సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలు, విభజన సమస్యలపై చర్చించేందుకు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఉదయం పార్లమెంట్‌లోని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో పలు అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
పోలవరంలో కాంపొనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేతతోపాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తి చేసేందుకు రూ.12,911 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న దృష్ట్యా తక్షణమే దీనిపై దృష్టి పెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
పోలవరం మొదటి విడత పూర్తికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, దీనికి సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే జలశక్తి శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నందున సత్వరమే పరిశీలించి ఆమోదం తెలపాలని అభ్యర్థించారు. పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మార్గాని భరత్, రెడ్డప్ప, గోరంట్ల మాధవ్, వంగా గీత, గురుమూర్తి, సత్యవతి, మాధవి, చింతా అనురాధ, ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు వెంటరాగా ప్రధాని కార్యాలయంలోకి వెళ్లిన సీఎం జగన్ సుమారు గంట పాటు సమావేశమయ్యారు.
పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సీఎం వైఎస్ జగన్, ఎంపీలు
ప్రధాని దృష్టికి తెచ్చిన ఇతర అంశాలివీ..
♦ ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇతర విభజన హామీలన్నీ అమలు చేయాలి. రాష్ట్ర ఆరి్థక పురోగతికి ప్రత్యేక హోదా చాలా అవసరం. పెట్టుబడులు రావడమే కాకుండా మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కేందుకు ప్రత్యేక హోదా కీలకం.
♦ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా కొత్తగా 17 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నాం. ఇప్పటికే కొన్ని కొత్త వైద్య కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. మిగతా కాలేజీల ఏర్పాటుకు తగిన సహాయ సహకారాలు అందించాలి.
♦ విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో అనుసంధానిస్తూ భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖ పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల రహదారి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలి.
♦ విభజన చట్టంలో పొందుపరచిన విశాఖ– కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగళూరు వరకూ పొడిగించాలి. పరిశీలన పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు సాకారమయ్యేలా చూడాలి. కడప–పులివెందుల–ముదిగుబ్బ– సత్యసాయి ప్రశాంతి నిలయం–హిందూపూర్ కొత్త రైల్వేలైన్‌ను దీంట్లో భాగంగా చేపట్టాలి. ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుంది.
♦ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు త్వరగా ఆమోదం తెలపాలి.
♦ 2014 జూన్ నుంచి మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసింది. దీనికి సంబంధించి రూ.7,230 కోట్ల బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వీటిని వెంటనే చెల్లించేలా చూడాలి.
సీతారామన్‌తో సీఎం సమావేశం
రాష్ట్రాభివృద్ధికి చేయూత అందిస్తూ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం జగన్ కోరారు. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం సమావేశమయ్యారు. నిధులు, పెండింగ్ అంశాలపై అరగంటకు పైగా చర్చించారు. ప్రధానికి నివేదించిన అంశాలను ఆర్థిక మంత్రి దృష్టికి తెచ్చారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment