దేశంలో ఎన్నికల మానిఫెస్టోని తన మంత్రివర్గ సహచరుల ముందు, ఐఏఎస్ అదికారుల ముందు పెట్టి దీనిని అమలు చేసి తీరాలని చెప్పిన నేత ఎవరైనా ఉన్నారా? ఒక్కరే ఉన్నారు. ఆయనే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. తన పాలన ఫలితాలు మీ ఇంటికి అందాయని, మీకు మేలు జరిగిందని నమ్మితే మద్దతు ఇవ్వండని కోరిన నేత ఎక్కడైనా ఉన్నారా? అదీ ఒక్కరే. మళ్లీ వైఎస్ జగనే అని చెప్పాలి. ఇలా ఒకటికాదు. అనేక విషయాలలో సీఎం జగన్ మొదటి స్థానంలో ఉన్నందునే తాజాగా వెల్లడైన సర్వేలో 25 లోక్ సభ స్థానాలకు గాను ఇరవైనాలుగు వైఎస్సార్ కాంగ్రెస్‌కు వస్తాయని వెల్లడైంది.
ఓట్ల శాతాన్ని యధాతథం
టైమ్స్ నౌ, నవభారత టైమ్స్ సర్వేలో వైఎస్సార్‌సీపీకి యాబై ఒక్క శాతం ఓట్లు వస్తాయని అంచనా వేయడం కూడా సంచలనాత్మకమే అని చెప్పాలి. నాలుగేళ్ల పాలన తర్వాత, ప్రభుత్వంపై సాదారణంగా ఎంతో కొంత వ్యతిరేకత ఇక్కడా ఉందని అనుకుంటారు. అలాంటిది తన ఓట్ల శాతాన్ని యధాతథంగా ఉంచుకోవడమే కాదు.. కొద్దిగా పెంచుకోవడం కూడా అరుదైన ఘట్టమే అని చెప్పాలి. జాతీయ స్థాయిలో బీజేపీకి, ప్రధాని మోదీకి ఎలాంటి ఆదరణ ఈ సర్వేలో కనిపించిందో, రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్‌సీపీకి, జగన్‌కు అంతకు మించిన అభిమానాన్ని ప్రజలు కనిపిస్తున్నారని అర్థం అవుతుంది. జగన్ చెప్పే మాటలలో విశ్వసనీయత, నిజాయితీ, నిబద్దత కనిపించడం కూడా దీనికి కారణం అవుతాయి.
2019 ఎన్నికల ముందు వైఎస్ ఏవైతే ప్రకటించారో, వాటిని అమలు చేయడమే కాకుండా, అదనంగా కూడా ఆయన వివిధ కార్యక్రమాలు అమలు చేశారు. దేశంలో ఇంతకాలం ఒక అబిప్రాయం ఉండేది. ఎన్నికల మానిఫెస్టో చూసి ఓట్లు వేస్తే వేయవచ్చు కానీ, తర్వాత అంతా వాటిని మర్చిపోతారని. రాజకీయపార్టీలు అంతే.. ప్రజలు అంతే అని అనుకుంటారు. అలాంటి పరిస్థితిని మార్చిన ఘనత మాత్రం జగన్ దే. మానిఫెస్టోని భగవద్గీత, ఖురాన్, బైబిల్ తో పోల్చిన తొలి నేత ఈయనే అని చెప్పాలి. అలాగే రాష్ట్రంలో ఎన్నో కొత్త వ్యవస్థలను సృష్టించడం ద్వారా ఇదీ అభివృద్ది అంటే. ఇది ప్రజలను ఆదుకోవడం అంటే అని కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి జగన్ అవుతారు.
వైఎస్సార్‌సీపీని అనుసరిస్తున్న బాబు
గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిన్స్, వలంటీర్లు, డిజిటల్ లైబ్రరీలు.. ఇలా ఏపీ అంతటా కలిపి యాభైవేలకు పైగా సంస్థలను ఏర్పాటు చేశారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు పరిశ్రమల రంగంలో, ఇతరత్రా అభివృద్దిలో జాగ్రత్తలు తీసుకుంటూనే సంక్షేమాన్ని విస్తారంగా అమలు చేసి చూపించారు. చివరికి పద్నాలుగేళ్లు అనుభవం ఉందని పలుమార్లు చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం సీఎం జగన్ విధానాలను అవలంభించడానికి సిద్దపడడం పెద్ద విజయం కాదా? చంద్రబాబు మినీ మానిఫెస్టో అంతా మోసఫెస్టో అయినా, జగన్ చేసిన సంక్షేమం కంటే అయిదు రెట్లు అదనంగా చెస్తానని చెప్పడం ద్వారా వైఎస్సార్‌సీపీని ఆయన అనుసరిస్తున్నారన్న సంగతి అందరికి ఇట్టే తెలిసిపోయింది.
ఇలా రకరకాల కారణాలతో సీఎం యాభై ఒక్క శాతం ఓట్లతో 24 లోక్‌సభ సీట్లను గెల్చుకుంటే శాసనసభ ఎన్నికలలో సైతం దాదాపు 175 సీట్లు గెలిచే పరిస్థితి ఉంటుందని భావించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్క సంగతి గుర్తించాలి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కొంత ఫలించి కొంతమంది మద్దతుదారులలో వ్యతిరేకత వచ్చి ఉండవచ్చు. కాని అంతకన్నా ఎక్కువ మంది ఇతర పార్టీలవారు, తటస్థులు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషించుకోవచ్చు.
సీఎం జగన్ ఫిలాసఫీ సక్సెస్ కావడం వల్లే
కులం చూడను, ప్రాంతం చూడను, మతం చూడను, పార్టీలు చూడను అన్ని జగన్ ఫిలాసఫీ సక్సెస్ కావడం వల్లే ఇలా కొత్త మద్దతుదారులు రావడంతో ఆయన ఓట్ల శాతం ఏ మాత్రం తగ్గలేదు. ఇక తెలుగుదేశం పార్టీకి గత శాసనసభ ఎన్నికలతో పోల్చితే ఇంకా నాలుగు శాతం ఓట్లు తగ్గుతున్నాయి. గత ఎన్నికలలో నలభై శాతం ఓట్లు వస్తే, ఈ సర్వేలో అవి 36 శాతానికి పడిపోయాయి. దానికి కారణం ఆయన విధ్వంసకర పాత్రను పోషిస్తుండడమే అనిపిస్తుంది. ఏపీలో అబివృద్ధికి అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా కలుగుతోంది.
అరాచకంగా ఏపీ ప్రభుత్వంపై వార్తలు
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి మీడియా సంస్థలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని, నిజంగా ప్రజలు ఏమి ఆశిస్తున్నారన్నదాని గురించి చంద్రబాబు ఆలోచించలేకపోతున్నారనిపిస్తుంది. పైగా ఈ కార్యక్రమాలను ప్రజలు మర్చిపోవడం కోసం అన్నట్లు లేని శాంతి భద్రతల సమస్యను అధికంగా పోకస్ చేయడం వల్ల టీడీపీకి నష్టం జరుగుతుండవచ్చు. ఈనాడులో ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి మరీ సీఎం జగన్‌పై చెడరాస్తున్నారు. మార్గదర్శి స్కామ్‌ను బయటపెట్టారన్న కోపంతో రాస్తున్నారా అన్న అనుమానం ఉండేది. కాని దానికన్నా బహుశా వారి సొంత సర్వేలలో సైతం జగన్ మద్దతు తగ్గడం లేదన్న సంగతి గుర్తించి వారు ఆందోళన చెంది. మరీ అరాచకంగా ఏపీ ప్రభుత్వంపై వార్తలు, కథనాలు, సంపాదకీయాలు ఇచ్చి ప్రజలలో వ్యతిరేక భావనలు సృష్టించడానికి ఈనాడు రామోజీరావు పడరాని పాట్లు పడుతున్నారనుకోవాలి.
పవన్‌కు ఎజెండా లేకపోవడమే కారణం
ఆంధ్రజ్యోతి గురించి చెప్పడం అనవసరం. ఇక్కడ మరో సంగతి గుర్తించాలి. స్థానిక ఎన్నికలతో పోల్చితే టీడీపీ ఓట్ల శాతం కొంత పెరిగింది. కాని అది శాసనసభ ఎన్నికలలో విజయానికి సరిపోదు. అలాగే స్థానిక ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి వచ్చిన ఓట్ల శాతం కన్నా కొంత తగ్గినా, ప్రభుత్వంలో అధికార పగ్గాలు చేపట్టడం చాలా సులువేనని ఈ టైమ్స్ నౌ, నవభారత్ టైమ్స్ సర్వే చెబుతోంది. జనసేన అదినేత పవన్ కల్యాణ్ ఎంత కృషి చేసినా, జనంలో ఆదరణ పెంచుకోలేకపోతున్నారు. అసలు తనకంటూ ఒక ఎజెండా లేకపోవడం, సీఎంగా పనికిరానని తనకు తానే చెప్పుకుని సెల్ఫ్ గోల్ వేసుకోవడం తదితర కారణాలతో జనసేన ముందుకు వెళ్లలేకపోతోంది.
అప్రమత్తంగా ఉండాల్సిందే
ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా ఫలితంలో పెద్ద తేడా ఉండదని తేటతెల్లమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం యధాతథంగా కొనసాగుతుందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ సీఎం జగన్ ప్రభుత్వం కానీ, వైఎస్సార్‌సీపీ పార్టీ కానీ ఎన్నికల వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే చంద్రబాబు, రామోజీరావు వంటివారు ప్రత్యక్ష యుద్దం కన్నా, కుట్రలు, కుతంత్రాలపైనే ఎక్కువ ఆధారపడతారు. వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టవలసిందే.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment