
సాక్షి, ఏలూరు : సీఎం చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసేందుకు, పోలవరం ప్రాజెక్టు వాస్తవ స్థితిని పరిశీలించేందుకు వైఎస్సార్ సీపీ బృందం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించాలని నిర్ణయించింది. వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సీనియర్ నేతల బృందం గురువారం ఉదయం బస్సు యాత్రకు బయలుదేరింది. యాత్రకు బయలుదేరిన వారిలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా, మరికొందరు కీలకనేతలు ఉన్నారు. విజయవాడలో బయలుదేరి నేరుగా పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని, అనంతరం నేతలు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. టెండర్ల అంశాలను, వాస్తవాలను తెలుసుకోవడానికి వైఎస్ఆర్ సీపీ నేతలు బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఓ పథకం ప్రకారం సమాధి కట్టాలని యోచిస్తోంది. ఈ దుర్మార్గ వైఖరిని ప్రజలకు చూపించాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయించుకుంది.
పోలవరం ప్రాజెక్టును రక్షించేందుకు, సత్వరం నిర్మించేందుకు అన్ని రకాలుగా చంద్రబాబు సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బస్సుయాత్రను మార్గంగా ఎంచుకున్నట్లు వైఎస్ఆర్ సీపీ బృందం తెలిపింది. నిర్వాసితులకు అమలు చేస్తున్న ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి నిర్వాసితులతో మాట్లాడి తెలుసుకుంటామన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు దక్కించుకుని పనులు చేపట్టారని, ఆయన చెబుతున్నదానికి పనులు జరుగుతున్న తీరుకు సంబంధం లేదన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు చెబుతున్న అబద్దాలు, అవాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment