Andhra CM Jagan Meets PM Narendra Modi Seeks Rs.10000 Crores For Polavaram Project - Sakshi
Sakshi News home page

రూ.10,000 కోట్లతో పోలవరం పరుగులు

Published Tue, Aug 23 2022 3:12 AM | Last Updated on Tue, Aug 23 2022 9:11 AM

CM Jagan meets PM Narendra Modi Seeks 10000 Crores for Polavaram - Sakshi

సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. పనుల్లో మరింత వేగం పెంచేందుకు వీలుగా అడహక్‌గా రూ.10 వేల కోట్లు ఇవ్వాలని విన్నవించారు. కాంపోనెంట్‌ వారీగా రీయింబర్స్‌ విధానంతో నిర్మాణ పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతున్న దృష్ట్యా దీనికి స్వస్తి చెప్పాలని కోరారు. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించిన మాదిరిగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు చేస్తున్న పనులకు వెంటనే రీయింబర్స్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్ర విభజన సమస్యలు, పెండింగ్‌ అంశాలను విన్నవించేందుకు ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా పోలవరం, రిసోర్స్‌ గ్యాప్‌ నిధులు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధత, విభజన హామీల అమలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రధానితో చర్చించి వినతిపత్రం అందజేశారు.

రూ.55,548.87 కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించండి
పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా సొంతంగా రూ.2,900 కోట్లు ఖర్చు చేసిందని, ఈ మొత్తాన్ని వెంటనే రీయింబర్స్‌ చేయాలని సీఎం జగన్‌ కోరారు. సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) నిర్ధారించిన మేరకు ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్‌ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డీబీటీ పద్ధతి ద్వారా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితులకు పరిహారాన్ని అందించాలన్నారు. 
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం జగన్‌   

రీసోర్స్‌ గ్యాప్‌ నిధులు మంజూరు చేయాలి..
రీసోర్స్‌ గ్యాప్‌ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు ‡చేయాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. 2014–15కి సంబంధించి బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు తదితరాల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఈ నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధీకరణ లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రధాని దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో 2.68 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ అందుతుండగా ఇందులో కేంద్రం ఇస్తున్న దానికంటే అదనంగా దాదాపు 56 లక్షల మందికి రాష్ట్రమే రేషన్‌ వ్యయాన్ని భరిస్తోందని తెలిపారు.

ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారమని, ఏపీకి నిర్దేశించిన కేటాయింపులను పునఃపరిశీలించాలని నీతిఆయోగ్‌ ఇప్పటికే సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్‌ సమయంలో ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద కేంద్రం ఇస్తున్న దానికంటే అదనంగా 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేయడంతో సుమారు రూ.5,527.63 కోట్ల అదనపు భారాన్ని మోయాల్సి వచ్చిందని వివరించారు. ప్రస్తుతం సైతం పథకాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉన్నందున జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారులపై పునఃపరిశీలన చేయాలని కోరారు. 

ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీవారి చిత్రపటం అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

వీటిని పరిష్కరించండి..
► తెలంగాణ డిస్కంల నుంచి రూ.6,756 కోట్ల విద్యుత్తు బకాయిలు రావాల్సి ఉంది. ఎనిమిదేళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగానే ఉంది. ఈ బకాయిలు ఇప్పిస్తే కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు ఒడ్డున పడతాయి. ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించేందుకు మార్గం సుగమమం అవుతుంది. 
► రాష్ట్ర విభజనలో హేతుబద్ధత లేదు. దీనివల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలి. ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను నెరవేర్చాలి. 
► పారిశ్రామిక రంగం వృద్ధి, ఉద్యోగాల కల్పన, కేంద్రం నుంచి గ్రాంట్లు, పన్ను రాయితీలు తదితర ప్రయోజనాలు ప్రత్యేక హోదా ద్వారానే దక్కుతాయి. తద్వారా రాష్ట్రంపై భారం తగ్గుతుంది. 
► రాష్ట్రంలో 26 జిల్లాలకుగానూ కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. 12 కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉంది. వీటిని మంజూరు చేయాలి.
► కడపలో సమీకృత స్టీల్‌ ప్లాంట్‌కోసం ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. 
► ఏపీఎండీసీకి బీచ్‌శాండ్‌ మినరల్‌ ఏరియాలను కేటాయించాలి. 14 ఏరియాలకు  కేటాయింపు అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. 
► గత సర్కారు హయాంలో రాష్ట్రంలో నిర్దేశిత పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. ఇప్పుడు మూడేళ్లలో రూ.17,923 కోట్లకుపైగా రుణ పరిమితిలో కోత విధించారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నవి రుణాలే కానీ గ్రాంట్లు కావు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రుణాల పరిమితిని సవరించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement