విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల అకాల వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాల్లో తీవ్రనష్టం వాటిల్లిందని, కేంద్రం తక్షణ సాయం వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి భంగం కలిగించేలా ప్రతిపక్షాలు వ్యవహరించరాదని హితవు పలికారు. ప్రత్యేక హోదా, పోలవరం డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగానే అమరావతి ఉద్యమం సాగుతోందని ప్రజలందరికీ తెలుసన్నారు. అమరావతి రైతులకు ఎవరూ వ్యతిరేకం కాదని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, ఎన్.రెడ్డెప్ప, వంగా గీతావిశ్వనాథ్‌లు మీడియాతో మాట్లాడారు.
విపరీతమైన వర్షాలు, వరదలు నాలుగు జిల్లాల్లోని రెండు లక్షలమంది ప్రజలపై ప్రభావం చూపాయని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని ఇప్పటికే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కోరారని చెప్పారు. రాష్ట్ర అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.6వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, కమిటీ నివేదిక రాగానే సాయంచేస్తామని చెప్పారని తెలిపారు.
జస్టిస్ చంద్రుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు
ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ జస్టిస్ చంద్రుపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు మేలుచేసే కార్యక్రమాలు చేపడితే చంద్రబాబు వాటిని ప్రజలకు అందనీయకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడు తూ కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో ఏపీని మభ్యపెడుతూనే పాండిచ్చేరికి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం దారుణమని విమర్శించారు. 20 ఏళ్లలో ఎన్డీయే, యూపీఏ సంయుక్తంగా కలిసి చేసిన పని రాష్ట్ర విభజన ఒక్కటేనన్నారు.
హోదా మరుగునపడిన అంశం కాదని, నిరంతరం పోరాడతామని చెప్పారు. ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ రెవె న్యూ లోటు కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను, ఇతరత్రా పెండింగ్ సొమ్మును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు పార్లమెంటులో పోరాడుతున్నామన్నారు. ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చూపిన చొరవకు గిరిజనుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఇది గిరిజనుల అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పారు.
హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకోరు
ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కేంద్రానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారన్నారు. త్వరలో కేబినెట్ సమావేశం పెట్టి రాష్ట్రానికి హోదా మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు అధికారంలో లేకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. చంద్రబాబు వల్లే అమరావతి ఉద్యమం జరుగుతోందని పేర్కొన్నారు. ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు కలసిరావాలని కోరారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మొక్కను సరిగా నాటకపోవడం వల్లనే ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వృక్షంగా మార్చడానికి ఎన్నో ఇబ్బందులు పడుతోందన్నారు.
కరోనా వల్ల ఇబ్బందులు ఎదురైనా ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నామని, ప్రజలతో ఉండి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన ఎఫ్‌సీఐ, ఉపాధి నిధులు కూడా ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా, విశాఖ జోన్, పోలవరం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాల్లో ప్రజల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు ఎవరూ చేయనట్లుగా పారదర్శక పాలన అందిస్తున్న సీఎం జగన్ పేదల గౌరవాన్ని పెంచారని చెప్పారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని బీజేపీ అజెండాలో కూడా ఉందని గుర్తుచేశారు. అమరావతి రైతుల పట్ల అందరికీ సానుభూతి ఉందన్నారు. జమ్మూకశ్మీర్, అయోధ్య రామాలయం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుని పూర్తిచేసినట్లే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment