ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విభజన హామీలు సహా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రత చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, నూతన వైద్య కళాశాలలకు ఆర్థిక సాయం తదితర అంశాలపై ప్రధానితో బుధవారం సుమారు గంటా ఇరవై నిమిషాలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విన్నవించారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా ఎంతో దోహద పడుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని, సుదీర్ఘ కాలంగా ఇది పెండింగ్‌లో ఉందని ప్రధానికి గుర్తు చేశారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి తొలి దశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతాయని, ఇది కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉందని వివరించారు.
తొలి దశ నిర్మాణానికి, కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే రూ.1,2911.15 కోట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే తొలి దశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ, పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని చెప్పారు.
ఇది ఇస్తేనే తొలి దశ పూర్తవుతుందని వివరించారు. మొత్తంగా పోలవరం తొలి దశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు ఇచ్చేలా జల శక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తన సొంత నిధులు రూ.1,310.15 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలని, ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి ఆయా అంశాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లిన అంశాల వివరాలు ఇలా ఉన్నాయి.
సుదీర్ఘ కాలంగా బకాయిలు
► 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీ జెన్‌కో ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అవి త్వరగా వచ్చేలా చూడాలి.
► జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించడంతో ఏపీ కన్నా ఆర్థికంగా ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు అధిక శాతం కవరేజీ ఉంది. ఈ పథకం అమలుకు ఎంచుకున్న ప్రమాణాల్లో హేతుబద్ధత లేదని నీతి ఆయోగ్ కూడా నిర్ధారించింది.
► హేతుబద్ధత లేనందున రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కడం లేదు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోంది. ప్రతినెలా వినియోగించకుండా దాదాపు లక్ష టన్నుల బియ్యం కేంద్రం వద్ద ఉంటున్నాయి. ఇందులో 77 వేల టన్నులు రాష్ట్రానికి ఇస్తే సరిపోతుంది. దీనిపై మీరు (ప్రధాని) సత్వరమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
► ఏపీ పౌర సరఫరాల శాఖకు దీర్ఘకాలంగా (2012–13 నుంచి 2017–18 వరకు) పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరు చేయాలి.
విభజన హామీలు నెరవేర్చండి
► రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రత్యేక హోదా సహా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా దోహద పడటం ద్వారా రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తుంది. అందువల్ల ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి.
► వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్రం హామీ ఇచ్చింది. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో జీవనోపాధి మెరుగు పడడానికి, జీవన ప్రమాణాలు పెంచడానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరం. స్టీల్ ప్లాంట్‌కు అత్యంత అవసరమైన ముడి ఖనిజం కోసం మూడు గనులను ఏపీఎండీసీకి కేటాయించేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం.
► రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతి జిల్లాకు కనీసంగా 18 లక్షల జనాభా ఉంది. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కళాశాలల నిర్మాణాలు చేపట్టాం. వీటికి తగిన ఆర్థిక సహాయం చేయాలి.
► సీఎం వైఎస్ జగన్.. ప్రధానితో భేటీకి ముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సుమారు 45 నిమిషాలపాటు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పలు అంశాలపై చర్చించి, రాష్ట్రానికి సహకరించాలని కోరారు. కాగా, ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో సీఎంకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, రెడ్డెప్ప, ఆర్.కృష్ణయ్య, తలారి రంగయ్య, చింతా అనూరాధ తదితరులు ఘన స్వాగతం పలికారు. బుధవారం రాత్రి పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి బయల్దేరారు.
Comments
Please login to add a commentAdd a comment