హోదాతోనే ప్రగతి.. | YS Jagan Mohan Reddy Interview With HTN Channel Managing Editor Barkha Dutt | Sakshi
Sakshi News home page

హోదాతోనే ప్రగతి..

Published Tue, May 28 2019 3:28 AM | Last Updated on Tue, May 28 2019 3:28 AM

YS Jagan Mohan Reddy Interview With HTN Channel Managing Editor Barkha Dutt - Sakshi

‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ఎలాంటి ప్రయోజనం కలగదు. హోదా ఇస్తేనే ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు అందించగలం. దాంతోనే పరిశ్రమల స్థాపన, ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది’ అని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. హెచ్‌టీఎన్‌ ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ బర్ఖాదత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై స్పందించారు.

బర్ఖాదత్‌: కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకుంటారా?
వైఎస్‌ జగన్‌: ప్రత్యేక ప్యాకేజీతో ప్రయోజనం లేదు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో వంద శాతం ఆదాయ పన్ను, జీఎస్టీ మినహాయింపులున్నాయి. అలాంటి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు లభించకపోతే.. ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌లో ఓ హోటల్‌ ఎందుకు కడతారు? పరిశ్రమ ఎందుకు పెడతారు? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి టైర్‌ –1 నగరాలతో పోటీపడాలంటే.. టైర్‌ –2 నగరాలు మాత్రమే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సాధ్యం కాదు కాబట్టి మాకు ప్రత్యేక హోదా అవసరం.

బర్ఖాదత్‌: ఫలితాలు వెలువడేంత వరకూ కూడా చంద్రబాబు ఢిల్లీలో పలువురు రాజకీయ నేతలతో సమావేశాలు జరిపారు. రాష్ట్రంలోనే కాదు. కేంద్రంలోనూ కీలకపాత్ర పోషించగల స్థాయిలో విజయం సాధిస్తామని ఆయన భావించారు. అయనకు అంత విశ్వాసం ఎలా ఏర్పడిందంటారు?
వైఎస్‌ జగన్‌: ఆ సమావేశాలన్నీ గెలుస్తామన్న విశ్వాసంతో చేసినవని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అదో డ్రామా. తాను ఓడిపోతున్నానని, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఉందన్న విషయాన్ని ఆయన ముందుగానే గుర్తించారు. అందుకే రాజకీయంగా జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించుకునే ఉద్ధేశంతో తనను తాను ఓ సంధానకర్తగా, అన్ని పార్టీల వారికి ఇష్టుడిగా చూపించుకునేందుకు ప్రయత్నం చేశారు. అప్పటికే కలిసి ఉన్న వారిని చంద్రబాబు కొత్తగా కలిపేదేముంటుంది? శరద్‌ పవార్, రాహుల్‌గాంధీ మాట్లాడుకోకుండా ఉన్నారా? కుమారస్వామికి, రాహుల్‌ గాంధీకి మధ్య సంబంధాలు లేవా? యూపీఏ కూటమిలో భాగంగా ఉన్న వారిని మళ్లీ కలుపుతానని బాబు వెళ్లడం ఏమిటి?

బర్ఖాదత్‌: ఏపీలో కాంగ్రెస్‌ ఓట్లు రెండు శాతం కంటే తక్కువకు పడిపోయాయి. మీ తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని అన్నారు. మీకు చేసిన అన్యాయానికి శిక్షపడిందని అనుకుంటున్నారా?
వైఎస్‌ జగన్‌: ఈ విషయాలకు ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. ఆ విషయాలను అలా వదిలేద్దాం. ఇప్పుడు వాటి గురించి మరిన్ని వ్యాఖ్యలు చేయడంలో అర్థం కూడా లేదు. ఓటర్లు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. వ్యక్తిగా నేను చేసిందేమీ లేదు. నన్ను విమర్శించిన వారికి ఓటర్లు సమాధానం చెప్పారు.

బర్ఖాదత్‌: విజయం సాధించిన తరువాత ఉదాత్తంగా ఉండాలని అనుకుంటున్నారా? 
వైఎస్‌ జగన్‌: వాస్తవం ఏమిటంటే.. నాకు కక్షలు, కార్పణ్యాలపై నమ్మకం లేదు. మనుషులుగా మనకు ఏ అంశంపై కూడా అధికారం లేదన్నది నా నమ్మకం. అవన్నీ దేవుడి నుంచి వచ్చేవి. ఏ చర్య తీసుకోవాలన్నా అది దేవుడి వల్లే సాధ్యం.

బర్ఖాదత్‌: ఓట్లకు కోట్లు కేసు ఏమవుతుంది? 
వైఎస్‌ జగన్‌: చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా నాకేమీ కక్ష, పగ లేదు. అయితే కొన్ని స్కాములు చేశారు. ప్రజా ప్రతినిధిగా ఉంటూ వాటిని ఎలా విస్మరించగలం. వాటన్నింటినీ వెలికితీసి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధిగా నామీద ఉంది. ఇందుకోసం ఓ విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తాం. భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని కాంట్రాక్టులు కట్టబెట్టారు. రాజధాని భూ సేకరణ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ డబ్బు అంతా ప్రజలది. ఈ అక్రమాలను వెలికితీయాలి. ఆయా పనులకు వాస్తవంగా ఖర్చయ్యేది. ఎంత అన్నది ప్రజలకు చెప్పాలి. ఇందుకోసం రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను చేపడతాం. ఆరు నెలల్లో ఈ దేశానికి, ప్రపంచానికి ఈ ప్రభుత్వం అవినీతి రహితమన్నది చూపుతాం.

బర్ఖాదత్‌: తెలుగుదేశం, కాంగ్రెస్‌ కుట్ర పన్ని మీమీద పెట్టాయని చెబుతున్న కేసుల పరిస్థితి ఏమిటి?
వైఎస్‌ జగన్‌: ప్రజాక్షేత్రంలో 50 శాతం ఓట్లతో ఇచ్చిన విజయం.. నాపై కుట్రలు ఇకనైనా ఆపండి అనేందుకు నిదర్శనం. కక్ష సాధింపు ధోరణితో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పెట్టిన కేసుల్లో డొల్లతనం ఏమిటో ఈ తీర్పుతోనే అర్థమవుతుంది. ఏపీలో నేను ఎలాంటివాడినో, నా తల్లిదండ్రులు ఎలాంటివారో అందరికీ తెలుసు. నా తండ్రి మరణించేంత వరకూ నాపై కేసుల్లేవని, కాంగ్రెస్‌ను వదిలిన తరువాతే ఈ కేసులు వచ్చిపడ్డాయనీ అందరికీ తెలుసు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement