి సమావేశాల్లో, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే గత అసెంబ్లీలో మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ తన అవినీతి, నల్లధనం ఆశ చూపి ఎరవేసింది. వారిలో కొందరిని మంత్రులుగా కూడా చేసి అధికారాన్ని దుర్వినియోగపరిచింది.. కానీ ఈ రెండు కేసుల్లో ఏ ఒక్క ప్రజాప్రతినిధిపైన రెండు సభల సభాపతులు అనర్హత వేటు వేయలేదు.

ఇది ఫిరాయింపు నిరోధక చట్టాన్ని పరిహసించడమే కాదు.. ప్రజా తీర్పును కూడా పరిహసించడమేనన్న అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తారని నేను విశ్వసిస్తున్నా. అందువల్ల పార్లమెంట్‌కు, శాసనసభలకు ఎన్నికైన సభ్యుల ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్లను ప్రిసైడింగ్‌ అధికారి 90 రోజుల్లో పరిష్కరించాలని, ఇందుకు వీలుగా పదో షెడ్యూలులో తగిన నిబంధనను చేర్చాలని ప్రతిపాదిస్తున్నా. అలాగే ఇతర పార్టీల నుంచి రాజీనామా చేయకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్న రాజకీయ పార్టీలను ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అనర్హత వేటు వేసేందుకు వీలుగా ప్రజాప్రాతినిధ్య చట్టంలో కూడా ఒక నిబంధన చేర్చాలి’ అని జగన్‌ చెప్పారు. ‘ఇవి పాటించనప్పుడు బాధిత పార్టీలు సభలో ఆందోళన చేయడం తప్ప ఏం చేయగలవు? అందువల్ల సభ మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు, అన్నింటికంటే ముందుగా పార్లమెంట్‌ విశ్వసనీయతను పెంచేందుకు వీలుగా ఈ అంశాలను ఇక ఏ మాత్రం జాప్యం లేకుండా పరిష్కరించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.  

విద్య, ఆరోగ్య రంగాల వృద్ధికి పటిష్ట పథకాలు తీసుకురండి 
‘నేటి ఎజెండాలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పటిష్ట కార్యక్రమాలను ప్రకటించాలని ప్రధానిని కోరుతున్నా. ముఖ్యంగా జాతీయస్థాయిలో విద్యారంగంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో(జీఈఆర్‌) వృద్ధి చేసేందుకు, వైద్యం కోసం వెచ్చించాల్సిన ఖర్చును తగ్గించడానికి వీలుగా పటిష్ట కార్యక్రమాలను ప్రకటించాలి. బ్రిక్స్‌ దేశాలతో పోల్చితే ఉన్నత విద్యారంగంలో 25 శాతంతో మనదేశం రెండో అత్యల్ప జీఈఆర్‌ కలిగి ఉంది. ఆర్థిక స్థిరత్వం లేక, పేదరికం కారణంగా చాలా మంది పిల్లలు ఉన్నత విద్యకు దూరంగా ఉండిపోతున్నారు. బ్రిక్స్‌ దేశాల్లో రష్యా 81 శాతం జీఈఆర్‌ కలిగి ఉంది. ఆ తర్వాత బ్రెజిల్‌ 50 శాతం, చైనా 48 శాతం, దక్షిణాఫ్రికా 21 శాతం కలిగి ఉంది. అలాగే విద్యా రంగంలో ప్రభుత్వ వ్యయం అత్యల్పంగా జీడీపీలో 3.5 శాతం మాత్రమే ఉంది. మిగిలిన బ్రిక్స్‌ దేశాల్లో ఇదే అత్యల్పం. బ్రెజిల్‌లో 6.20 శాతం ఉండగా, దక్షిణాఫ్రికాలో 6.10 శాతం, చైనాలో 4.20 శాతం, రష్యాలో 3.80 శాతంగా ఉంది. దేశంలో ఆరోగ్య రంగాన్ని వృద్ధి చేసేందుకు ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలు ప్రారంభించిన ప్రధాని దూరదృష్టిని అభినందిస్తున్నా. అయినప్పటికీ మనం ఈ దిశగా చాలా ప్రయాణం చేయాల్సి ఉంది.
అఖిలపక్ష సమావేశానికి వస్తున్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తదితరులు 

ఆరోగ్య రంగానికి మన దేశంలో జీడీపీలో కేవలం 1.3 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాం. బ్రిక్స్‌ దేశాల్లో ఇదే అత్యల్పం. దక్షిణాఫ్రికాలో ఇది 8.80 శాతంగా, బ్రెజిల్‌లో 8.30 శాతంగా, రష్యాలో 7.10 శాతంగా, చైనాలో 5 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో ఆరోగ్య రంగంలో చేస్తున్న మొత్తం వ్యయంలో వైద్యం కోసం దేశ ప్రజలు చేస్తున్న వ్యయమే 65 శాతంగా ఉంది. బ్రిక్స్‌ దేశాల్లో ఇదే అత్యధికం. బ్రెజిల్‌లో 44 శాతంగా ఉండగా, రష్యాలో 41 శాతం, చైనాలో 34 శాతం, దక్షిణాఫ్రికాలో 8 శాతంగా ఉంది. అందువల్ల వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధిస్తున్న మనదేశానికి జాతీయ స్థాయిలో జీఈఆర్‌ని వృద్ధి చేసే పథకాలు, ప్రజల వైద్య ఖర్చును తగ్గించగలిగే పథకాలను ప్రధాని ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా బ్రిక్స్‌ దేశాల్లో ఉత్తమ దేశంగా రాణించేలా తోడ్పడాలని కోరుతున్నా’ అని అన్నారు. 

ఒకే దేశం.. ఒకే ఎన్నికపై.. 
‘‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ప్రతిపాదన ఒక సాహసోపేతమైన చొరవ. మా రాష్ట్రంలో పార్లమెంట్‌కు, రాష్ట్ర శాసనసభకు 1999 నుంచి ఒకేసారి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలో మేం 20 ఏళ్లుగా భాగస్వాములం. ఒకే దేశం–ఒకే ఎన్నిక సూత్రాన్ని ప్రాథమికంగా చూస్తే ఎన్నికల వ్యయం తగ్గుతుంది. ఐదేళ్లకు ఒకేసారి ఎన్నిక జరగడం వల్ల ఈ ప్రక్రియ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచుతుంది. పాలనలో అంతరాయం తగ్గుతుంది. పైగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వేరే కాలపరిమితితో ఉన్నప్పుడు ఆ సమయంలో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వప్రయోజనాల కోసం అధికార, పోలీస్‌ యంత్రాంగాన్ని దుర్వినియోగపరచడానికి ఆస్కారం ఉంటుంది.
ఎంపీలను పలకరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఆ రకంగా స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియకు విఘాతం ఏర్పడుతుంది. అలాగే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే అధికారంలో ఉన్న పార్టీకి ఆ రాష్ట్రంలోని అధికారులు, పోలీసు యంత్రాంగంపై నియంత్రణ ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల నేను ఒకే దేశం–ఒకే ఎన్నిక ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నా. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల కోసం, విస్తృత భాగస్వామ్యం కలిగిన ప్రజాస్వామ్యం కోసం మద్దతు ఇస్తున్నా. అయితే వివిధ రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి విభిన్న సమయాల్లో ఉంది. ప్రధానమంత్రి ఈ ప్రతిపాదనను అమలులోకి తెచ్చేందుకు రాజ్యాంగంలోని సమాఖ్య స్వరూపం స్ఫూర్తితో ఒక మెకానిజాన్ని రూపొందిస్తారని విశ్వసిస్తున్నా’’ అని జగన్‌ చెప్పారు. అలాగే ఆకాంక్ష (వెనుకబడిన) జిల్లాల అభివృద్ధికి సంబంధించి ఈ నెల 15న జరిగిన నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడించిన వ్యూహానికి మద్దతు పలుకుతున్నానని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement