నరేంద్ర మోదీతో వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి: ఏపీ అభివృద్ధికి ఊతమివ్వండి | YS Jagan Meets PM Narendra Modi Over AP Development - Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ఊతమివ్వండి

Published Thu, Feb 13 2020 3:10 AM | Last Updated on Thu, Feb 13 2020 4:22 PM

AP CM YS Jaganmohan Reddy Meets PM Narendra Modi - Sakshi

బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీకి జ్ఞాపిక అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితుల గురించి కూలంకషంగా వివరించారు. విభజనానంతరం అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రానికి తగిన విధంగా నిధులు ఇవ్వాలని కోరారు. బుధవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గంటా నలభై నిమిషాల పాటు మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర అంశాలపై ఒక లేఖ అందిస్తూ అందులోని విషయాలన్నింటినీ స్పష్టంగా వివరించారు.

ఈ ఏడాది మార్చి 25వ తేదీ.. ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టామని తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానికి సీఎం వైఎస్‌ జగన్‌ సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు ఇవీ..

పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించండి
‘2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ, పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి సహకారం కావాలి. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,549 కోట్లు. ఇందులో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33,010 కోట్ల మేర అవసరం అవుతుంది. కేంద్ర జల వనరుల శాఖలోని సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలు రూ.55,549 కోట్లకు ఆమోదం తెలిపినా, సవరణ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలిపేలా చూడాలి. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.3,320 కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర జల వనరుల శాఖను ఆదేశించండి.
ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో చర్చిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

ప్రత్యేక హోదా కేంద్రం పరిధిలోనిదని ఆర్థిక సంఘం చెప్పింది
అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా తమ పరిధిలో లేదని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకోవచ్చని చెప్పింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం విభజన అనంతరం తొలి ఆర్థిక సంవత్సరపు  రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లు ఉన్నట్లు కాగ్‌ నిర్ధారించింది. ఇందులో ఇంకా రూ.18,969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడిషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా అమరావతి.. ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందు కోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020కి అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలి. ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం శాసన మండలి ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ.. శాసన మండలిని రద్దు చేస్తూ సిఫారసు చేసింది. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయ శాఖను ఆదేశించండి.

సీఎం ప్రధానికి విన్నవించిన మరిన్ని అంశాలు..
– ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ప్రభుత్వంలో ఏ యేడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలి. 
– కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలి. 
– రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలి. 
– కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలి.
– రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలి.
– గత ఆరేళ్లలో వెనకబడిన ఏడు జిల్లాలకు రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1,050 కోట్లు మాత్రమే ఇచ్చారు. గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవు. బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలి. అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4,000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారు.
– మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం–2019పై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement