ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారు...? ఏం చేస్తున్నారు...? ఏ సమస్యపై ఎలా స్పందిస్తున్నారు..? ఇలాంటి ప్రతి అంశాన్నీ రాష్ట్ర ప్రజలే కాదు నెటిజన్లూ ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ప్రధానిగా ఎన్నికైన నరేంద్రమోదిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న తర్వాత జగన్ కొన్ని జాతీయ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిని చూసిన నెటిజన్లు ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాటల్లో ఎంతో పరిణతి కనిపిస్తోందని, జగన్ మంచి పోరాటయోధుడని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి నేతనా కాంగ్రెస్ వదులుకున్నది అని ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్న వయసులో అనేక ముఖ్యమైన అంశాలపై ఒక స్పష్టమైన అవగాహన ఉండడం అరుదైన విషయమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా వేల సంఖ్యలో లైక్‌లు, రీట్వీట్‌లే కాదు కామెంట్లూ కనిపిస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడి గురించి ఇంత స్థాయిలోచర్చ జరగడం, సామాజిక మాధ్యమాలలో సానుకూల స్పందనలు కనిపించడం అరుదని విశ్లేషకులంటున్నారు. వాటిలో మచ్చుకు కొన్ని..
వైఎస్ జగన్ ‘టైమ్స్ నౌ’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఎంతో ఆకట్టుకుంది. ఆయన మాటల్లో పదును, పరిణతి, చిత్తశుద్ధి కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు సమ ఉజ్జీ ఇప్పుడు దొరికాడు. ఇలాంటి రాజకీయ నాయకులు అరుదు. జగన్‌ని వదులుకొని కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయింది.
– సందీప్ ఘోష్, రచయిత
గతంలో ఎప్పుడూ ఇంత అద్భుతమైన యువ నాయకుడిని చూడలేదు. చాలా ప్రశాంతంగా, నిజాయతీగా కనిపించడమే కాదు శక్తిమంతంగా మాట్లాడుతున్నారు.
– మధుకర్ ఉపాధ్యాయ, రచయిత
కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా నిలిచి ఎన్నోసార్లు అధికార అందలాన్ని ఎక్కించిన ఆంధ్రప్రదేశ్‌ను ఆ పార్టీ విభజించి ఉండకూడదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి శక్తిమంతమైన నాయకుడిని వదలుకోకుండా ఉండాల్సింది. వీటి వల్ల కాంగ్రెస్‌కి జరిగిన నష్టం అపారం. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు.
– సాధ్వి కోశల, సామాజిక కార్యకర్త
ఆంధప్రదేశ్ విభజన, జగన్ మోహన్ రెడ్డి అంశంలో కాంగ్రెస్ ఎవరి సలహాలు తీసుకుందో విస్మయంగా ఉంది. జగన్‌ను అవమానించి పార్టీ నుంచి గెంటేశారు. వైఎస్సార్ కుమారుడు అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. జగన్ ఒక రాజు. స్ఫూర్తి ప్రదాత.
– మాలిని అవస్తి, గాయని
జగన్ ముక్కుసూటి మనిషి. ఆయన బహిరంగంగానే చెబుతున్నారు ఏది చెయ్యగలనో, ఏది తన చేతుల్లో లేదో. చంద్రబాబులా ఊసరవెల్లిలా రంగులు మార్చడం, అమలు కాని హామీలు ఇవ్వడం చేయడం లేదు. తను అనుకుంటున్నదేమిటో స్పష్టంగా చెబుతున్నారు. జగన్ ఒక లీడర్.
– పింకీ, ఫ్యాషన్ డిజైనర్
ఇన్ని కోట్ల మంది ఒకేసారి ఒక మనిషిని నమ్మటం, అతను వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం చిన్న విషయం కాదు. జగన్ గారు చేసింది పదేళ్ల యుద్ధం. ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా శక్తిని కోల్పోకుండా తన సైనికుల్లో ఉత్సాహాన్ని నింపిన యోధుడు. హేట్సాఫ్ టూ యూ జగన్ మోహన్ రెడ్డి.
– పూరీ జగన్నాథ్, దర్శకుడు
వైఎస్ జగన్ ఇంటర్వ్యూలను చూడండి. మార్పు కోసం ఆయన ఎంత తాపత్రయపడుతున్నారో అర్థమవుతుంది
– సుమంత్ రామన్, రాజకీయ విశ్లేషకుడు
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను కలుసుకొని వైఎస్ జగన్ ఎంతో అనుకూల వాతావరణం సృష్టించారు. కానీ మూడు సార్లు సీఎం పీఠం ఎక్కిన మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడూ ఘర్షణ వాతావరణం, శత్రుత్వాన్నే అందరిపై పెంచుకున్నారు.
– రామ్‌గోపాల్ వర్మ, దర్శకుడు
జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు. ఎంత ఎదిగినా మీరు ఒదిగిపోయే కనిపిస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరింత కష్టపడతారని ఆశిస్తున్నాము.
– బ్రిడ్జింగ్ ది గ్యాప్, సామాజిక అధ్యయన సంస్థ
రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. ఆయనలో దమ్ము, మానసిక పరిణతి కనిపించాయి. కృతనిశ్చయంతో, అహం లేకుండా మాట్లాడిన మాటలు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. చంద్రబాబులో ఉండే అహం జగన్‌లో మచ్చుకైనా కనిపించలేదు. ప్రధాని మోదీ కూడా ఆయనను మనఃçపూర్వకంగా అక్కున చేర్చుకోవడం ఆనందం కలిగించింది.
– తరుణ్ భట్నాగర్, డాక్టర్
జగన్‌ని వదులుకోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రక తప్పిదం
– స్వాతి చతుర్వేది, జర్నలిస్టు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జగన్ సర్‌ని చూశాను. విమానం ఎక్కడానికి నేను బస్సులో వెళుతుంటే, ఆయన తన కారులో వెళుతున్నారు. జగన్ సర్‌ని చూసి నేను చిరునవ్వు నవ్వితే.. ఆయన చెయ్యి ఊపుకుంటూ వెళ్లారు. ఇంతటి మర్యాదపూర్వకమైన సీఎంని ఎప్పుడూ చూడలేదు. వైఎస్ జగన్ సర్‌కి ప్రణామాలు
– అమిత్ డోక్వాల్, నెటిజన్
వైఎస్సార్ మృతి తర్వాత జరిగిన ఒక సంఘటన నాకు ఇంకా కళ్ల ముందే ఉంది. మా నాన్న నన్ను జగన్ దగ్గరకి తీసుకువెళ్లి ఆయనను సీఎం అని పిలవమని అన్నారు. అప్పుడు నేను జగన్‌తో మిమ్మల్ని సీఎం అని పిలవాలా అంకుల్ అని అడిగాను. దానికి జగన్ పిలుద్దువులేమ్మా దానికి ఇంకా టైమ్ ఉంది అని బదులిచ్చారు.
– ఎల్.ప్రేమ్‌చంద్ రెడ్డి, నిర్మాత
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటమని ప్రజలు నిరూపించారు. జగనన్నకి అభినందనలు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఇన్నాళ్లకు ప్రభుత్వం ఏర్పడింది.
– మంచు విష్ణు, నటుడు
జగన్ మోహన్ రెడ్డికి సోనియా చేసిన అవమానం, ఏపీకి శాపంగా మారిన కాంగ్రెస్ పార్టీ, జగన్ పోరాట పటిమతో మళ్లీ ఎదిగిన తీరు. కలా నిజమా? ఇదంతా ఒక సినిమాను తలపించేలా ఉంది.
– ప్రియా రమణి, నెటిజన్
Comments
Please login to add a commentAdd a comment