
ఊరూరా ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ
పలుచోట్ల రక్తదాన, అన్నదాన శిబిరాలు, దుస్తుల పంపిణీ
వైఎస్సార్ చిత్రపటాల వద్ద ఘన నివాళి
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించాయి.ఊరూరా పార్టీ జెండాలు రెపరెపలాడాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఆయన చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు కేకులు కట్ చేసి పంచిపెట్టారు.
పలుచోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదానం, దుస్తుల పంపిణీ , ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏ రాజకీయ పార్టీతో పొత్తులు లేకుండా, పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ ఒంటిరిగా పోటీ చేసి, విజయాలను సొంతం చేసుకున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. అనునిత్యం ప్రజాపక్షంగానే వైఎస్సార్‌సీపీ అడుగులు ముందుకు వేసిందని, గత పోరాటాల గురించి చర్చించుకున్నారు.
అన్ని జిల్లాల కార్యాలయాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పార్టీ జెండాను ఎగుర వేసి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో, డివిజన్లు, వార్డుల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకలు ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. జెండా ఆవిష్కరణ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిందాబాద్, జై జగన్ అంటూ పార్టీ శ్రేణులు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. పేదల బతుకుల్లో వెలుగు నింపేందుకు ఏర్పడిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని నేతలు కొనియాడారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం వైఎస్ జగన్ ప్రసంగం అందరినీ ఆకట్టుకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్’ అని వైఎస్ జగన్ అన్న మాటలు అన్ని వర్గాల్లో భరోసా కలిగించాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
జనం గుండెల్లో వైఎస్సార్‌సీపీ
ఈ ఫొటోలో కనిపించే మహిళా వ్యవసాయ కూలీలు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సింగంపల్లికి చెందిన వారు. బుధవారం వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగనన్న చేసిన మేలును, అందించిన పథకాలను గుర్తు చేసుకుంటూ పొలంలోనే వైఎస్సార్‌సీపీ జెండాలతో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి వైఎస్ జగన్ ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. – ఆత్మకూరు
Comments
Please login to add a commentAdd a comment