ప్రాజెక్టుల పరిశీలనకు వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర | YSRCP bus trip for water project issue, says gadikota srikanth | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల పరిశీలనకు వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర

Published Wed, Apr 8 2015 5:11 AM | Last Updated on Tue, Oct 30 2018 3:51 PM

ప్రాజెక్టుల పరిశీలనకు వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర - Sakshi

ప్రాజెక్టుల పరిశీలనకు వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర

  • 15, 16, 17 తేదీల్లో యాత్ర
  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాల్గొననున్న వైఎస్ జగన్
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రపరిశీలన చేసి అక్కడి రైతులతో ముఖాముఖిగా మాట్లాడేందుకు ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమ పార్టీ బస్సు యాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలసి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ బస్సు యాత్రలో పాల్గొంటారని చెప్పారు. 15వ తేదీ ఉదయం రాజమండ్రిలో యాత్ర ప్రారంభించి.. ధవళేశ్వరం, పోలవరం కాలువలు, పట్టిసీమ ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ, వెలుగొండ, బనకచర్ల క్రాస్, పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా హెడ్‌రెగ్యులేటర్ వరకూ మూడు రోజుల పాటు యాత్ర కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కోస్తా, రాయలసీమల్లో ప్రతిపాదిత ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని కోరుకుంటున్నామని, అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధిని తమ పార్టీ కాంక్షిస్తోందని చెప్పారు. దానిగురించే ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
     
    పోలవరాన్ని ఎందుకు అటకెక్కిస్తున్నారు?
    అన్ని అనుమతులూ లభించడంతో పాటు ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తరుణంలో బృహత్తరమైన పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పోలవరాన్ని విభజన చట్టంలో పేర్కొన్నారని, అయినా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇపుడున్న ప్రాజెక్టులపై ప్రతి ఏటా రూ. 2,000 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల వరకూ ఖర్చు చేసి రెండు మూడేళ్లలో వాటిని పూర్తి చేయాలని తమ పార్టీ కోరుతోందన్నారు. కానీ బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఆశాజనకంగా లేవని.. టీడీపీ నేతలు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోందని విమర్శించారు. రాయలసీమకు నీళ్లిస్తామని చెబుతున్న వారు హంద్రీ-నీవా, గాలేరు-నగరికి పూర్తిస్థాయిలో నిధులెందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు.
     
     రాయలసీమలోని 7,000 చెరువులకు నీళ్లు ఇవ్వగలిగామని టీడీపీ మంత్రి ఒకరు సంతోషంగా చెప్పారని, అయితే అందుకు కారణమైన మహనీయుడు ఎవరనే విషయం చెప్పలేదని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులనే మొక్కలు నాటి పెంచి పోషించిన వ్యక్తి పేరును చెట్టు ఫలాలు తింటున్నపుడైనా స్మరించుకోవాలనే కనీస విజ్ఞత వారికి లేకుండా పోయిందన్నారు. పదేళ్ల క్రితం ఎవరు కృషి చేస్తే.. ఇప్పుడు చెరువులకు నీళ్లివ్వగలిగారో చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు ఈ స్థాయిలో ఉన్నాయంటే అందుకు కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. పులిచింతల, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, పట్టిసీమ కాలువలు.. ఇలా ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా వాటి ని తీర్చిదిద్దిన ఘనత వైఎస్‌దేనని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు చేయకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని అప్పట్లో వైఎస్ ఆలోచించారని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement