యుద్ధంలో అమరులైన సైనికుల సతీమణులను సత్కరించి గ్రూప్ ఫొటో దిగిన కిషన్‌రెడ్డి, బుగ్గన
సాక్షి, అమరావతి/సాక్షి, విజయవాడ/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం విజయవాడ వచ్చిన ఆయన ఓ ప్రైవేటు హాల్లో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. నీటి విషయంలో ఏపీకి అన్యాయం జరగనిచ్చేది లేదన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలనే కేంద్రం జోక్యం చేసుకుంటోందని, ఉభయ రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు రావడంతోనే నీటి అజమాయిషీ బాధ్యతను మోదీ ప్రభుత్వం తీసుకుందన్నారు. కృష్ణా జలాల సమస్యపై ఇద్దరు సీఎంలు సామరస్యంగా చర్చించుకోవాలన్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు.
వారికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను వెలంపల్లి అందించారు. కిషన్‌రెడ్డి సతీమణికి దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ పట్టు వస్త్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీమ్‌లో దుర్గగుడిని చేర్చాలని కేంద్ర మంత్రికి వెలంపల్లి, వాణీమోహన్‌లు విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మ ఆలయాన్ని టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏపీలో 126 పర్యాటక కేంద్రాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులున్నారు.
ప్రపంచ దేశాలు మనవైపు చూస్తున్నాయ్..
తిరుపతి తుడా/తిరుమల(చిత్తూరు జిల్లా): కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తితో ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయని కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి స్విమ్స్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ నాటికి వ్యాక్సినేషన్ పూర్తిచేసేలా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. పిల్లలతో సహా 130 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. అనంతరం కపిలతీర్థం సమీపంలోని ప్రకృతి ఉద్యాన వనంలోని అమరజవాన్ స్థూపం వద్ద నివాళి అర్పించారు. అమర సైనికుల సతీమణులకు, యుద్ధంలో పోరాటం చేసిన కెప్టెన్‌లకు భారత మాజీ సైనికుల సంఘం, వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment