Development of Andhra Pradesh
-
రాష్ట్రాభివృద్ధికి సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర మంత్రులను కోరారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను ఆయన సోమవారం రాత్రి వేర్వేరుగా కలుసుకుని పలు అంశాలపై చర్చించి వినతి పత్రాలను అందచేశారు. నిధులిచ్చి ఆదుకోండి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, సవరించిన పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం, రెవెన్యూ లోటు భర్తీ, రుణ పరిమితి పెంపు తదితర అంశాలను ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. విశాఖ అభివృద్ధికి భోగాపురం కీలకం.. అనంతరం పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను కలుసుకుని విమానయాన రంగం అభివృద్ధికి కేంద్రం చూపుతున్న ప్రత్యేక చొరవను సీఎం జగన్ అభినందించారు. గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అభివృద్ధికి సహకరించాలని కోరారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా (పక్కనే తూర్పు నౌకాదళ కేంద్రం ఉండడం) విశాఖలో విమానాశ్రయం విస్తరణకు అవకాశం లేనందున భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఇది ఎంతో కీలకమన్నారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత వ్యవధి మూడేళ్లలో పూర్తి చేసేలా సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. జ్యోతిరాదిత్యను కలిసిన సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నేడు గడ్కరీ, ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ! ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
Andhra Pradesh: వర్షాలు తగ్గటమే ఆలస్యం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ‘రోడ్ మ్యాప్’తో దూసుకెళ్తుండగా... ప్రతిపక్ష టీడీపీ, జనసేన రాజకీయ ఉనికి కోసం ‘రాంగ్ రూట్’లో ప్రయాణిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్కన ఇప్పటికే రోడ్ల పునరుద్ధరణ, కొత్త రహదారుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టిన తరువాత కూడా ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, శ్రమదానాల పేరుతో తమ అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా బురద జల్లేందుకు ప్రయత్నిస్తుండటం పట్ల తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి బాటలో నిబ్బరంగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇక ఇతర అంశాలేవీ లేకపోవడంతో ఆందోళనల పేరుతో ప్రజల్ని మోసగించేందుకు విపక్షాలు దుష్ప్రచారానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రారంభించి వరుసగా పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికలు, అంతకుముందు తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో దిక్కుతోచని విపక్షాలు ‘రోడ్డు’న పడినట్లు వెల్లడవుతోంది. చంద్రబాబు నాయకత్వం పట్ల టీడీపీ శ్రేణులే సందేహంలో పడగా... జనసేనను ఓ రాజకీయ పార్టీగా కూడా ప్రజలు గుర్తించకపోవడంతో ఇలాంటి ఎత్తుగడలకు దారి తీసినట్లు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్నెళ్ల క్రితమే రోడ్ల పునరుద్ధరణ, కొత్త రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించిందని, టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. స్పష్టంగా రోడ్ మ్యాప్ సెప్టెంబర్ 6వ తేదీన నిర్వహించిన సమీక్షలో రహదారులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టమైన రోడ్ మ్యాప్ నిర్దేశించారు. వర్షాలు తగ్గగానే వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. నిధుల సేకరణకు కూడా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని తగిన ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాది వేసవి నాటికి రోడ్ల పునరుద్ధరణతోపాటు కొత్త రోడ్ల నిర్మాణం పూర్తవుతుంది. విపక్షాలు ఎన్ని డ్రామాలాడినా వచ్చే వేసవి నాటికి రాష్ట్రంలో రోడ్లన్నీ తళతళలాడతాయి. తీరైన రోడ్లపై హాయైన ప్రయాణానికి మార్గం సుగమమవుతుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా రోడ్లను గాలికి వదిలేసి చివరి రెండేళ్లు ఏమాత్రం పట్టించుకోకుండా అలక్ష్యం వహించారు. అంతేకాదు.. రోడ్ల కోసం బ్యాంకు నుంచి తెచ్చిన రూ.3 వేల కోట్ల రుణాలను ‘పసుపు–కుంకుమ’ పేరుతో వెదజల్లి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. మే నెలలోనే ప్రణాళిక.. జూన్‌లో టెండర్లు రూ.2,205 కోట్లతో రహదారుల పునరుద్ధరణ, రూ.6,400 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ మే నెలలోనే ప్రణాళిక ఖరారు చేయడంతో ప్రభుత్వం జూన్‌లో టెండర్ల ప్రక్రియ చేపట్టింది. నిధుల సమీకరణ యత్నాలను విజయవంతంగా పూర్తి చేసి వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభించి వచ్చే వేసవి నాటికి పూర్తి చేసేలా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇబ్బందులున్నా వెనకడుగు లేదు.. రోడ్లు, సముద్ర మార్గం, ఎయిర్ కనెక్టివిటీలను చుక్కానిగా చేసుకుని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధృఢ సంకల్పం. ప్రధానంగా 2014 – 19 వరకు టీడీపీ హయాంలో రోడ్ల నిర్వహణను విస్మరించడం, అధికారంలో ఉన్న చివరి రెండేళ్ల పాటు పూర్తిగా గాలికొదిలేయడంతో పరిస్థితి జఠిలంగా మారిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో రహదారులకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. 2020లో కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 2021 ప్రారంభంలో కూడా కోవిడ్ రెండోవేవ్‌తో దేశం తీవ్రంగా సతమతమైంది. కోవిడ్ ప్రభావంతో ఆదాయం క్షీణించి రాష్ట్రం నిధులు సమస్య ఎదుర్కోవాల్సి వచ్చినా రోడ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ వెనుకంజ వేయలేదు. ఆర్నెళ్ల క్రితమే ఈ ఏడాది మే నెలలోనే ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి రోడ్ల పునరుద్ధరణ, కొత్త రహదారుల నిర్మాణంపై ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రంలో రూ.2,205 కోట్లతో రోడ్ల పునరుద్ధరణ, రూ.6,400 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణ ప్రణాళికలను ఆమోదించారు. ఈ క్రమంలో ఆర్ అండ్ బీ శాఖ జూన్‌లోనే టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టింది. నిధుల సేకరణకు సీఎం ప్రత్యేక చొరవ ప్రణాళిక మాత్రమే కాదు... రోడ్ల నిర్మాణానికి నిధుల సేకరణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. కౌంటర్ గ్యారంటీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సమ్మతించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో రోడ్ల పునరుద్ధరణ కోసం రూ.2 వేల కోట్ల రుణం మంజూరు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా అంగీకరించింది. ఇక మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి కొత్త రహదారుల కోసం రూ.6,400 కోట్ల రుణం అందచేసేలా ‘న్యూ డెవలప్మెంట్ బ్యాంక్(ఎన్డీబీ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా రోడ్ల నిర్మాణానికే వెచ్చించేందుకు ‘ప్రత్యేక ఫండ్ అకౌంట్’ తెరవాలని నిర్ణయించడం గమనార్హం. ఆ ఖాతా నుంచి నేరుగా కాంట్రాక్టు సంస్థలకు బిల్లులు చెల్లిస్తారు. దీంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరగదని కాంట్రాక్టు సంస్థలకు పూర్తి భరోసా కలుగుతుంది. ఇలా నిధుల సమస్య తీరిపోవడంతో సెప్టెంబర్ 6వతేదీన ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా రహదారుల అంశంపై సీఎం వైఎస్ జగన్ చర్చించారు. వర్షాలు తగ్గగానే వెంటనే పనులు ప్రారంభించి వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు. 8,212 కి.మీ. రోడ్ల పునరుద్ధరణకు బిడ్లు రాష్ట్రంలో గుంతలు పడ్డ రోడ్ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. మొత్తం 8,212 కి.మీ. మేర రోడ్ల పునరుద్ధరణకు 1,140 పనులను గుర్తించింది. అందుకోసం రూ.2,205 కోట్లతో ప్రణాళికను ఆమోదించి జూన్‌లోనే టెండర్ల ప్రక్రియ చేపట్టింది. వాటిలో ఇప్పటికే దాదాపు రూ.597.13 కోట్ల విలువైన 322 పనులకు బిడ్లు దాఖలు చేశారు. మిగిలిన రూ.1,607.87 కోట్ల పనులకు బిడ్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. నెలరోజుల్లో అన్ని పనులకు టెండర్లు ఖరారు చేసి నవంబరులో పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బి శాఖ భావిస్తోంది. వచ్చే ఏడాది మే నాటికి పనులు పూర్తి చేస్తారు. రూ.6,400 కోట్లతో 2,500 కి.మీ. కొత్త రోడ్లు 2010 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ప్రధానంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి రోడ్ల నిర్మాణాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ సమస్య పరిష్కరించి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రోడ్డు వసతి కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అందుకోసం ఏకంగా రూ.6,400 కోట్లతో 2,500 కి.మీ. మేర కొత్త రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. మొదటి దశలో రూ.3,014 కోట్లతో 1,244 కి.మీ. మేర రోడ్లు నిర్మిస్తారు. దీనికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడంతో మొత్తం 124 పనులకు టెండర్లు కూడా ఖరారు చేసి పనులు ప్రారంభించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.85.43 కోట్ల ప్రజాధనాన్ని కూడా ఆదా చేశారు. వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులను వేగవంతం చేస్తారు. ఇక రెండో దశలో రూ.3,386 కోట్లతో 1,256 కి.మీ. మేర కొత్త రోడ్ల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) పూర్తి కావచ్చింది. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపడతారు. డిసెంబరులో పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేస్తారు. రూ.3 వేల కోట్ల రుణం.. ‘పసుపు –కుంకుమ’ పాలు టీడీపీ హయాంలో 2018లో రోడ్ల నిర్మాణం కోసం తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. ఫలితంగా చాలా చోట్ల రహదారులు అధ్వాన్నంగా మారాయి. చివరి రెండేళ్ల పాటు రాష్ట్రంలోని రోడ్లను గత సర్కారు పట్టించుకోకపోవడంతో దారుణంగా తయారయ్యాయి. నిర్వహణపై బాబు సర్కారు మొద్దునిద్ర చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు రోడ్ల మరమ్మతుల అంశాన్ని గాలికొదిలేసింది. నిధులు కేటాయింపుల్లో హడావుడి చేసి విడుదల చేసే విషయంలో మాత్రం ముఖం చాటేసింది. ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులు సరిగా చేపట్టకపోవడంతో సమస్య సంక్లిష్టంగా మారింది. రోడ్లన్నీ గుంతలమయంగా మారి వాటిపై ప్రయాణం అంటేనే బెంబేలెత్తాల్సిన దుస్థితి ఏర్పడింది. -
ఏపీ అభివృద్ధే మోదీ ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, అమరావతి/సాక్షి, విజయవాడ/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం విజయవాడ వచ్చిన ఆయన ఓ ప్రైవేటు హాల్లో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. నీటి విషయంలో ఏపీకి అన్యాయం జరగనిచ్చేది లేదన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలనే కేంద్రం జోక్యం చేసుకుంటోందని, ఉభయ రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు రావడంతోనే నీటి అజమాయిషీ బాధ్యతను మోదీ ప్రభుత్వం తీసుకుందన్నారు. కృష్ణా జలాల సమస్యపై ఇద్దరు సీఎంలు సామరస్యంగా చర్చించుకోవాలన్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను వెలంపల్లి అందించారు. కిషన్‌రెడ్డి సతీమణికి దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ పట్టు వస్త్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీమ్‌లో దుర్గగుడిని చేర్చాలని కేంద్ర మంత్రికి వెలంపల్లి, వాణీమోహన్లు విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మ ఆలయాన్ని టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏపీలో 126 పర్యాటక కేంద్రాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులున్నారు. ప్రపంచ దేశాలు మనవైపు చూస్తున్నాయ్.. తిరుపతి తుడా/తిరుమల(చిత్తూరు జిల్లా): కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తితో ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయని కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి స్విమ్స్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ నాటికి వ్యాక్సినేషన్ పూర్తిచేసేలా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. పిల్లలతో సహా 130 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. అనంతరం కపిలతీర్థం సమీపంలోని ప్రకృతి ఉద్యాన వనంలోని అమరజవాన్ స్థూపం వద్ద నివాళి అర్పించారు. అమర సైనికుల సతీమణులకు, యుద్ధంలో పోరాటం చేసిన కెప్టెన్లకు భారత మాజీ సైనికుల సంఘం, వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. -
Andhra Pradesh: సంక్షేమానికి దీటుగా అభివృద్ధి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అటు సంక్షేమంతో పాటు ఇటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారనడానికి జీడీపీ గణాంకాలే నిదర్శనమని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. 2020–21లో దేశ జీడీపీ (ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకోకుండా) 2.97 శాతం క్షీణిస్తే మన రాష్ట్రంలో 1.58 శాతం వృద్ధి నమోదైందని గుర్తు చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా మంగళవారం ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి మేకపాటి విలేకరులతో మాట్లాడారు. నవరత్నాల పథకాల వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడటమే కాకుండా పాజిటివ్ వృద్ధి రేటు నమోదు చేసిందని చెప్పారు. 24 నెలల కాలంలో 18 నెలలుగా కోవిడ్‌తో పోరాడుతున్నప్పటికీ పెట్టుబడుల ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చడంలో తెలంగాణ, తమిళనాడు కంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గణాంకాలే దీనికి నిదర్శనమని, 2019 నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రాజెక్టులు వాస్తవ రూపంలోకి వచ్చాయని వివరించారు. 2019లో రూ.34,696 కోట్లు, 2020లో రూ.9,840 కోట్లు, 2021(జనవరి, ఫిబ్రవరి)లో రూ.1,039 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయని మేకపాటి తెలిపారు. చేతల ప్రభుత్వం.. గత సర్కారు మాదిరిగా ఒప్పందాలు అంటూ హడావుడి, ప్రచారాలు లేకుండా నేరుగా పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. గోల్డ్ ప్లస్ గ్లాస్ సెంచూరీ ఫ్లై, నీల్ కమల్ లాంటి ఫరి్నచర్ కంపెనీలు, జపాన్‌కు చెందిన భారీ టైర్ల తయారీ సంస్థ ఏటీజీ ఇలా పలు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. గత రెండేళ్లలో రూ.34,002 కోట్ల విలువైన ప్రాజెక్టులు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయని, వీటి ద్వారా 1,30,565 మందికి ఉపాధి లభించిందన్నారు. ఇందులో 65 భారీ, మెగా ప్రాజెక్టులు కాగా 13,885 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని చెప్పారు. రూ.1,32,784 కోట్ల విలువైన 67 భారీ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, వీటి ద్వారా 1,56,616 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఇవికాకుండా రూ.1,43,906 కోట్ల విలువైన 67 ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు చురుగ్గా జరుగుతున్నట్లు తెలిపారు. ఇవి కార్యరూపం దాల్చడం ద్వారా 1,56,169 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పారు. దేశ వాణిజ్య ఎగుమతుల్లో 16.8 బిలియన్ డాలర్లతో రాష్ట్రం 5.8 శాతం వాటాను కలిగి ఉందని, దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చడం ద్వారా 33.7 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. సానుకూల వాతావరణం సులభతర వాణిజ్యంలో మొదటి ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ పెట్టుబడితో, నష్టభయం లేని వ్యాపార వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు మేకపాటి తెలిపారు. మూడు పారిశ్రామిక కారిడార్లలో పారిశ్రామిక పార్కులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్‌పోర్టులు, ఐటీ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నిక్‌డిక్ట్ నిధులతో కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ, వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో మెగా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ ఈఎంసీ పనులు వేగంగా జరుగుతున్నాయని, రూ.7,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2023 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. రీస్టార్ట్ ప్యాకేజీ కింద రూ.1,110 కోట్లు ఇచ్చామని, ఈ ఏడాది టెక్స్టైల్ రంగానికి చెందిన కంపెనీలకు ఆగస్టులో రాయితీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ పేరుతో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తూ సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం, ఐటీ శాఖ కార్యదర్శి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి ఎన్నారైల బాసట
గుంటూరు ఎడ్యుకేషన్: గత పాలకుల కబంధ హస్తాలు, కులాల కుంపట్లతో దిగజారిన ప్రవాస భారతీయుల ప్రతిష్ట పునరుద్ధరణ, ఏపీ అభివృద్ధికి స్వచ్ఛంద సేవ, నిధుల సేకరణలో ప్రధాన భూమిక పోషించి రాష్ట్రాభివృద్ధిలో సీఎం వైఎస్ జగన్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాషింగ్టన్ డీసీకి చెందిన ఎన్నారై వల్లూరి రమేష్‌రెడ్డి తెలిపారు. గుంటూరు అమరావతి రోడ్డులోని అవర్ స్టేట్ అవర్ లీడర్, వైఎస్సార్ ఇంటెలెక్చు్యవల్ ఫో రం సంయుక్త ఆధ్వర్యంలో ‘సుపరిపాలన ప్రస్థానంలో రెండేళ్లు–సవాళ్లు–సాఫల్యాలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర’ అంశంపై ఎన్నారైలతో సోమవారం ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. అమెరికా నుంచి వల్లూరి రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీఅభివృద్ధిలో స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. వ్యాపార భాగస్వామ్యాలతో ఎన్నారైలు రాష్ట్రాభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని ఫ్రాన్స్‌కు చెందిన జి.రాహుల్ సూచించారు. పచ్చ మీడియా పోకడలను తిప్పికొట్టాలి మరో ఎన్నారై బొమ్మిరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో వైఎస్ జగన్ సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఎన్నారైలతో పాటు విదేశీ ప్రతినిధులు సైతం గమనిస్తున్నారని చెప్పారు. అలాగే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై నిత్యం బురద జల్లుతున్న పచ్చ మీడియా పిచ్చిపోకడలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సోషల్ మీడియా విభాగానికి ఎన్నారైల తోడ్పాటు అవసరమని రామిరెడ్డి చెప్పారు. ఏపీ ఎన్నారై రీజనల్ కో–ఆరి్డనేటర్ కూచిబొట్ల కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఏపీఎన్ఆర్టీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాల కల్పనలో ఎన్నారైలు భాగస్వాములవుతారని హామీ ఇచ్చారు. ఎన్నారైలు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలి గుంటూరుకు చెందిన వెంకట్ ఇక్కుర్తి మాట్లాడుతూ.. కాల్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు, పరిశోధనలకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నారైలు కీలక భూమిక నిర్వర్తించాలని సూచించారు. నాలెడ్జ్, కల్చరల్ ఎక్సే్ఛంజ్‌ను ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో కీలకమైన శాస్త్ర, సాంకేతిక జ్ఞానాన్ని అందించాలన్నారు. సమావేశంలో ఏఎన్‌యూ ప్రొఫెసర్ మధుబాబు, డాక్టర్ వైఎస్ థామస్‌రెడ్డి, కాపిరెడ్డి కృష్ణారెడ్డి, పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొన్నారు. -
ఏపీ అభివృద్ధికి మరిన్ని నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరిన్ని నిధులను కేటాయించాలని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌ను రాష్ట్ర పరి శ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. పీఎల్ఐ స్కీం కింద కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ గృహోప కరణాల తయారీ యూనిట్ల ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ(ఐసీఏటీ) ఏర్పాటు, తిరుమల కొండపైకి ఎలక్ట్రిక్ బస్సులు, బ్యాటరీ రీచార్జింగ్‌కు స్వాపింగ్ స్టేషన్లు వంటివి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో అమితాబ్‌కాంత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రతి పాదనలను నీతిఆయోగ్ ముందుంచారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రాయితీ ధరలపై అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఈఎంసీని సందర్శించండి వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ ఈఎంసీకి నిధులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు మేకపాటి కృతజ్ఞ తలు తెలియచేశారు. ఈఎంసీ పనులను పరిశీలిం చేందుకు రావాలని ఆహ్వానించారు. రూ.116.75 కోట్లతో వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న స్టేట్ డేటా సెం టర్కు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. కేం ద్ర పరిశ్రమలు, వాణిజ్య కార్యదర్శి అనూప్ వదావ న్ను కూడా మేకపాటి కలుసుకున్నారు. ఏపీఐఐసీ ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా, పరిశ్రమలశాఖ సలహా దారు శ్రీధర్ లంకా తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ బ్యాంక్ అధికారులతో సీఎం జగన్ భేటీ
-
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ
సాక్షి,అమరావతి: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో వరల్డ్ బ్యాంక్ దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్ డైరెక్టర్ షెర్‌బర్న్ బెంజ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం వారితో చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారికి వివరించారు. (చదవండి : చదువుల విప్లవంతో పేదరికానికి చెక్) ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం ప్రశంసలు కురిపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కొనియాడారు. మానవ వనరులపై పెట్టుబడి ద్వారా అభివృద్ది ఫలితాలు వస్తాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని ప్రతినిధులు వెల్లడించారు. (చదవండి : ఇదీ.. నా కల) -
ఏపీ అభివృద్ధికి ఊతమివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితుల గురించి కూలంకషంగా వివరించారు. విభజనానంతరం అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రానికి తగిన విధంగా నిధులు ఇవ్వాలని కోరారు. బుధవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గంటా నలభై నిమిషాల పాటు మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర అంశాలపై ఒక లేఖ అందిస్తూ అందులోని విషయాలన్నింటినీ స్పష్టంగా వివరించారు. ఈ ఏడాది మార్చి 25వ తేదీ.. ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టామని తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానికి సీఎం వైఎస్ జగన్ సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు ఇవీ.. పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించండి ‘2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ, పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి సహకారం కావాలి. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,549 కోట్లు. ఇందులో ఆర్ అండ్ ఆర్ కోసమే రూ.33,010 కోట్ల మేర అవసరం అవుతుంది. కేంద్ర జల వనరుల శాఖలోని సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలు రూ.55,549 కోట్లకు ఆమోదం తెలిపినా, సవరణ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలిపేలా చూడాలి. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.3,320 కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర జల వనరుల శాఖను ఆదేశించండి. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో చర్చిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కేంద్రం పరిధిలోనిదని ఆర్థిక సంఘం చెప్పింది అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా తమ పరిధిలో లేదని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకోవచ్చని చెప్పింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం విభజన అనంతరం తొలి ఆర్థిక సంవత్సరపు రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లు ఉన్నట్లు కాగ్ నిర్ధారించింది. ఇందులో ఇంకా రూ.18,969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించాలి’ అని సీఎం వైఎస్ జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి.. ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందు కోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020కి అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలి. ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం శాసన మండలి ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ.. శాసన మండలిని రద్దు చేస్తూ సిఫారసు చేసింది. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయ శాఖను ఆదేశించండి. సీఎం ప్రధానికి విన్నవించిన మరిన్ని అంశాలు.. – ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ప్రభుత్వంలో ఏ యేడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలి. – కడప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలి. – రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలి. – కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలి. – రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన నిధులు వెంటనే విడుదలయ్యేలా చూడాలి. – గత ఆరేళ్లలో వెనకబడిన ఏడు జిల్లాలకు రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1,050 కోట్లు మాత్రమే ఇచ్చారు. గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవు. బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలి. అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4,000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారు. – మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం–2019పై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలి. -
అట్టడుగున ఉన్నాం.. ఆదుకోండి
పెట్టబడుల కోసమే లండన్ వెళుతున్నా: ఏపీ సీఎం సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సూచికల్లో వెనకబడి ఉందని, వాటితో సమాన బలం వచ్చేంతవరకు కేంద్రం చేయూతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి మరోసారి విన్నవించారు. పెట్టుబడులపై చర్చల కోసం లండన్ ప్రయాణమైన చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకుని కేంద్ర హోం మంతి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశాల అనంతరం ఆయన రాత్రి 10.15కు ఏపీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘గతంలో ప్రధాన మంత్రిని, ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని వివరించాను. మళ్లీ ఈరోజు వివరించాను. విభజన వల్ల దక్షిణ భారతదేశంలో ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంది. 2014-15 తలసరి ఆదాయం లెక్కలు చూస్తే దక్షిణాదిన ఉన్న పొరుగు రాష్ట్రాల కంటే దాదాపు రూ.35 వేలు తక్కువగా ఉంది. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగుళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయి. కానీ ఏపీకి రాజధాని లేదు. విభజన బిల్లులో ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ జోన్, పన్ను ప్రోత్సాహకాలు, పోలవరం పూర్తి తదితర హామీలు పొందుపరిచారు. స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం వంటివి పెట్టారు. రాజ్యసభకు వచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్‌పై ఆనాటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు..’’ అని చెప్పారు. వీటన్నింటినీ త్వరితంగా పూర్తిచేయాలని కోరినట్లు తెలిపారు. రాజధానిపై రాజకీయం చేస్తున్నారు రాజధానిపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షాన్ని చంద్రబాబు విమర్శించారు పెట్టుబడులు కోరేందుకు లండన్ వెళుతున్నట్లు చెప్పారు. కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఆ నమ్మకంతోనే గెలిచాం.. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏ తప్పూ చేయకపోయినా విభజనవల్ల నష్టపోయారని చంద్రబాబు చెప్పారు. ‘‘ఆనాటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్యాయం చేసింది, ఫలితం అనుభవించింది. ఎన్డీయే ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రజలు నమ్మి గెలిపించారు. ఈ విషయమే ఆర్థిక మంత్రికి వివరించా. తొందర్లోనే న్యాయం చేస్తారని ఆశాభావం ఉంది. 2018 నాటికి పోలవరం పూర్తిచేస్తామన్నారు. పట్టిసీమపై కొందరు గందరగోళం చేస్తున్నారు. పోలవరం వచ్చే వరకు అదే కెనాల్‌ను వినియోగించుకుని పట్టిసీమ ద్వారా నీటిని రాయలసీమకు ఇస్తాం’’ అని తెలిపారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేయడం చెల్లదని, దానిపై న్యాయపోరాటం చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఆశ.. శ్వాస.. హోదా
‘‘ప్రత్యేక హోదా కాకుంటే.. ప్యాకేజీ.. హోదా కంటే ఎక్కువే డబ్బులొస్తాయట. ఎందుకు కాదనాలి?..’’ ముఖ్యమంత్రి సహా కొందరు పెద్దల నోటి నుంచి రాలుతున్న ముత్యాలివి. ఈ మాటల గారడీకి మోసపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పయనం తీవ్ర ఒడిదుడుకులకు లోనుకాక తప్పదని మేధావులు హెచ్చరిస్తున్నారు. ప్యాకేజీ పేరుతో ఇవ్వజూపే నిధులపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధమైన హక్కుంది. విభజన గాయాలను మాన్పగల మంత్రం కేవలం ప్రత్యేక హోదా మాత్రమే. హోదా వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక పునాదులు లేస్తాయి. ఉపాధికి బాటలు వేస్తాయి. రాష్ట్ర ప్రగతికి ఇప్పుడు ప్రత్యేక హోదానే రాచమార్గమని నిపుణులు చెబుతున్నారు. ‘ప్రత్యేకమైన హోదా’తో తలెత్తుకుని నిలబడదామని పిలుపునిస్తున్నారు. * ఏపీకి ఆసరా, ఆలంబన ప్రత్యేక హోదానే * అది చట్టబద్ధమైన హక్కు సాక్షి, హైదరాబాద్: మాట.. మంత్రం.. ప్రత్యేక హోదానే. అభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు మార్గం అదొక్కటే. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్యాకేజీని తెర మీదకు తీసుకురావడం.. రాష్ట్ర విభజన అంతటి నిర్హేతుక, అశాస్త్రీయ వాదన. ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటి తలిస్తే.. కేంద్రం మరొకటి చేసింది. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రాష్ట్ర విభజన చేసింది. కనీసం రాజధాని కూడా లేకుండా 13 జిల్లాలతో నూతన ఆంధ్రప్రదేశ్ నిర్హేతు క ఆవిర్భావం జరిగింది. ఫలితంగా పారిశ్రామికంగా దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. బాగా వెనుకబడిపోయింది. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అభివృద్ధికి బాటలు పడతాయి. మరి పరిశ్రమలను ఆకర్షించడం ఎలా? అసలే ఆర్థిక లోటుతో అల్లాడుతున్న రాష్ట్రం.. మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా ఖర్చు చేయడం సాధ్యమా? విభజన బిల్లు మీద రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు.. పెద్దల సభ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్.. రాష్ట్రానికి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చాల్సిన అవసరం లేదని, ప్రధానమంత్రిగా హామీ ఇస్తున్నాననీ స్పష్టం చేశారు. ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని బీజేపీ నేత, ఇప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సభలో గట్టిగా పట్టుబట్టారు. ఆ తర్వాత జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తూ తీర్మానించింది. అ తర్వా త ఎన్నికలు రావడం, ప్రభుత్వాలు మారిపోవడం జరిగిపోయింది. ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న బీజేపీ అధికార పీఠాన్ని అధిష్టించిం ది. కాలం గిర్రున తిరిగి ఏడాదిన్నర గడిచిపోయింది. కానీ ప్రత్యేక హోదా హామీ వాస్తవరూ పం దాల్చలేదు. గట్టిగా కేంద్రాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. మీనమేషాలు లెక్కబెడుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. ప్యాకేజీ ఇచ్చినా సరిపోతుందం టూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హోదా కోసం పట్టుబట్టి సాధిస్తే రాష్ట్రం జాతకమే మారిపోతుందంటూ మేధావులు, వివిధ రంగాల నిపుణులు చెబుతున్నా.. ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. యువతకు ఉద్యోగాలు వస్తాయని, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం వస్తుందని, ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలిగితే సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయవచ్చని చెబుతున్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగం కావాలన్నా, స్వయం ఉపాధితో సొంత కాళ్ల మీద నిలబడాలనుకుంటున్న వారికి చేయూత లభించాలన్నా, సంక్షేమ పథకాల సమర్థ అమలుతో సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నా, విభజన కష్టాల నుంచి గట్టెక్కి అన్ని రంగాల్లో వృద్ధి బాట పట్టాలన్నా.. కేంద్రం ఆసరా తప్పనిసరి. ప్యాకేజీలతో నామమాత్రంగా విదిలించే నిధులను నమ్ముకోవడం కంటే భారీ ప్రోత్సాహకాలు, గ్రాంట్లు లభించే ప్రత్యేక హోదా సాధించుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. హోదాకు ప్యాకేజీ అదనంగా ఉండాలే తప్ప.. ప్రత్యామ్నాయంగా ఉండకూడదని స్పష్టం చేస్తున్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చడానికి ఇటూ నిధులు ఇవ్వాల్సిందే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల ఒనగూడే ప్రయోజనాలను ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శాసనసభ లోపల, వెలుపల పలుమార్లు వివరించారు. రాష్ట్రానికి హోదా ఊపిరి పోస్తుందని చెప్పారు. ఒనగూడే ప్రయోజనాలెన్నో.. సాధారణ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు 30 శాతం దాటవు. మిగతా 70 శాతాన్ని రాష్ట్రాలే భరించాలి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం గ్రాంట్లుగా కేంద్ర సాయం అందుతుంది. మిగతా 10 శాతాన్ని రాష్ట్రం భరిస్తే సరిపోతుంది. అదీ సమకూర్చుకోవడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే.. కేంద్రమే సమకూరుస్తుంది. గ్రాం ట్లుగా ఇచ్చే సాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సత్వర సాగునీటి ప్రయోజనం(ఏఐబీపీ) కింద మంజూరైన ప్రాజెక్టులకూ ఇది వర్తిస్తుంది. 90 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుంది. * పారిశ్రామిక యూనిట్లకు నూటికి నూరు శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. దీంతో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు ముందుకు వస్తారు. పారిశ్రామిక వృద్ధి వేగవంతం కావడానికి ఇది దోహదం చేస్తుంది. * ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-80(సి) కింద కార్పొరేట్ ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు ఇవ్వడానికి ప్రత్యేక హోదా అవకాశం కల్పిస్తుంది. హోదా ఉన్నం త కాలం.. ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు ఉంటుంది. తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 25-50 శాతం మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. * ప్లాంటు, యంత్రాల మీద పెట్టే పెట్టుబడిలో 30 శాతం రాయితీ లభిస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో పాటు ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాత విస్తరణ చేపట్టే పాత పరిశ్రమలకూ ఇది వర్తిస్తుంది. ఔత్సాహికులు సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిర్ణయాలు దోహ దం చేస్తాయి. మధ్య, చిన్న తరహా పరిశ్రమలు విరివిగా ఏర్పాటుకు ఇలాంటి రాయితీలు పనికొస్తాయి.సపరిశ్రమల స్థాపన కోసం తీసుకునే వర్కింగ్ కేపిటల్‌పై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.సపరిశ్రమలకు 20 ఏళ్లకు తగ్గకుండా విద్యుత్ ఛార్జీలపై 50 శాతం రాయితీ ఇస్తుంది. ఇవి కాకుండా ఇన్సూరెన్స్, రవాణా వ్యయంపైనా రాయితీలు ఉంటాయి. * పోత్సాహకాలు, పన్ను రాయితీలు ఉంటే ప్రతిష్టాత్మక పారిశ్రామిక సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి రావడానికి మార్గం ఉంటుంది.నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. * విదేశీ రుణాల భారాన్ని కేంద్రమే భరిస్తుంది. రుణంలో 90 శాతం కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది. వడ్డీనీ కేంద్రమే భరిస్తుంది. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు రూ.5,000 కోట్ల రుణాన్ని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకోవాలనే ప్రతిపాదన ఉంది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైళ్ల ప్రాజెక్టుకు దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ రెండు ప్రాజెక్టులకు కూడా విదేశీ ఏజెన్సీల నుంచి రుణం పొందనున్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ, విజయవాడ మెట్రో రైళ్లు.. విభజన చట్టంలో ఉన్న హామీలే. 90 శాతం రుణం కేంద్రమే భరిస్తే.. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశం లభిస్తుంది. భారీగా ఉద్యోగాలూ వస్తాయి. కారిడార్ వెంబడి అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఉపాధి యువత ముందుకు వస్తుంది.స కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసే సమీకృత మౌలిక సదుపాయాల కల్పన కేంద్రాల ఏర్పాటులో పెట్టుబడుల తీరును ప్రత్యేక హోదా మారుస్తుంది. సాధారణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే కేంద్ర, రాష్ట్ర పెట్టుబడుల నిష్పత్తి 2:3 ఉంటుంది. హోదా ఉంటే.. 4:1 నిష్పత్తిలో ఉంటుంది. ఫలితంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ పెట్టుబడితో కేంద్రాలు ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వస్తాయి. తక్కువ నైపుణ్యం ఉన్న వారికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో ఈ పరిశ్రమలు దోహదం చేస్తాయి. * ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును కేంద్రం ప్రోత్సహిస్తోంది.వీటికి రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. హోదా దక్కితే.. ప్రోత్సాహకాలు, రాయితీలు పెరుగుతాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకు మార్గం ఏర్పడుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా పరిశ్రమలు భారీగా వస్తాయి.గ్రామీణ యువతకు,మహిళలకు ఉపాధి పెరుగుతుంది. కేంద్ర పథకాలు ఇటీవలి కాలంలో 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రాయోజిత పథకాలను కొన్నింటిని తొలగించినప్పటికీ ఇప్పటికీ అనేక పథకాలు కేంద్రం అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాలు చేసే ఒత్తిడి మేరకు వాటి కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉంటున్నాయి. ఇందులో కనిష్టంగా ఏటా రూ.9 వేల కోట్లకు తగ్గకుండా ఆయా పథకాల కోసం కేంద్రం కేటాయిస్తోంది. రాష్ట్రం ఒత్తిడి చేస్తే రూ.15 వేల కోట్లకు తగ్గకుండా ప్రయోజం పొందడానికి వీలుంది. కనిష్టంగా లెక్కలేసినా ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల మేరకు రాష్ట్రానికి విధిగా కేంద్రం నుంచి నిధులు రావలసి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2 లక్షల కోట్లు రావాల్సిందే రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో నష్టం జరగ్గా, ఆ నష్టాన్ని పూడ్చడానికి పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీతో పాటు అనేక వాగ్దానాలు చేశారు. ఆ హామీలిచ్చి ఏడాదిన్నర కావొస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ రాజీధోరణి, మెతకవైఖరి, సాగిలబడుతున్న వైనంతో ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రత్యేక హోదా కావలసిందేనంటూ రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజలను మరోసారి మోసం చేయడానికి కసరత్తు ప్రారంభమైనట్టు చెబుతున్నారు. రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ఏడాదిన్నర కిందట ఇచ్చిన హామీలన్నింటినీ ఒకచోట కూర్చి వాటికి ఎంత ఖర్చవుతుందో లెక్కతీసి దాన్నే ఒక ప్యాకేజీగా ప్రకటించడానికి ప్రయత్నాలు ముమ్మరమైనట్టు విశ్వసనీయ సమాచారం. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటి ని నెరవేర్చడానికి వాటన్నింటికీ లక్షా 50 వేల కోట్ల రూపాయల మేరకు వ్యయం అవుతుందని అంచనా. వీటికి తోడు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే కేంద్రం నుంచి ఆయా పథకాలకు లభించే నిధులను కలిపితే వచ్చే అయిదేళ్ల కాలంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేరకు రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. అయితే వీటినే అటు తిప్పి... ఇటు తిప్పి... దీనికి కొంచెం అటుఇటుగా కేంద్రం నుంచి ఒక ప్యాకేజీ ఇస్తున్నట్టు ప్రకటన చేయించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తద్వారా ప్రత్యేక హోదా నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వీలవుతుందని ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఓ నివేదిక సమర్పించింది. ఇవి కేవలం విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు సంబంధించినవే. ఇప్పటికే ఆ నిధులు మంజూరు కావలసి ఉంది. చట్టం చేయడం ద్వారా హక్కుగా లభించిన హామీలకు గడిచిన ఏడాదిన్నర కాలంగా ఒక్క శాతం కూడా నెరవేరలేదు. ఈ నిర్లక్ష్య ధోరణులపై ప్రజల్లో పెద్దఎత్తున నిరసన లు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్యాకేజీ పేరు తో కొత్త ఎత్తుగడను తెరమీదకు తెచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ముందు ఇప్పుడు ఎలాంటి అడ్డం కులు లేవు.రాజకీయ సంకల్పంతో ప్రత్యేక హోదా ఇవ్వొ చ్చు. దాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 15 నెలలుగా కేంద్రంపై ఒత్తిడి చేయడంలో పూర్తిగా విఫలమైంది.విభజన చట్టంలో... : రాష్ట్రాన్ని విభజించినప్పుడు చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ చట్టంలో కేంద్రం పలు హామీలను ఇచ్చింది. చట్ట రూపంలో వచ్చిన హామీలైనందున వాటిని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేర్చాల్సి ఉంది. అయితే వాటిని ఎప్పటిలోగా నెరవేర్చాలి? వాటిని సాధించుకోవడం వంటి అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే ఒత్తిడిపై ఆధారపడి ఉంటుంది. చట్ట రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కిన హామీల్లో కొన్ని నేరుగా (ఉదాహరణకు విద్యా సంస్థలు) ఏర్పాటు చేస్తామని, కొన్నింటిని కేంద్రమే చేపట్టి పూర్తి చేస్తామని (ఉదా. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు), మరికొన్నింటి విషయంలో సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని ఉంది. రాష్ట్రానికి రావలసిన నిధులతో వాటన్నింటిని నెరవేర్చడానికి వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు రావాలి. రాజధాని అభివృద్ధికి.... పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని పార్ట్ 10 సెక్షన్ 94 లో ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని ఏర్పాటు విషయంలో మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటును అందిస్తామని పేర్కొంది. అందులో సెక్షన్ 94 (3) ప్రకారం విభజిత ఏపీలో రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలితో పాటు ఇతర అత్యవసర మౌలిక సదుపాయల కల్పనలో ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొంది. గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత రాజధాని మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆర్థిక సహాయం అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు కేంద్రం ముందుంచింది. రాజధానిలో కీలక నిర్మాణాల కోసం 15,175 కోట్ల మేరకు ప్రతిపాదనలు పంపింది. (ఈ మొత్తం వచ్చే ఐదేళ్ల కాలంలో సమకూర్చడానికి వీలుగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు) వాటి వివరాలు...