సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పాలనను అందించడమే నా లక్ష్యం. ఇందుకు ప్రధాని నరేంద్రమోదీ సహకారం, ఆశీస్సులు అవసరం. రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధానమంత్రిని కోరాను. దేశంలోనే అత్యున్నత పారదర్శక విధానాలతో అవినీతిరహిత పాలన అందిస్తాం. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం’ అని ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘టైమ్స్ నౌ చానల్’ మేనేజింగ్ ఎడిటర్ నావికా కుమార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ సంగ్రహంగా...
- నావికా కుమార్: ముఖ్యమంత్రి స్థానానికి మీ ప్రస్థానం మీరు ఆశించిన విధంగానే ఉందా?
వైఎస్ జగన్: భగవంతుని దయ, ప్రజల ఆశీస్సులతో మాకు ఘన విజయం దక్కింది. 14 నెలలపాటు 3,600 కిలోమీటర్లకు పైగా నేను చేసిన పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపించింది. ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రెండు మూడురోజులకు నేను నిర్వహించిన బహిరంగ సభలకు ప్రజలు భారీగా పోటెత్తారు. ఎన్నికల్లో మా పార్టీ ఘన విజయం సాధిస్తుందని అప్పుడే స్పష్టమైంది.
- నావికా: 303 సీట్లతో దేశం మొత్తం నరేంద్ర మోదీకి అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఏపీలో మోదీ మ్యాజిక్ పనిచేయలేదు కదా..
జగన్: ఏపీ ప్రజలు తమను మోసం చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామనే హామీతోనే అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై రాష్ట్రాన్ని విభజించాయి. హోదా ఇస్తామనే హామీతోనే 2014లో బీజేపీ పోటీ చేసింది కూడా. కానీ హోదా ఇవ్వకుండా మోసం చేయడంతో ప్రజలు ఆగ్రహించారు.
- నావికా:మోదీ భారీ మెజార్టీతో గెలవడం పట్ల మీరు నిస్పృహ చెందారా?
జగన్: నాకు 22 సీట్లు ఇచ్చారు. ఈ తీర్పుతో మేము ప్రత్యేక హోదా తెస్తామని భావించాను. జాతీయస్థాయిలో సమీకరణలు అనుకూలించలేదు. ఆయన ప్రధాని, నేను ముఖ్యమంత్రిగా సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. రాష్ట్ర విభజన నాటికి రూ. 97 వేల కోట్లు అప్పు ఉండగా చంద్రబాబు ప్రభుత్వ పాలనతో ప్రస్తుతం అప్పులు రూ. 2.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాదికి వడ్డీలే రూ. 20వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఏడాదికి రూ. 40వేల కోట్లు అప్పులు తీర్చాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని సహకారం, ఆశీస్సులు మాకు కావాలి. మా పరిస్థితిని గమనించి సహకరించాలని కోరాను.
- నావికా: ప్రధాని సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నారు కదా!
జగన్: అవును. ఆయన మాటలు సంతోషం కలిగించాయి. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అని ఇది వరకు అన్నారు. ఇప్పుడు ‘సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్’ అని అన్నారు. మమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన్ను కోరుతున్నాం.
- నావికా: 30న మీ ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించారా?
జగన్: ఆహ్వానించాను. నా ప్రమాణస్వీకార కార్యక్రమానికి మీరు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే మా రాష్ట్రం పట్ల గొప్ప ఔదార్యం కనబర్చినట్లు అవుతుందని చెప్పాను. మీరు వస్తామంటే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం.. నా ప్రమాణ స్వీకారం కంటే కూడా రాష్ట్రానికి మీరు చేసే ప్రకటనే ప్రధాన అంశమవుతుందని చెప్పాను. కానీ అదే రోజు ఆయన తన ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని నిర్ణయించారు. అయినప్పటికీ ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీని కోరుతూనే ఉంటాను. కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందిగా కోరుతూనే ఉంటాను. ఆయన ఒప్పుకునేవరకు ప్రయత్నాలు కొనసాగిస్తాను.
- నావికా: 2014–19 మధ్య ప్రధాని పాలనను చూసి మైనార్టీలు కేంద్ర ప్రభుత్వం పట్ల ఎలా ఉన్నారని భావిస్తున్నారు?
జగన్: ఇంత భారీ మెజార్టీ వచ్చిన తరువాత మైనార్టీలు నరేంద్ర మోదీకి ఓటు వేయలేదని ఎవరూ చెప్పలేరు. అలా విభజించడం సరికాదు. అందరి నమ్మకాన్ని గెల్చుకుంటేనే ఇంత భారీ మెజార్టీ వస్తుంది.
- నావికా: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు చేయాలంటారా?
జగన్: అది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం. వరుసగా రెండుసార్లు ప్రజలు తిరస్కరించారంటే వాళ్లు ఆత్మ విమర్శ చేసుకుని సమీక్షించుకోవాలి. నాయకత్వ మార్పా, విధానాల మార్పా అన్నది వారి నిర్ణయం. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఫలితాలు కూడా వారే భరించాలి.
- నావికా: గాంధీ కుటుంబ నాయకత్వంలేని కాంగ్రెస్ పార్టీ సాధ్యమా?
జగన్: అది కుటుంబం పార్టీ. ఆ పార్టీలో మరొకరికి నాయకత్వం వచ్చే అవకాశం రాదు. అది అంతే.
- నావికా: కుటుంబ వారసత్వ ఓటు బ్యాంకులకు ఈ ఎన్నికల్లో దెబ్బ తగిలింది. అమేథీలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. జ్యోతిరాదిత్య సింథియా, బుపిందర్ హుడా, సుస్మితా దేవ్, మిలింద్ దియోరా ఇలా ఎంతోమంది ఓటమి చెందారు. కానీ వైఎస్సార్ కొడుకుగా మీరు ఘన విజయం సాధించారు. కుటుంబ వారసత్వాల పట్ల వచ్చిన వ్యతిరేకత ప్రభావం మీపై చూపించలేదు...
జగన్: అదంతా ప్రజల ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది. తండ్రి బాగా పని చేస్తే కొడుకు, కూతురు, కుటుంబ సభ్యులకు ఓటేసి ప్రజలు కృతజ్ఞత చూపిస్తారు. ప్రజల ఆదరణను నిలుపుకోవడం, కొనసాగించడం అన్నది పూర్తిగా వారసుల మీద ఆధారపడి ఉంటుంది. కొందరు నిరూపించుకుంటారు. కొందరు నిరూపించుకోలేరు.
- నావికా: 2018 మే 23న కుమారస్వామి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మహాకూటమి నేతలు చేతులు కలిపారు. కుమారస్వామి, చంద్రబాబు, మాయావతి, అఖిలేశ్, మమతాబెనర్జీ.. ఇలా అందరూ వేదికపై కనిపించారు. కానీ వారు మోదీని ఎందుకు ఓడించలేకపోయారు?
జగన్: ఆ నేతలెవ్వరికీ అఖిల భారత స్థాయి లేదు. మోదీకి వ్యతిరేకంగా ఓట్లు కూడగట్ట గలిగే సామర్థ్యం లేదు. మోదీకి ప్రత్యమ్నాయంగా వాళ్లు నిలబడలేదు. సమర్థ ప్రత్యామ్నాయ నేతగా ఎవరినీ చూపించలేకపోయారు. మోదీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీల సమూహాన్ని మాత్రమే ప్రత్యామ్నాయంగా చూపించారు. దాన్ని ప్రజలు విశ్వసించలేదు.
- నావికా: కౌంటింగ్ ముందు రోజు కూడా చంద్రబాబు ఢిల్లీలో అందరి తలుపులు తట్టి ఈవీఎంల మీద సందేహాలు లేవనెత్తారు. మీరు ఈవీఎంల మీద ఏమనుకుంటున్నారు?
జగన్: చంద్రబాబు తన పరువు కోల్పోయారు. మొదట నియోజకవర్గానికి ఒక వీవీ ప్యాట్ లెక్కించాలి అని ఈసీ చెప్పింది. దీనిపై చంద్రబాబు తదితరులు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా పారదర్శకత కోసం నియోజకవర్గానికి కనీసం 5 వీవీప్యాట్‌లు లెక్కించాలని చెప్పింది. కానీ 50శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు మళ్లీ అనవసర రాద్ధాంతం చేశారు. అసలు ఈ వ్యవహారానికి చంద్రబాబే ఓ వైరస్‌లా మారి ఈవీఎంలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు. ఆయన తన ఓటమికి ఓ సాకు వెతకాలని భావించారు. ప్రజలు నన్ను వేరే కారణంతో గెలిపించారని నమ్మించాలనుకున్నారు. కానీ చివరికి ఏమైంది.. నియోజకవర్గానికి లెక్కించిన 5 వీవీప్యాట్‌ల స్లిప్పులు ఈవీఎంలలోని ఓట్లతో సరిపోయాయి. అన్నీ సక్రమంగా ఉన్నాయి. చంద్రబాబు దేశ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించారని స్పష్టమైంది. ఆయన దేశాన్ని తప్పుదారి పట్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని రుజువైంది.
రాష్ట్ర విభజన నాటికి రూ. 97 వేల కోట్లు అప్పు ఉండగా చంద్రబాబు ప్రభుత్వ పాలనతో ప్రస్తుతం అప్పులు రూ. 2.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాదికి వడ్డీలే రూ. 20వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఏడాదికి రూ. 40వేల కోట్లు అప్పులు తీర్చాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని సహకారం, ఆశీస్సులు రాష్ట్రానికి కావాలి. మా పరిస్థితిని గమనించి సహకరించాలని కోరాను. కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందిగా కోరుతూనే ఉంటాను. ఆయన ఒప్పుకునేవరకు ప్రయత్నాలు కొనసాగిస్తాను.
– వైఎస్ జగన్
చంద్రబాబు తన ఓటమికి ఓ సాకు వెతకాలని భావించారు. అందుకే చంద్రబాబే ఓ వైరస్‌లా మారి ఈవీఎంలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారు. మొదట నియోజకవర్గానికి ఒక వీవీ ప్యాట్ లెక్కించాలని ఈసీ చెప్పింది. దీనిపై చంద్రబాబు తదితరులు కోర్టుకు వెళ్లారు. కోర్డు కూడా పారదర్శకత కోసం నియోజకవర్గానికి కనీసం 5 వీవీప్యాట్‌లు లెక్కించాలని చెప్పింది. కానీ 50శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని చంద్రబాబు మళ్లీ అనవసర రాద్ధాంతం చేశారు. కానీ చివరికి ఏమైంది.. నియోజకవర్గానికి లెక్కించిన 5 వీవీప్యాట్‌ల స్లిప్పులు ఈవీఎంలలోని ఓట్లతో సరిపోయాయి. అన్నీ సక్రమంగా ఉన్నాయి. చంద్రబాబు దేశ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించారని స్పష్టమైంది.
– వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment