సాక్షి, తాడిపత్రి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారనే అసత్య ప్రచారంపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ మద్దతిచ్చింది వైఎస్సార్‌సీపీకా లేక ప్రత్యేక హోదాకా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన నిలదీశారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబుకు అభ్యంతరం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చాడని చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తనకు వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వడం చంద్రబాబు చూశారా నిలదీశారు. కేసీఆర్ చంద్రబాబుకు ఏమైనా ఫోన్ చేసి చెప్పాడా అని ప్రశ్నించారు. నిసిగ్గుగా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. సోమవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. వైఎస్ జగన్ రాకతో తాడిపత్రి జనసంద్రంగా మారింది. మండుతున్న ఎండను కూడా లెక్కచేయకుండా అక్కడికి తరలివచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర జరిగినప్పుడు ప్రజలు చెప్పిన సమస్యలు గుర్తున్నాయి. కరువు వచ్చినప్పటికీ రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఐదేళ్లుగా ఎలాంటి సాయం అందించడం లేదు. కొద్దో గొప్పో పంట పండిచిన దానికి గిట్టుబాటు ధర ఉండదు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనే చాగల్లు ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే జరగలేదు. నాన్నగారి హయంలోనే హెచ్‌ఎల్‌సీ ఆధునీకరణ పనులు మొదలయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం రాక మునుపే ఆనకట్టు పనులు 55 శాతం పూర్తైతే.. ఈ ఐదేళ్లలో మిగిలిన 45 శాతం పూర్తికాలేదు. పెండేకల్లు ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ హయంలో యూనిట్ కరెంట్ ఛార్జీ 3.70 రూపాయలు ఉంటే.. చంద్రబాబు పాలనలో రూ. 8.70కి పెరిగింది. కరెంట్ ఛార్జీల పెరుగుదలతో గ్రానైట్ పరిశ్రమలు మూతపడ్డాయి. దీని ద్వారా 20 వేల మంది ఉపాధి కోల్పోయారు. చంద్రబాబు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. మీ ప్రతి కష్టాన్ని నేను విన్నాను.. మీకు నేనున్నానని మాట ఇస్తున్నాను.
అంతా అసత్యపు ప్రచారం..
చంద్రబాబు నాయుడు పార్టనర్, ఓ యాక్టర్ ఉన్నారు.. ఆయన ఎమంటున్నారో వింటున్నారు. చంద్రబాబు నాయుడు కొత్త పార్టీలు పుట్టించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పోలిన కండువాలు, గుర్తులు ఇప్పిస్తారు. వీరందరు కూడా రోజు ఏమి మాట్లాడుతున్నారో మీ అందరికి తెలుసు. రోజంతా వీరు అనేది ఒకటే జగన్.. జగన్.. జగన్... దీనికి ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే పండ్లు ఉన్న చెట్టు మీదే రాళ్లు పడతాయనే సామెత గుర్తొస్తోంది. మనం గెలుస్తామని వారికి తెలుసు కాబట్టే ఈ విధంగా కుట్రలు చేస్తున్నారు.
హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించినా విషయాన్ని గుర్తులేదా? కేంద్రం నుంచి రాష్ట్రాలు నిధులు సాధించుకునేలా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేపడుతుంటే.. చంద్రబాబు లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తారు. పక్క రాష్ట్రాలు ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపితే.. చంద్రబాబు కించపరిచేలా మాట్లాడుతారు. గతంలో చంద్రబాబు నాయుడు, ఆయన పార్టనర్ కేసీఆర్‌ను ఎన్నిసార్లు పొగిడారో గుర్తుతెచ్చుకోవాలి. ఓట్లకు కోట్లతో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలి వచ్చారు.
భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆంధ్ర వాళ్లను బెదిరింపులకు గురిచేస్తుందని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే నిజమైతే ఈనాడు రామోజీరావును, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కేసీఆర్ బెదిరించారా?. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు ఆస్తులను ఏమైనా కేసీఆర్ లాక్కున్నారా?. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారనే జ్ఞానం లేకుండా భావోద్వేగాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. తన రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో ఉన్న మన ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు అందితే జట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే రకం.
రోజుకో కట్టుకథ
తాను చేసిన అభివృద్దిని చూపి ఓట్లు అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. వైఎస్ జగన్ అధికారంలో వస్తే ఏదో జరుగుతోందని కట్టుకథలు చెబుతున్నారు. ఓ రోజు తెలంగాణ అంటాడు. మరో రోజు తానే మా చినాన్న చంపించి.. దాన్ని ఎల్లో మీడియా ద్వారా వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఆ హత్య కేసును దర్యాప్తు చేస్తున్నది చంద్రబాబు పోలీసులే.. ఇలా చేస్తే న్యాయం జరుగుతుందా?. చంద్రబాబు కుట్రలను ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికల దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. మనం చంద్రబాబు ఒక్కరితోనే కాదు ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేస్తున్నాం. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి.
చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డిని, ఎంపీ అభ్యర్థి రంగయ్యను ఆశీర్వదించాల్సింది’గా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment