పెండింగ్‌.. పరిష్కరించండి | CM YS Jagan report on various issues during his meeting with PM Modi | Sakshi
Sakshi News home page

పెండింగ్‌.. పరిష్కరించండి

Published Tue, Jan 4 2022 3:29 AM | Last Updated on Tue, Jan 4 2022 8:25 AM

CM YS Jagan report on various issues during his meeting with PM Modi - Sakshi

సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం సవరించిన అంచనా వ్యయాలను తక్షణమే ఆమోదించేలా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు ఖర్చులో అధికభాగం భూసేకరణ చట్టం అమలుకే వ్యయం చేయాల్సి రావటం, ముంపు ప్రాంతాల కుటుంబాలకు ప్యాకేజీలు విస్తరించాల్సిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంపై పెనుభారం పడుతుందన్నారు. సవరించిన అంచనాలకు కేంద్ర సంస్థలే ఆమోదం తెలిపినప్పటికీ ఆ మేరకు నిధుల విడుదలకు కేంద్రం తిరస్కరించడం ప్రాజెక్టు పనులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ప్రధాని దృష్టికి తెచ్చారు. 2017–18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా ఆమోదించి నిధులివ్వాలని కోరారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్‌ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అనంతరం ప్రధాని మోదీతో ఆయన నివాసంలో గంటకుపైగా సమావేశమయ్యారు. ఏపీలో రెవెన్యూ లోటు, పెండింగ్‌ నిధులు, విద్యుత్‌ బకాయిలు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు, భోగాపురం విమానాశ్రయం, కడప స్టీల్‌ ప్లాంట్‌ తదితర అంశాలపై చర్చించి వినతిపత్రాలు అందజేశారు. ఆ వివరాలివీ..

విభజన పర్యవసనాలతో ఆర్ధిక ప్రగతికి దెబ్బ..
రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఏపీకి కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా ఏపీ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఈ  గణాంకాలే నిదర్శనం. భౌగోళికంగా తెలంగాణ కంటే పెద్దదైన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అవసరాలను తీర్చి సరైన సేవలు అందించాలంటే అంతే స్థాయిలో వ్యయం చేయాల్సి ఉంటుంది. విభజన వల్ల రాజధానిని, మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. అందుకే రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీతోపాటు పలు హామీలిచ్చారు. వాటిని అమలు చేస్తే చాలావరకు ఊరట లభిస్తుంది. కానీ ఇప్పటికీ చాలా హామీలు నెరవేరలేదు.

ఇరిగేషన్‌కే నిధులనడం సరికాదు..
2013 భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు గణనీయంగా పెరిగింది. 2014 ఏప్రిల్‌ 1 అంచనాల మేరకు పోలవరానికి నిధులిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో తెలిపింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీనివల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది. విభజన చట్టం సెక్షన్‌ 90 స్ఫూర్తికి ఇది పూర్తి విరుద్ధం. ఏ ప్రాజెక్టులోనైనా రెండు రకాల అంశాలుంటాయి. ఒకటి ఇరిగేషన్‌ కాగా రెండోది విద్యుత్‌ ఉత్పత్తి. తాగునీరు ఇరిగేషన్‌లో అంతర్భాగం. జాతీయ ప్రాజెక్టుల నిర్మాణంలో ఇప్పటి వరకూ దీన్నే పాటిస్తున్నారు. ప్రాజెక్టు ఆలస్యమైతే ఖర్చు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. రూ.2,100 కోట్ల పోలవరం పెండింగ్‌ బిల్లులనూ మంజూరు చేయండి.
ప్రధాని మోదీకి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం జగన్‌ 

తెలంగాణ నుంచి విద్యుత్తు బకాయిలు.. 
విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకు ఏపీ జెన్‌కో విద్యుత్‌ను అందించింది. దీనికి సంబంధించి ఏపీకి రూ.6,284 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఏపీ విద్యుత్‌ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ బిల్లులను చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. 

సంపన్న రాష్ట్రాల్లో రేషన్‌ లబ్ధిదారులు అధికం
జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఆర్థికంగా ఎదిగిన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో పీడీఎస్‌ లబ్ధిదారులు ఏపీలో కన్నా కనీసం 10 శాతం ఎక్కువగా ఉన్నారు. ఏపీలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్‌ ద్వారా రేషన్‌ అందిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపుతోంది. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన జరిపి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలని కోరుతున్నా.

కోవిడ్‌తో సంక్లిష్ట పరిస్థితులు..
2019–20 ఆర్థిక మందగమనం ఏపీపై తీవ్ర ప్రభావం చూపింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటాగా రూ.34,833 కోట్లు రావాల్సి ఉండగా రూ.28,242 కోట్లు మాత్రమే వచ్చాయి. 2020–21లో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. కోవిడ్‌ మహమ్మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసింది. కేంద్ర పన్నుల్లో రూ.7,780 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ఆదాయ వనరుల నుంచి రావాల్సిన రూ.7 వేల కోట్లు కూడా రాకుండా పోయాయి. మరోవైపు కోవిడ్‌ నియంత్రణ చర్యలు, ప్రజారోగ్య పరిరక్షణకు దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్ర ప్రజలు నష్టపోయిన ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ నష్టం రూ.వేల కోట్లలో ఉంటుంది. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల చేతికి నేరుగా డబ్బులు అందచేసి (డీబీటీ) సంక్షోభ సమయంలో ఆదుకున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ ææనిర్మాణం తదితర రంగాల్లో వివిధ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్విఘ్నంగా అమలు చేశాం. ఆర్థిక వ్యవస్థ, ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు 2020–2021లో దేశ జీడీపీలో 11 శాతం మేర కేంద్రం కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. 

గత సర్కారు హయాంలోనే అధికంగా అప్పులు 
2021–22 ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం గరిష్ట రుణ పరిమితిని రూ.42,472 కోట్లుగా నిర్ధారించగా కేంద్ర ఆర్థిక శాఖ దీన్ని రూ.17,923.24 కోట్లకు తగ్గిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. గత సర్కారు హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణలోకి తీసుకుని రుణ పరిమితిని సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా తప్పు లేకుండా రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. రుణపరిమితిలో కోతను మూడేళ్లకు విస్తరించాలన్న విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. మేం తీసుకుంటున్నవి అప్పులే, గ్రాంట్లు కాదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాం. తీసుకుంటున్న రుణాలకు  సకాలంలో చెల్లింపులు చేస్తున్నాం. గత సర్కారు హయాంలో అధికంగా అప్పులు చేశారనే కారణంతో ఇప్పుడు కోత విధించడం రాష్ట ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాల్సిన తరుణంలో ఇలాంటి పరిమితులు సరికాదు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందేందుకు వెసులుబాటు కల్పించాలి. 
– భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి సైట్‌ క్లియరెన్స్‌ అప్రూవల్‌ను రెన్యువల్‌ చేయాలి. 

కడప స్టీల్‌ ప్లాంట్‌... 
వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి మెకాన్‌ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తీర్చే స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కోసం వైఎస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు గనులు కేటాయించాలి. వేలం ప్రక్రియ వల్ల తక్కువ ఖర్చుకు గనులు దొరికే అవకాశాలు సన్నగిల్లుతాయి. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్‌గా ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించాం. ఎస్సార్‌ స్టీల్స్‌ కాంపిటేటివ్‌ బిడ్డర్‌గా ఎంపికైంది. రుణం మంజూరుకు ఎస్‌బీఐ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపింది. ఈ ప్రక్రియ వీలైనంత వేగంగా పూర్తైతే రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement