ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి | CM YS Jagan 45 minutes meeting with the PM Modi About Special Category Status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి

Published Wed, Aug 7 2019 4:01 AM | Last Updated on Wed, Aug 7 2019 10:40 AM

CM YS Jagan 45 minutes meeting with the PM Modi About Special Category Status - Sakshi

రాష్ట్ర ఆర్థిక,పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. విభజనతో 59 శాతం జనాభా, అప్పులు వస్తే.. 47 శాతం మాత్రమే ఆదాయ వనరులు వచ్చాయి. రాజధానిని కోల్పోవడంతో ఆర్థిక అవకాశాలు, ఆదాయాలు, కేంద్ర సంస్థలను కోల్పోయాం. పార్లమెంట్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 13వ షెడ్యూలులో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. మంగళవారం పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో సాయంత్రం 4.35 గంటల నుంచి 5.20 వరకు 45 నిమిషాల పాటు ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొన్న పరిస్థితులు, తమ ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలను ఈ సమావేశంలో వివరించిన ముఖ్యమంత్రి కేంద్రం నుంచి సాయాన్ని అభ్యర్థించారు. వినతిపత్రంలో వివరాలు ఇవీ...

నాలుగు స్తంభాల్లా అభివృద్ధి..
‘‘అభివృద్ధి, ప్రాధాన్యతల్లో గత ఐదేళ్లుగా ఏపీలో చోటు చేసుకున్న అసమానతలను సరిదిద్దేలా చర్యలు చేపట్టాం. మానవ అభివృద్ధి సూచికలను మెరుగుపరచడం, గ్రామీణ–పట్టణ తారతమ్యాలను తొలగించి సామాజిక భద్రత పెంచడం, మౌలిక వసతులు, పరిశ్రమల వృద్ధిపై దృష్టి, పారదర్శకత – అవినీతి రహిత పాలన కోసం సంస్కరణలు తేవడం అనే నాలుగు అంశాల ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈ నాలుగు అంశాలను నాలుగు అభివృద్ధి స్తంభాలుగా భావించి రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాతిపదిక ఆధారంగానే ‘‘నవరత్నాలు’’ రూపొందించాం. రైతులకు రైతు భరోసా, అందరికీ విద్య కోసం అమ్మ ఒడి, విద్యా దీవెన, అందరికీ ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, అందరికీ ఇల్లు లక్ష్యంతో పేదలందరికీ ఇళ్లు, మెరుగైన సామాజిక భద్రత కోసం పెన్షన్ల పెంపు, మహిళా సాధికారత కోసం ఆసరా, వెనకబడిన వర్గాలకు చేయూత, సాగునీటి రంగం అభివృద్ధికి జలయజ్ఞం లాంటి కీలక పథకాలు తెచ్చాం. 

తొలి సమావేశాల్లోనే అభ్యున్నతికి అంకురార్పణ
మా ప్రభుత్వం వచ్చాక తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కీలక చట్టాలు తెచ్చాం. కౌలు రైతుల సంక్షేమం, ఉద్యోగాల కల్పన, అట్టడుగు వర్గాలు, మహిళల సామాజిక–ఆర్థిక అభ్యున్నతికి చట్టాలు తెచ్చాం. అవినీతి నిరోధక యంత్రాంగాన్ని బలోపేతం చేశాం. పబ్లిక్‌ టెండరింగ్‌ వ్యవస్థను మెరుగుపరిచాం. విద్యారంగంలో నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేశాం. సామాన్యుడికి మేలు జరిగేలా ల్యాండ్‌ టైటిల్‌ చట్టం తెచ్చాం.

కరువు కాటు.. తుపాన్ల బీభత్సం..
రాష్ట్రానికి 974 కి.మీ. మేర తీరప్రాంతం ఉంది. ఇందులో 9 జిల్లాలు తుపాన్ల వల్ల ప్రభావితమవుతాయి. మరోవైపు రాయలసీమ, ప్రకాశం జిల్లా నిత్యం కరువు కోరల్లో చిక్కుకుంటున్నాయి. అటు కరువు, ఇటు తుపాన్ల కారణంగా రైతుల కష్టాలు వర్ణణాతీతం. సురక్షిత తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల లేమి, పారిశ్రామికీకరణ లేకపోవడం, ఉద్యోగాల సృష్టి లేక వెనకబాటుతనం ఉంది. అక్షరాస్యత దేశ సగటు కంటే తక్కువగా ఉంది. పౌష్టికాహార లభ్యతలో రాష్ట్రం 11వ స్థానంలో ఉంది. ప్రాథమిక విద్యలో నెట్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (ఎన్‌ఈఆర్‌)లో చివరి స్థానంలో ఉంది. ప్రాథమికోన్నత విద్యలో చివరి నుంచి మూడోస్థానంలో ఉంది. గ్రాస్‌ ఎన్‌రోల్‌ మెంట్‌ రేషియోలోనూ ఇదే పరిస్థితి. పట్టణీకరణలోనూ వెనకబడి ఉంది. ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి తదితర అంశాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించారు. హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్లడం వల్ల మౌలిక వసతులు, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, విద్యా, వైద్య సంస్థలను కోల్పోయాం. సేవా రంగం, ముఖ్యంగా విరివిగా ఎగుమతులు ఉన్న ఐటీ రంగాన్ని కోల్పోయాం.

విద్యుత్‌ రంగం కుదేలు
గత ఐదేళ్లుగా రాష్ట్ర విద్యుత్‌ రంగంలో అస్తవ్యస్త విధానాలను అనుసరించారు. అధిక ధరలతో సంప్రదాయేతర విద్యుదుత్పత్తి సంస్థలనుంచి ముఖ్యంగా పవన విద్యుత్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సంప్రదాయేతర విద్యుత్‌ కొనుగోలు పరిమితి 5–10 శాతం ఉంటే ఆ పరిమితిని దాటి 23.6 శాతం వరకూ కొనుగోలు చేశారు. దీనివల్ల ఏటా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ. 2,654 కోట్ల నష్టం వాటిల్లింది. డిస్కంలు రోజూ రూ. 7 కోట్ల మేర నష్టపోతున్నాయి. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా సంప్రదాయేతర విద్యుత్‌ను తప్పనిసరిగా ప్రోత్సహించాల్సి ఉన్నా గత ప్రభుత్వ హయాంలో కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనికోసం ఉద్దేశపూర్వకంగా గ్రిడ్‌ స్టెబిలిటీని కూడా పణంగా పెట్టారు. గత ఐదేళ్లుగా అనుసరించిన అస్తవ్యస్త విధానాల వల్ల రూ. 20 వేల కోట్ల మేర ఉత్పత్తిదారులకు బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు విద్యుత్‌ వినియోగదారులపై భారం మోపే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే చార్జీలు హెచ్చుస్థాయిలో ఉన్నాయి.

అస్తవ్యస్థంగా ఆర్థిక రంగం
2014–15 నాటికి రూ. 97 వేల కోట్లుగా ఉన్న ఏపీ అప్పులు 2018–19 నాటికి రూ. 2.58 లక్షల కోట్లకు చేరాయి. గత ఐదేళ్లలో వృథా ఖర్చులతోపాటు  అడ్డగోలుగా అంచనా వ్యయాల పెంచారు. ప్రస్తుతం అవన్నీ సరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన మా కష్టాలను రెట్టింపు చేసింది. పన్ను ఆదాయం నామమాత్రంగానే ఉంది. 2013–14లో రెవెన్యూ మిగులు జీఎస్‌డీపీలో 0.5 శాతం ఉండగా 2018–19లో జీఎస్‌డీపీలో 1.3 శాతం రెవెన్యూ లోటుగా మారింది. ద్రవ్య లోటు 2.4 శాతం నుంచి 3.6 శాతానికి ఎగబాకింది’’
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీలు, నాయకులు 

విభజన హామీలను నెరవేర్చండి..
– ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. విభజనతో 59 శాతం జనాభా, అప్పులు వస్తే 47 శాతం మాత్రమే ఆదాయ వనరులు వచ్చాయి. రాజధానిని కోల్పోవడంతో ఆర్థిక అవకాశాలు, ఆదాయాలు, కేంద్ర సంస్థలను కోల్పోయాం. పార్లమెంట్‌ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి.
– ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు ఆరేళ్ల కాలానికి రూ.50 కోట్ల చొప్పున ఇప్పటికి రూ. 2,100 కోట్లు అందాల్సి ఉండగా రూ. 1,050 కోట్లు మాత్రమే విడుదల చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేబీకే తరహాలో మిగిలిన రూ. 23,300 కోట్ల నిధులివ్వాలి. 
– రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు రాయితీలు కల్పించాలి. 10 ఏళ్ల పాటు జీఎస్టీ, ఆదాయపన్ను నుంచి మినహాయింపులు ఇవ్వాలి. 10 ఏళ్ల పాటు 100 శాతం ఇన్సూరెన్స్‌ ప్రీమియం రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి.
– రెవిన్యూ లోటు రూపేణా రూ. 22,948 కోట్లను పూడ్చాలి. 
– పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో ఖర్చు చేసిన రూ. 5,103 కోట్లను రీయింబర్స్‌ చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, పునరావాసం కోసం రూ. 16 వేల కోట్లు మంజూరు చేయాలి.
– కడప స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామంటూ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. ఆ ప్రాంతానికి ఇది చాలా అవసరం. ఇనుప గనులు, నీటి వసతి లభ్యత ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికే ఎంపిక చేశాం. పోర్టు, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు కూడా ఉన్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావాలి.
– దుగ్గరాజపట్నం వద్ద పోర్టు ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. అయితే అక్కడ పోర్టు ఏర్పాటు సాధ్యం కాదని, ప్రత్యామ్నాయ స్థలం చూడాలని నీతి ఆయోగ్‌ సూచించింది. దీనికి బదులుగా రామాయపట్నం వద్ద పోర్టు నిర్మించాలి.
– రాజధాని నిర్మాణం కోసం రూ. 2,500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. 
ఇప్పటి దాకా రూ.1,500 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి కావాల్సినవి కోరతాం.

వీటికి సాయం చేయండి..
– పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రలో చెరువుల అనుసంధానం  కార్యక్రమానికి కేంద్రం సాయం అందించాలి.
– గోదావరి, కృష్ణా అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాకే కాకుండా కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి జలాలు అందించి తాగునీరు, సాగునీటి కొరతను నివారించేందుకు పూనుకున్నాం. దీనికి సాయం చేయండి. 
– కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గిపోవడంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గోదావరి నుంచి వరద జలాలను తరలించాల్సిన ఆవశ్యకత నెలకొంది. గోదావరి– కృష్ణా అనుసంధానానికి సహాయం అందించండి. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇది పరస్పర ప్రయోజనకరం. 
– ఇంటింటికీ రక్షిత తాగునీటి సదుపాయం కల్పించడానికి వాటర్‌ గ్రిడ్‌ను తెస్తున్నాం. 2050 వరకూ ప్రజల అవసరాలను తీర్చిదిద్దేలా గ్రిడ్‌ ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు రూ. 60 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీనికి తగురీతిలో సహాయం అందించండి,
– ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్లు నిర్మించబోతున్నాం. సోషియో ఎకనమిక్‌ కాస్ట్‌ సెన్సస్‌ (సెక్‌) డేటా సరిగా లేకపోవడంవల్ల రాష్ట్రం నష్టపోతోంది. ఈ డేటా వల్ల కేవలం 10.87 లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే కేంద్రం ఎంపిక చేసింది. సెక్‌ డేటాను సరిచేసి అర్హులైన వారందరినీ ఎంపికచేయాలి.

ప్రధాని కార్యాలయ అధికారులతో భేటీ
ప్రధానితో సమావేశానికి ముందు ఢిల్లీ సౌత్‌ బ్లాక్‌లోని ఆయన కార్యాలయ అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. ప్రధాని ప్రిన్సిపల్‌ సెక్రటరీ నృపేందర్‌ మిశ్రా, అదనపు ప్రిన్సిపల్‌ సెక్రటరీ పి.కె.మిశ్రాను కలసి ఏపీకి సంబంధించిన పెండింగ్‌ అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం 3.30 నుంచి 4.20 గంటల వరకు ఈ సమావేశం జరిగింది.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి ఎంపీల ఆత్మీయ స్వాగతం
మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆత్మీయ స్వాగతం పలికారు. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వెంట ఢిల్లీ వచ్చారు. ముఖ్యమంత్రితో పాటు ఎంపీలంతా ప్రధానిని కలసి గ్రూప్‌ ఫోటో దిగారు. తిరిగి వెళ్లే సమయంలో తనను కలసిన యూపీ ఎంపీ జగదాంబికా పాల్, కుటుంబసభ్యులతో ముఖ్యమంత్రి కొద్దిసేపు మాట్లాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement