హోదా ఇవ్వాల్సిందే  | CM YS Jagan Mohan Reddy Says Special status for AP Is Mandatory | Sakshi
Sakshi News home page

హోదా ఇవ్వాల్సిందే 

Published Wed, Jun 19 2019 4:37 AM | Last Updated on Wed, Jun 19 2019 8:09 AM

CM YS Jagan Mohan Reddy Says Special status for AP Is Mandatory - Sakshi

ప్రణాళికా సంఘం 2015 జనవరి వరకు ఉంది. ఆ తరువాతే నీతి ఆయోగ్‌ వచ్చింది. అంటే 7 నెలలు ప్రణాళికా సంఘం అమల్లోనే ఉంది. ఆ 7 నెలల కాలంలో చంద్రబాబు ప్రణాళికా సంఘాన్ని కలసి కేబినెట్‌ తీర్మానాన్ని అమలు చేయమని అడగటం కానీ, కనీసం లేఖ రాసిన పాపాన కూడా పోలేదు. చంద్రబాబు ఏడు నెలల పాటు ప్రత్యేక హోదాను పట్టించుకోకపోవడం వల్లే కేబినెట్‌ తీర్మానం అమలుకు నోచుకోలేదు.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ వద్దని, రాష్ట్రానికి జీవనాడి అయిన  ప్రత్యేక హోదానే ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఐదు కోట్ల మంది ప్రజల తరఫున కేంద్రాన్ని అభ్యర్థిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. విభజనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతోపాటు ఉపాధి అవకాశాలు లేక నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లే కొంతైనా ఊరట లభిస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఏపీని అభివృద్ధి పథంలో నిలిపేందుకు హోదా అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలపనిదే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోనంటూ నాడు పట్టుబట్టానని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని, మరి అదే పట్టుదల హోదాపై ఎందుకు చూపలేదని నిలదీశారు. నాటి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రణాళికా సంఘాన్ని కలిస్తే సరిపోయేదని, అలాంటి సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకుని చంద్రబాబు 7 నెలలపాటు తాపీగా వ్యవహరించారని విమర్శించారు. ఆయన బాధ్యతగా వ్యవహరించి ఉంటే హోదా అప్పుడే వచ్చి ఉండేదని, మన యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కూడా దక్కేవని పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి ధన్యవాదాలు తెలియచేస్తూ చంద్రబాబు గతంలో ఇదే సభలో తీర్మానం చేశారని, ఈ నేపథ్యంలో రికార్డులను సరి చేసేందుకు ప్రత్యేక హోదాయే కావాలంటూ ఇప్పుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

ఇదిగో అభిజిత్‌సేన్‌ లేఖ ..
ప్రత్యేక హోదా రద్దు కోసం తాము ఎలాంటి సిఫార్సులు చేయలేదంటూ 14వ ఆర్ధిక సంఘం సభ్యుడు అభిజిత్‌సేన్‌ రాసిన లేఖను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ ఎదుట ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను మంజూరు చేస్తూ 2014 మార్చి 2వ తేదీన కేంద్ర మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని గుర్తు చేస్తూ ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందిగా నాటి కేబినెట్‌ ప్రణాళికా సంఘాన్ని ఆదేశించిన నోట్‌ను కూడా ముఖ్యమంత్రి సభ ముందు ఉంచారు. ఈనెల 15వతేదీన ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో కూడా తీర్మానంలోని అంశాలనే ప్రస్తావించానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలోని ముఖ్యాంశాలు ఇవీ..

‘‘అధ్యక్షా...
ఒక రాష్ట్రంగా మనం ఎంత అన్యాయానికి గురయ్యామో ఈ ప్రకటన ద్వారా సభ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెజార్టీ ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించారు. ఇలాంటి విభజన వల్ల కొత్త ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా నిప్పులమీద నడవాల్సి వస్తుందని, ఉద్యోగాలతోపాటు అన్ని రంగాల్లో నష్టపోతుందని తెలిసి కూడా విభజన విషయంలో మొండిగా ముందుకు వెళ్లిన విషయం మన అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన నష్టాలను ప్రత్యేక హోదా సాధన ద్వారానే అంతో ఇంతో పూడ్చుకోగలుగుతాం. ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇదే సభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వండి అని సభ సాక్షిగా మరోసారి తీర్మానం చేయాల్సి వస్తోంది. మాకు ఆ ప్యాకేజీ వద్దు, హోదాయే కావాలని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని పంపుతున్నాం. గత ప్రభుత్వం రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకపోగా మరింత పెరగటానికి కారణమైంది కాబట్టే ఈరోజు మనమంతా ఇంత పోరాటం చేయాల్సి వస్తోంది.

విభజన ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 59 శాతం జనాభాను, అప్పు–చెల్లింపు బాధ్యతలను మనం వారసత్వంగా పొందాం. కానీ 47 శాతం ఆదాయం మాత్రమే పొందాం. ఆదాయాన్నీ, ఉద్యోగాల్ని ఇచ్చే రాజధాని నగరం లేకుండా అతి తక్కువ మౌలిక సదుపాయాలతో మానవ, ఆర్థిక అభివృద్ధి సూచికల్లో వెనకబడి వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోయాం. 2015–2020 మధ్య కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాను పరిగణనలోకి తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రెవెన్యూ లోటు రూ.22,133 కోట్లు ఉంటుందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి డివల్యూషన్‌ తర్వాత రెవెన్యూ మిగులు రూ.1,18,678 కోట్లుగా ఉంటుందనీ 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. వాస్తవంగా గత ఐదు సంవత్సరాలలో మన రెవెన్యూ లోటు రూ.66,362 కోట్లకు విపరీతంగా పెరిగింది. ఇది 14వ ఆర్థిక సంఘం అంచనా వేసిన మొత్తం కంటే మూడు రెట్లు అధికంగా ఉంది. హైదరాబాద్‌ అనేక దశాబ్ధాల వ్యవధిలో దేశంలోని ఇతర రాజధాని నగరాల మాదిరిగానే అత్యుత్తమ ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించింది. ఇందుకు నిదర్శనం 2013–14లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రూ.57 వేల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు ఉండగా హైదరాబాద్‌ నగరం ఒక్కటే రూ.56,500 కోట్ల ఎగుమతులను సాధించింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,411 కాగా ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం రూ.8,397గా ఉంది.

ఉద్యోగాలు లేక వలస వెళుతున్నారు..
కొత్త రాష్ట్రానికి ఎదురయ్యే సవాళ్లను, ఆర్థిక దుస్థితిని దృష్టిలో ఉంచుకుని ఐదు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తూ పార్లమెంటులోనే ప్రకటన చేశారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని నేరుగా ఆర్థిక సహాయం చేయడం ద్వారా, అభివృద్ధిపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా, రాయితీలు కల్పించడం ద్వారా భర్తీ చేస్తామని పార్లమెంటులో చెప్పారు. అయితే రాష్ట్రాన్ని విభజించే సమయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌లో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు. ఇది రాష్ట్రంలో తీవ్ర ఆర్ధిక, సామాజిక దుస్థితికి దారి తీసింది. విభజన సమయంలో రూ.97,000 కోట్లుగా ఉన్న మన రాష్ట్ర రుణం 2018–19 నాటికి ఐదు సంవత్సరాలలో అత్యధికంగా రూ,2,58,928 కోట్లకు చేరింది. రుణంపై వడ్డీ మాత్రమే సంవత్సరానికి రూ.20,000 కోట్లకుపైగా ఉంటే దీనికి అదనంగా అసలు రూపంలో చెల్లించాల్సిన మొత్తం మరొక రూ.20,000 కోట్ల మేరకు ఉంటుంది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వినియోగించుకున్న రుణాల కోసం ఇచ్చిన హామీల రూపంలో భారీ కంటింజెన్సీ చెల్లింపు బాధ్యతలు ఉన్నాయి. మరోవైపు ఉపాధి కల్పన సామర్థ్యం గణనీయంగా పడిపోయి మన పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. 

హోదానే జీవనాడి...
ఈ నిరుత్సాహపూరిత పరిస్థితిని పరిశీలిస్తే.. రాష్ట్రం ఆర్థికంగా, ద్రవ్యపరంగా కోల్పోయిన వాటిని పూరించేందుకు,  అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అత్యధికంగా గ్రాంట్లు లభిస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న గ్రాంట్లు తలసరి రూ.5,573గా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు లభిస్తున్న గ్రాంట్లు తలసరి రూ.3,428 మాత్రమే ఉంది. పైగా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక ఆదాయపు పన్ను మినహాయింపు, జీఎస్‌టీకి సంబంధించిన మినహాయింపులు, ఇతర రాయితీలు, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందిస్తున్నందువల్ల హోదా ప్రాముఖ్యత సంతరించుకుంది. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలన్నా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దారితీసే సత్వర పారిశ్రామికాభివృద్ధి జరగాలన్నా ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రత్యేక ప్రోత్సాహకాలు కీలకం. ప్రత్యేక హోదాతో మాత్రమే మనకు అత్యంత అవసరమైన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, తయారీ రంగంలో పరిశ్రమలు, ఐటీ సేవలు, అత్యుత్తమ విద్యాసంస్థలు వస్తాయి. ఇవన్నీ వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.

అవన్నీ సత్యదూరాలే..
ఒకవైపు నిజం ఇలా ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి రకరకాల సాకులు, వదంతులు ప్రచారంలో ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే వాదనలు వినిపించాయి. ఈ వాదనలన్నీ సత్యదూరం. నిజం ఏమిటన్నది మరోసారి అందరి ముందు ఉంచుతున్నా. 14వ ఆర్ధిక సంఘం గౌరవ సభ్యుడు ప్రొఫెసర్‌ అభిజిత్‌సేన్‌ రాసిన లేఖను మీ ముందు ఉంచుతున్నా. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక కేటగిరీ హోదా రద్దుకు సిఫార్సు చేయలేదని అందులో ఆయన స్పష్టంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరి హోదాను మంజూరు చేస్తూ 2014 మార్చి 2వతేదీన నాటి కేంద్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని గుర్తు చేసుకోవడం కూడా ముఖ్యం. ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని కూడా నాటి కేబినెట్‌ ప్రణాళికా సంఘాన్ని ఆదేశించింది. అయితే గత రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్లానింగ్‌ కమిషన్‌తో మాట్లాడి చేయించకపోవడం వల్లే హోదా అమలు కాలేదు. 2015 జనవరి 1 తర్వాతే ప్రణాళికా సంఘం రద్దై నీతి ఆయోగ్‌ ఏర్పడింది.

ఏపీ మినహా ఏ రాష్ట్రాన్నీ ఇలా విభజించలేదు.. 
అనేక ఇతర రాష్ట్రాలు ప్రత్యేక కేటగిరీ హోదాను కోరుతున్నాయనే వాదనలు, అభిప్రాయాలు కూడా వినిపించాయి. అందువల్ల ఈ అంశంపై నేను మాట్లాడదలుచుకున్నా. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థికంగా, ద్రవ్యపరంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని భర్తీ చేయడానికి ప్రత్యేక హోదా ఇస్తామనే ముందస్తు షరతుతో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ తప్ప మరే రాష్ట్రాన్నీ పార్లమెంటులో విభజించలేదన్న విషయం ఇక్కడ గమనార్హం. నాడు పార్లమెంట్‌లో అటు పాలక పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా దీనికి మద్దతు తెలిపాయి. విభజన కోరిన రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని అందించే రాజధానిని ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. అత్యధిక సంఖ్యలో ప్రజలు, తక్కువ ఆదాయం కలిగిన రాష్ట్రం కాబట్టే న్యాయం చేయడానికి ఇదే సందర్భంగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. హోదా ఇస్తామన్న ముందస్తు హామీతో రాష్ట్రాన్ని విభజించి, ఆ హామీని నిలబెట్టుకోలేని ఆ పార్లమెంట్‌కు రాష్ట్రాన్ని విభజించే హక్కు ఉండడం న్యాయమేనా? ప్రత్యేక హోదానే ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని స్పష్టమైన నేపథ్యంలో ఇక జాప్యం లేకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా ఐదు కోట్ల ప్రజల తరఫున ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా’’

ఇలాగే ఉంటే ఈసారి 13 మందే...
చంద్రబాబు హోదా గురించి నాడు ప్లానింగ్‌ కమిషన్‌ను అడిగి ఉంటే వచ్చి ఉండేదని, అలా చేయకుండా ఆయన తీరిగ్గా ప్రధాని వద్దకు వెళ్లి హోదా అడగడం ఆశ్చర్యకరమని సీఎం వ్యాఖ్యానించారు. ప్లానింగ్‌ కమిషన్‌ ద్వారా ప్రత్యేక హోదా అమలును సాధించగలిగే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఆ తరువాత మళ్లీ ప్రధాని దగ్గరకు వెళ్లడం, కొత్తగా హోదా కోరుతూ తీర్మానం చేయడం లాంటి అవసరం ఉండేది కాదని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నోరు తెరిస్తే సత్యదూరమైన మాటలు చెప్పడం చంద్రబాబుకు అలవాటై పోయిందని సీఎం విమర్శించారు. ఇప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆయన ఇలాగే వ్యవహరిస్తే వచ్చేసారి 13 మంది ఎమ్మెల్యేలకే పరిమితం అవుతారని జగన్‌ వ్యాఖ్యానించారు.

హోదా ఏం పాపం చేసింది బాబూ?
ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నించడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ ఇందులో వివాదాలకు తావు లేదని, గతంలో ప్యాకేజీకి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇదే సభలో తీర్మానం చేసినందున ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ రికార్డులను సరిచేస్తున్నామని చెప్పారు. అయినాసరే చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నించడంతో ముఖ్యమంత్రి జగన్‌ కూర్చుంటూ బంగారంలా మాట్లాడవచ్చంటూ సూచించారు. ప్రతిపక్షానికి మైకులు ఇవ్వకుండా, మాట్లాడనివ్వకుండా చేసే సంప్రదాయం తమది కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.

ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేశారు. ‘29 సార్లు ఢిల్లీ వెళ్లా. పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలపకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోనని చెప్పా’ అని చంద్రబాబు పేర్కొనడంపై ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిస్పందించారు. పోలవరం ముంపు మండలాల గురించి చంద్రబాబు చెబుతున్నారని అయితే ప్రత్యేక హోదా ఏం పాపం చేసింది బాబూ? అని నిలదీశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఎందుకు చెప్పలేకపోయారంటూ చురకలు అంటించారు. ‘ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును సూటిగా అడుగుతున్నా. గుండెపై చేయి వేసుకుని మనస్సాక్షిని అడగండి. మీ చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తుంది’ అని ప్రతిపక్ష నేతనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

ప్రత్యేక హోదాపై శాసనసభలో చర్చ , హోదాపై చర్చలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ప్రత్యేక హోదా తీర్మానానికి మండలిలో బీజేపీ మద్దతు
జాప్యం లేకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ శాసనమండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తీర్మానాన్ని మండలిలో ప్రవేశపెట్టిన అనంతరం బీజేపీ పక్ష నాయకుడు మాధవ్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకు సమాన స్థాయిలో, ఇతరేతర రూపంలో రాష్ట్రానికి సహాయం చేయడానికి కేంద్రం సుముఖంగా ఉందన్నారు. హోదా కోసం పట్టుపట్టకుండా హోదాకు సమాన స్థాయిలో కేంద్రం ఏ రూపంలో సహాయం చేసినా తీసుకోవడానికి ముందుకొస్తే రాష్ట్రానికి ప్రయోజనకరమన్నారు. అయితే ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందన్నారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. హోదా కోరుతూ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కీలక సంఘాల నేతలతో ఒక అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రం వద్దకు తీసుకెళ్తే బాగుంటుందన్నారు. పలువురు సభ్యుల సూచనల అనంతరం సభ హోదా తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 

ప్లానింగ్‌ కమిషన్‌ను కలిస్తే సరిపోయేది
2014 జూన్‌ 8వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, అయితే అంతకంటే ముందే 2014 మార్చి 2న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసిందని, అంతేకాకుండా హోదాను అమలు చేయాల్సిందిగా ప్రణాళికా సంఘానికి కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసిందని ముఖ్యమంత్రి వివరించారు. కేబినెట్‌ తీర్మానాన్ని అమలు చేయించడంలో చంద్రబాబు సరిగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. ‘ప్రణాళికా సంఘం 2015 జనవరి వరకు ఉంది. ఆ తరువాతే నీతి ఆయోగ్‌ వచ్చింది. అంటే 7 నెలలు ప్రణాళికా సంఘం అమల్లోనే ఉంది. ఆ 7 నెలల కాలంలో చంద్రబాబు ప్రణాళికా సంఘాన్ని కలసి కేబినెట్‌ తీర్మానాన్ని అమలు చేయమని అడగటం కానీ కనీసం లేఖ రాసిన పాపాన కూడా పోలేదు’ అని సభలో ముఖ్యమంత్రి నిలదీశారు. చంద్రబాబు ఏడు నెలల పాటు ప్రత్యేక హోదాను పట్టించుకోకపోవడం వల్లే కేబినెట్‌ తీర్మానం అమలుకు నోచుకోలేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కేవలం ప్లానింగ్‌ కమిషన్‌ వద్దకు వెళ్లి కేబినెట్‌ తీర్మానాన్ని అమలు చేయమని కోరితే సరిపోయేదని, అలాంటిది కూడా పట్టించుకోలేదంటే ప్రత్యేక హోదాపై ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమైందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆ తరువాత ప్రత్యేక హోదా కావాలంటూ నీతి ఆయోగ్‌ ఏర్పడిన 9 నెలల తరువాత 01–9–2015న తీర్మానం చేయటాన్ని బట్టి హోదాపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి, ఆరాటం లేదని తేలిపోయిందని పేర్కొన్నారు. చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదని, లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చి రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని పేర్కొన్నారు. అయితే అందుకు భిన్నంగా ఆయన రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. 

హోదా బదులు ప్యాకేజీకి ఒప్పుకున్నా : చంద్రబాబు
ప్రత్యేక హోదా తీర్మానంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ ‘నేను 29 సార్లు ఢిల్లీ వెళ్లా. రాష్ట్ర సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పా. కానీ కేంద్రం స్పందించలేదు. ప్రత్యేక హోదాకు సమానంగా, అంతకు మించి ప్యాకేజీ ఇస్తానంటేనే అప్పట్లో ఒప్పుకున్నా. చివరి బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రం మోసం చేసింది. అందుకే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం. రాజకీయంగా మేం నష్టపోయినా ప్రత్యేక హోదాపై పోరాటం చేశాం. మీరు హోదా కోసం పోరాడితే సహకరిస్తాం. మీకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్నారు కదా హోదా కోసం పోరాడాలి’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement